• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • FARMERS PROTEST LIVE UPDATES FIRST PLEA IN SC AGAINST AGRI LAWS FILED BY KERALA MP TN PRATHAPAN SK

Agriculture Laws: వ్యవసాయ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్

Agriculture Laws: వ్యవసాయ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలోనూ వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని టీ.కాంగ్రెస్ నేతలు తెలిపారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్, కేంద్రంలో ప్రధాని మోదీ రైతులకు అన్యాయం చేస్తున్నారని విమర్శిస్తున్నారు.

  • Share this:
    కొత్త వ్యవసాయ చట్టంపై దేశవ్యాప్తంగా దుమారం కొనసాగుతోంది. కొత్త చట్టాలతో రైతులకు మరణశాసనం రాస్తున్నారని రైతు సంఘాలు, విపక్షాలు మండిపడుతున్నాయి. రైతులు ప్రతిఘటిస్తున్నా బిల్లులను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో కొత్త చట్టాన్ని సవాల్ చేస్తూ.. కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీ టీఎన్ ప్రతాపన్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ మూడు సంస్కరణలు రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలకు కోత విధించడంతో పాటు రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తాయని పేర్కొన్నారు. వ్యవసాయం అనేది రాష్ట్ర పరిధిలోని అంశమని స్పష్టం చేశారు ప్రతాపన్. ఈ మూడు చట్టాలు రాజ్యాంగ విరుద్ధమని.. సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. వీటిని రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఆయన కోరారు.

    అంతేకాదు రైతుల కోసం ప్రత్యేక ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేసేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. సమాంతర మార్కెట్లకు అవకాశం ఇస్తే రైతుల దోపిడీకి గురవుతారని అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై పంజాబ్‌ సీఎం అమరీందర్ సింగ్‌ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. వ్యవసాయం రాష్ట్రాల పరిధిలోకి వస్తుందని.. కానీ రాష్ట్రాల అభిప్రాయాలు తెలుసుకోకుండానే ఏకపక్షంగా బిల్లులను ఆమోదించారని ఆయన కేంద్రంపై విమర్శలు గుప్పించారు.

    మూడు వ్యవసాయ బిల్లులకు ఆదివారం రాత్రి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం.. రైతుల ఉత్పత్తుల వర్తక, వాణిజ్యం (ప్రోత్సాహం, సదుపాయకల్పన) బిల్లు-2020, ధరల హామీ, పంట సేవల అంగీకార బిల్లు-2020, నిత్యవసర ఉత్పత్తుల (సవరణ) బిల్లు-2020లను ఆమోదించింది. పార్లమెంట్ ఆమోదం తర్వాత ఆ మూడు బిల్లులు రాష్ట్రపతి ఆమోదం కోసం వెళ్లాయి. అయితే, వాటికి ఆమోదం తెలుపవద్దంటూ విపక్షాలకు చెందిన నేతలు రాష్ట్రపతి కోవింద్‌ను కలసి విజ్ఞప్తి చేశాయి. వాటిని మళ్లీ పార్లమెంట్ పునఃపరీశీలను పంపాలని కోరాయి. ఐనప్పటికీ ఆ మూడు బిల్లులకు ఆమోదముద్ర వేశారు రాష్ట్రపతి.

    ఇప్పటికే ఈ వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఈనెల 25న 31 రైతు సంఘాలు భారత్ బంద్‌ నిర్వహించాయి. వారికి పలు ఉద్యోగ సంఘాలు కూడా మద్దతు పలికాయి. మరోవైపు వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఎన్డీయే నుంచి తప్పుకొంది శిరోమణి అకాలీదళ్. బిల్లులకు రాష్ట్రపతి కూడా ఆమోదముద్ర వేయడంతో అక్టోబర్ 1న కిసాన్ మార్చ్‌కు పిలుపునిచ్చింది. మరోవైపు రాష్ట్రపతి ఆమోదాన్ని నిరసిస్తూ.. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రైతుల ఆందోళణలు కొనసాగుతున్నాయి. కర్నాటకలో ఇవాళ రైతు సంఘాలు బంద్ పాటిస్తున్నాయి. రైతులు పిలుపునిచ్చిన బంద్‌కు కాంగ్రెస్, జేడీఎస్‌తో పాటు 108 సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి.

    తెలంగాణలోనూ వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని టీ.కాంగ్రెస్ నేతలు తెలిపారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్, కేంద్రంలో ప్రధాని మోదీ రైతులకు అన్యాయం చేస్తున్నారని విమర్శిస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published: