ఎకరా పసుపు పంటకు రూ.3 నుంచి రూ.3.5 కోట్లు ఆదాయం.. గుజరాత్ రైతుల అద్భుతం.. కారణం ఏంటంటే..

పసుపు పంట (ప్రతీకాత్మక చిత్రం)

Turmeric Crop: రాష్ట్రంలోని సాబర్‌కంఠా జిల్లా రైతులు ఇజ్రాయెల్ టెక్నిక్‌తో గ్రీన్ హౌజ్ విధానంలో పసుపు సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు.

  • Share this:
వ్యవసాయ యంత్రీకరణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రైతులు మంచి లాభాలను పొందవచ్చు. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలు ఈ విషయాన్ని నిరూపించాయి. తక్కువ విస్తీర్ణంలో సాగు చేసి కొత్త పద్ధతుల్లో ఎక్కువ లాభాలు గడించే ఎన్నో పద్ధతులు రైతుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలో గ్రీన్‌హౌజ్ ఫార్మింగ్- ఇజ్రాయెల్ విధానంలో పసుపు సాగుతో రూ.కోట్లలో ఆదాయాన్ని ఆశిస్తున్నారు గుజరాత్ రైతులు. రాష్ట్రంలోని సాబర్‌కంఠా జిల్లా రైతులు ఇజ్రాయెల్ టెక్నిక్‌తో గ్రీన్ హౌజ్ విధానంలో పసుపు సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. దీని ద్వారా సంప్రదాయ సాగుతో పోలిస్తే ఎన్నో రెట్లు ఎక్కువ దిగుబడి, ఆదాయం ఉంటుంది.

సాబర్‌కంఠా జిల్లాలోని రూపాల్ కంపా గ్రామానికి చెందిన ఒక రైతు ఇజ్రాయెల్ పద్ధతిని ఉపయోగించి పసుపు పెంపకానికి గ్రీన్‌హౌజ్‌ను సిద్ధం చేశారు. ఇప్పుడు ఇతర రైతులు సైతం ఈ విధానంపై దృష్టి సారిస్తున్నారు. ఒక రకమైన షెడ్డులో సాగు చేస్తూ.. ఉష్ణోగ్రత, వాతావరణ పరిస్థితుల ప్రతికూల ప్రభావం నుంచి పంటను రక్షించుకునే పద్ధతిని గ్రీన్ హౌజ్‌ అంటారు. ఇజ్రాయెల్ దేశం తక్కువ భూవిస్తీర్ణంలో, తక్కువ నీటిలో కూడా సాగు చేసే ఈ పద్ధతిని ఆవిష్కరించింది. ఇప్పుడు సాబర్‌కంఠా జిల్లా రైతులు కూడా ఇదే పద్దతిలో గ్రీన్‌హౌజ్ ఫార్మింగ్ ద్వారా పసుపు సాగు చేయాలని భావిస్తున్నారు.

రూపాల్ కంపా గ్రామం ఉద్యానవన పంటలకు ప్రసిద్ధి చెందింది. ఈ గ్రామంలోని రైతులు మొదటిసారి ఇజ్రాయెల్ పద్ధతిని ఉపయోగించి పసుపు సాగు చేయడం ప్రారంభించారు. ఈ విధానంలో నాలుగు రెట్లు అధికంగా దిగుబడి హామీ ఉంటుంది. అందువల్ల సాబర్‌కంఠా జిల్లాలోని చాలామంది రైతులు ఇజ్రాయెల్ వ్యవసాయ పద్ధతిని అనుసరిస్తున్నారు. ముందు గ్రామానికి చెందిన చంద్రకాంత్ పటేల్ అనే రైతు నాలుగు ఎకరాల పొలంలో సుమారు రూ.10 కోట్ల ఖర్చుతో గ్రీన్‌హౌజ్ ఏర్పాటు చేశారు. ఇందులో పసుపు పసుపు పంట వేశారు. ఇందుకు హైటెక్ వెర్టికల్ ఫార్మింగ్ పద్ధతిని ఎంచుకున్నారు.

గ్రీన్‌హౌజ్‌లో నేలను క్రమ పద్ధతిలో చదును చేసి గాల్వనైజ్డ్ ట్రే సిస్టమ్‌లో పసుపు మొక్కలు నాటారు. అంటే.. షెడ్డులో నాలుగు, ఐదు వరుసలు ఉండే నిలువు ట్రేలు ఏర్పాటు చేసి.. వాటిలో చిన్న డబ్బాల్లో ఈ మొక్కలను పెంచారు. వీటికి డ్రిప్ సిస్టమ్‌ ద్వారా నీరు అందించారు. ఈ పద్ధతిలో ఎకరానికి 500 నుంచి 800 టన్నుల పసుపు దిగుబడి వస్తుందని స్థానిక వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే సదరు రైతుకు ఎకరానికి రూ.3-3.5 కోట్లు ఆదాయం లభిస్తుంది. ఈ పద్ధతిలో రైతుకు శ్రమ ఉండదని చెబుతున్నారు చంద్రకాంత్ పటేల్. ఎరువులు, నీటికి చేసే ఖర్చు తగ్గడంతో పాటు పెద్ద మొత్తంలో దిగుబడి ఉంటుందని తెలిపారు.

చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఈ పద్ధతిని చూసి స్ఫూర్తి పొందారు. అయితే ఈ పద్ధతిలో సాగు చాలా ఖరీదైనది. దీంతో ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తే లబ్ధి పొందుతామని రైతులు చెబుతున్నారు. గ్రీన్‌హౌజ్‌ నిర్మాణానికి అయ్యే ఖర్చులో రాయితీలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తే.. ఎంతోమంది రైతులు ఇలాంటి ఆధునిక వ్యవసాయం వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.
Published by:Kishore Akkaladevi
First published: