Farmers Protest: అమిత్ షాతో రైతు సంఘాల భేటీ, నేడు కేంద్ర కేబినెట్ సమావేశం

అమిత్ షాతో సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్తున్న రైతు సంఘాల నేతలు

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న రైతు సంఘాలు మంగళవారం (డిసెంబర్ 8) రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యాయి.

  • Share this:
    కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న రైతు సంఘాలు మంగళవారం (డిసెంబర్ 8) రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యారు. ఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్‌లో జరుగుతున్న ఈ భేటీకి 25 రైతు సంఘాల నేతలు హాజరయ్యారు. నేడు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. రైతు చట్టాల మీద కేబినెట్‌లో చర్చించి ఓ నిర్ణయం తీసుకునేందుకే అమిత్ షా వారితో భేటీ అయ్యారనే ప్రచారం జరుగుతోంది. కానీ, నేడు వాస్తవంగా కేంద్రం, రైతు సంఘాల మధ్య చర్చలు జరగాల్సి ఉంది. అమిత్ షాతో రైతుల సమావేశానికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కూడా హాజరయ్యారు. అమిత్ షాతో చర్చల తర్వాత వారు ఢిల్లీ సరిహద్దుల్లోని సింగ్ బోర్డర్‌లో రైతులతో చర్చించి ఆందోళన మీద ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేంద్రం తెచ్చిన చట్టాలను పూర్తిగా రద్దు చేయాల్సిందేనని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ డిమాండ్ విషయంలో వెనక్కి తగ్గేది లేదని చెబుతున్నాయి. ఔనా? కాదా? ఒక్కటే మాట చెప్పాలని రైతు సంఘాలు స్పష్టం చేస్తున్నాయి.



    ఇక దేశవ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగింది. దేశంలోని 25 రాష్ట్రాల్లోని 10000 ప్రాంతాల్లో భారత్ బంద్ దిగ్విజయంగా జరిగినట్టు స్వరాజ్ ఇండియా లీడర్ యోగేంద్ర యాదవ్ తెలిపారు. బురారీ గ్రౌండ్‌కు రావాల్సిందిగా కేంద్రం కోరుతున్నా తాము అక్కడికి వెళ్లబోమని వారు రైతులు స్పష్టం చేస్తున్నారు. అది పేరుకే గ్రౌండ్ అయినా, ఓ రకంగా ఓపెన్ జైలు లాంటిదని రైతులు అభిప్రాయపడుతున్నారు. అంతగా తమ మీద అభిమానం ఉంటే రామ్ లీలా మైదానాన్ని రైతుల కోసం ఇవ్వాలని కోరుతున్నారు. ప్రస్తుతం కొన్ని వేల మంది రైతులు ఢిల్లీ శివారులోని సింఘు బోర్డర్‌లో వేచి ఉన్నారు.

    రైతులకు మద్దతు తెలుపుతున్న ప్రతిపక్షాలు నేడు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌ను కలవనున్నాయి. కేంద్రం తెచ్చిన చట్టాలను వెనక్కి తీసుకునేలా మోదీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని వారు కోవింద్‌ను కలసి విజ్ఞప్తి చేయనున్నారు. మరోవైపు నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్వరాజ్ మేగజీన్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అమితాబ్ కాంత్ మాట్లాడుతూ దేశంలో ‘టూ మచ్ ప్రజాస్వామ్యం’ వల్ల సంస్కరణలు తీసుకురావడం కష్టం అవుతుందని వ్యాఖ్యానించారు.

    ఇక రైతులకు మద్దతుగా ఏపీ, తెలంగాణలో భారత్ బంద్ పెద్ద ఎత్తున నిర్వహించారు. అధికార పార్టీ, ప్రభుత్వాలు కూడా మద్దతు పలకడంతో భారీ ఎత్తున రైతులు, నేతలు రోడ్ల మీదకు వచ్చారు. తెలంగాణలో మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా జాతీయ రహదారులపై ధర్నాలు నిర్వహించి, రైతులకు సంఘీభావం ప్రకటించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మీద నిప్పులు చెరిగారు. వెంటనే కేంద్రం తెచ్చిన మూడురైతు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: