Farmers Protest: కేంద్రం సవరణలను తిరస్కరించిన రైతు సంఘాలు

ఢిల్లీలో రైతుల ధర్నా (File)

Government amendments on Agri Laws: వ్యవసాయ చట్టాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణలను రైతు సంఘాలు తిరస్కరించాయి. కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు రద్దు చేయడం అనేదే తమ ప్రధాన డిమాండ్ అని, అది పూర్తయ్యే వరకు తాము నిరసనను కొనసాగిస్తామని స్పష్టం చేశాయి.

  • Share this:
    వ్యవసాయ చట్టాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణలను రైతు సంఘాలు తిరస్కరించాయి. కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు రద్దు చేయడం అనేదే తమ ప్రధాన డిమాండ్ అని, అది పూర్తయ్యే వరకు తాము నిరసనను కొనసాగిస్తామని స్పష్టం చేశాయి. 14 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు చేస్తున్న రైతులను శాంతింపజేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఐదుసార్లు చర్చలు జరిపింది. అయితే, ఆ చర్చలు ఫలప్రదం కాలేదు. డిసెంబర్ 8న మంగళవారం రాత్రి కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా రంగంలోకి దిగి రైతులతో చర్చించారు. కానీ, మూడు చట్టాలు రద్దు చేయాల్సిందేనని రైతులు డిమాండ్ విషయంలో వెనక్కి తగ్గలేదు. దీంతో డిసెంబర్ 9న జరగాల్సిన చర్చలు రద్దయ్యాయి. మరోవైపు మూడు చట్టాలు రద్దు చేయడం కాకుండా మధ్యే మార్గంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనలు చేసింది. చట్టాల్లో 7 సవరణలను ప్రతిపాదించింది. అలాగే, కనీస మద్దతు ధర విషయంలో రాతపూర్వక హామీ ఇస్తామని చెప్పింది. అయితే, దాన్ని చట్టంలోనే పెట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కొత్త చట్టాల వల్ల మార్కెట్ వ్యవస్థ దెబ్బతింటుందని రైతులు ఆందోళనలో ఉండడంతో మండీ వ్యవస్థకు భరోసా కల్పిస్తామని కేంద్రం చెబుతోంది.



    కేంద్రం తయారు చేసిన ముసాయిదా ప్రతిపాదనలను 13 రైతు సంఘాలకు పంపింది. వీటికి సంబంధించి రైతులకు ఏమైనా సందేహాలు ఉంటే తాము నివృత్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా ప్రకటించింది. కానీ, చట్టాల రద్దు విషయంలో అందులో ఎలాంటి ప్రస్తావన చేయలేదు. అంటే, ‘రద్దు కుదరదు. సవరణలపై ఏమైనా ఉంటే మాట్లాడండి.’ అని కేంద్రం రైతులకు సందేశం పంపింది. ఈ సవరణల ప్రతిపాదనలకు సంబంధించి రైతులు తమలో తాము చర్చించకున్నారు. తమ ప్రధాన డిమాండ్ విషయంలో రద్దు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. అప్పటి వరకు తమ పోరాటం కొనసాగుతుందని తేల్చి చెప్పారు.



    పాన్ కార్డు ఉన్న ఎవరైనా కూడా మార్కెట్ల బయట రైతుల నుంచి ఉత్పత్తిని కొనుగోలు చేసుకోవచ్చని కొత్త చట్టాల్లో ఉందని, దీని వల్ల సమస్యలు వస్తాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, దీనిపై రూల్స్ తీసుకొస్తామని కేంద్రం చెప్పింది. స్థానిక రైతులు, పరిస్థితులకు అనుగుణంగా నిబంధనలను రూపొందిస్తామని తెలిపింది. అలాగే, కొత్త చట్టాల వల్ల ఏదైనా సమస్యలు ఎదురైతే రైతులు సివిల్ కోర్టుల్లో అప్పీల్ చేసుకునే అవకాశాన్ని కోల్పోతారు. దీనిపై సవరణ తీసుకొస్తామని కేంద్రం సూచించింది. ప్రస్తుతం ఏమైనా వివాదాలు ఉంటే ఎస్‌డీఎం స్థాయిలో పరిష్కరించుకుంటున్నారు. రేపు కార్పొరేట్ శక్తులు వ్యవసాయంలోకి ప్రవేశిస్తే అప్పుడు రైతులు వారితో ఢీకొట్టి పోరాడే పరిస్థితులు ఉండవని, అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    రైతుల భవిష్యత్ కార్యాచరణ
    డిసెంబర్ 12న దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాలా వద్ద
    డిసెంబర్ 12న ఢిల్లీ జైపూర్ హైవే దిగ్బంధం
    డిసెంబర్ 14న ఢిల్లీలో మహా ర్యాలీ
    రాష్ట్ర రాజధానులు, జిల్లా కేంద్రాల్లో కూడా ఆందోళనలు


    ‘మూడు వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలనేది మా ప్రధాన డిమాండ్. దానిపై వెనక్కి తగ్గేది లేదు. కేంద్రం పంపిన సవరణలను తిరస్కరిస్తున్నాం. మా డిమాండ్ నెరవేరే వరకు పోరాటం చేస్తాం. నిన్న (డిసెంబర్ 8) అమిత్ షాతో చర్చల్లో పురోగతి కనిపించలేదు. చట్ట సవరణలకు సానుకూలంగా ఉన్నామని అమిత్ షా చెప్పారు. రైతులకు లాభం జరుగుతుందని కేంద్రం చెబుతుంది కానీ, ఏం లాభం జరుగుతుందో మాత్రం చెప్పడం లేదు.’ అని రైతు సంఘాల నాయకులు అన్నారు.

    రైతుల సమస్యలు పరిష్కరించడంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అత్యంత గర్వంతో ప్రవర్తిస్తోందని ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కో ఆర్డినేషన్ కమిటీ వ్యాఖ్యానించింది. కేంద్రం పంపిన సవరణ ప్రతిపాదనలను తిరస్కరించింది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: