దసరాకు మోదీ-షా దిష్టిబొమ్మల దగ్ధం -12న క్యాండిల్ ర్యాలీ, 18న రైల్ రోకో - 26న లక్నో మహాసభ -Lakhimpur హింసపై Farmers పోరుబాట

లఖీంపూర్ హింసపై రైతుల నిరసన బాట

Farm unions announce fresh protests: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న పోరాటంలో లఖీంపూర్ ఘటన కీలక మలుపుగా మారింది. రైతులపై హింసాకాండకు వ్యతిరేకంగా, ఆ కేసులో నిందితులైన కేంద్ర మంత్రి కుటుంబంపై చర్యలు డిమాండ్ చేస్తూ రైతుల సంఘాలు సరికొత్త ఉద్యమ కార్యాచరణ ప్రకటించాయి. వివరాలివే..

  • Share this:
సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న నిరసనోద్యమం మరింత తీవ్రతరం కానుంది. ఉత్తరప్రదేశ్ లోని లఖీంపూర్ ఖేరీ జిల్లాలో రైతులపై హత్యాకాండ తర్వాత ఉద్యమం కీలక మలుపు తిరగబోతున్నట్లు రైతు సంఘాల నేతలు స్పష్టమైన సంకేతాలిచ్చారు. లఖీంపూర్ ఘటన జరిగి వారం కావొస్తున్నా ఇప్పటికీ నిందితులను అరెస్టు చేయకపోవడం, ఆరోపణలు ఎదుర్కొంటున్న అజయ్ మిశ్రా ఇంకా కేంద్ర మంత్రివర్గంలోనే కొనసాగుతుండటాన్ని తీవ్రంగా పరిగణిస్తోన్న రైతులు.. తాజాగా మరిన్ని ఆందోళనలకు పిలుపునిచ్చారు..లఖీంపూర్ ఘటనలో యూపీ, కేంద్ర ప్రభుత్వాలు అనుసరిస్తోన్న తీరును రైతుల సంఘాల సమాఖ్య సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం)  తప్పుపట్టింది. లఖింపూర్ హింసలో ప్రధాన ముద్దాయి ఆశిష్ మిశ్రాను వెంటనే అరెస్టు చేయాలని, మొత్తం ఘటనకు సూత్రధారి అయిన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా టేనిని పదవి నుంచి తొలగించాలన్న డిమాండ్ తో ఎస్‌కేఎం తాజా నిరసనల తేదీలను ప్రకటించింది..లఖీంపూర్ ఘటనను నిరసిస్తూ ఈనెల 12 నుంచి 26వ తేదీ వరకు వరుసగా ఆందోళనలను కొనసాగిస్తామని కిసాన్ మోర్ఛా తెలిపింది. ఈనెల 12న లఖీంపూర్ లో అమరుల సంస్మరణ సభ నిర్వహిస్తామని, దానికి దేశవ్యాప్తంగా ఉన్న రైతులు హాజరవుతారని, అదే అక్టోబర్ 12న దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఎక్కడికక్కడ పౌర సంస్థలన్నీ రాత్రి 8 గంటలకు క్యాండిల్ ర్యాలీ చేపట్టాలని మోర్ఛా కోరింది.దసరా పండుగ సందర్భంగా ఈసారి రాక్షసవధ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల దిష్టి బొమ్మలను దగ్ధం చేయాలని సంయుక్త కిసాన్ మోర్ఛా ప్రజలకు పిలుపునిచ్చింది. ఆందోళనల్లో భాగంగా ఈనెల 18న దేశవ్యాప్త రైల్ రోకోను చేపడతామని కిసాన్ మోర్ఛా ప్రకటించింది. చివరిగా ఈనెల 26న లక్నో నగరంలో భారీ మహాపంచాయత్ నిర్వహిస్తామని కిసాన్ మోర్ఛా నేతలను మీడియాకు తెలిపారు. అప్పటికీ లఖీంపూర్ బాధితులకు న్యాయం దక్కకుంటే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని, సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతోన్న నిరసనలకు అదనంగా యూపీపై కార్యాచరణ ఉంటుందని మోర్ఛా నేతలు వివరించారు.
Published by:Madhu Kota
First published: