మంగళవారం ఢిల్లీలో జరిగిన ట్రాక్టర్ ర్యాలీలో ఓ రైతు మరణించిన విషయం తెలిసిందే. అతడి మృతిపై తీవ్ర దుమారం చెలరేగింది. పోలీసుల కాల్పుల్లోనే అతడు మరణించాడని రైతు సంఘాలు ఆరోపించాయి. ఐతే ఆ ఆరోపణలను ఖండిస్తూ ఢిల్లీ పోలీసులు వీడియో విడుదల చేశారు. ట్రాక్టర్ బోల్తాపడడంతోనే రైతు మరణించాడని వెల్లడించారు. అతివేగంతో బారికేడ్లను ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగిందని.. ఈ విషయంలో పోలీసులపై ఆరోపణలు చేయడం తగదని అన్నారు. ఆందోళనకారులే తమపై దాడులు చేశారని.. మీడియాలో వచ్చిన వీడియోలో అందుకు సాక్ష్యమని చెబుతున్నారు. ఐతే ట్రాక్టర్ బోల్తాపడి మరణించిన రైతు గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
గణతంత్ర దినోత్సవం వేళ ట్రాక్టర్ ర్యాలీ నేపథ్యంలో.. ఢిల్లీలోని ఐటీవో ప్రాంతంలో పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటుచేశారు. రైతులు వెళ్లకుండా అడ్డుకున్నారు. కానీ ఓ రైతు మాత్రం అతివేగంతో దూసుకొచ్చి బ్యారీకేడ్ను ఢీకొట్టాడు. అనంతరం ట్రాక్టర్ బోల్తాపడి అక్కడికక్కడే మరణించాడు.
#WATCH | A protesting farmer died after a tractor rammed into barricades and overturned at ITO today: Delhi Police
— ANI (@ANI) January 26, 2021
CCTV Visuals: Delhi Police pic.twitter.com/nANX9USk8V
మరణించిన వ్యక్తిని 27 ఏళ్ల నవ్రీత్ సింగ్ హుందాల్గా పోలీసులు గుర్తించారు. అతడి కుటుంబ నేపథ్యం గురించి పోలీసులు ఆరాతీయగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నవ్రీత్ సింగ్ స్వస్థలం యూపీలోని రామ్‌పూర్ జిల్లా బిలాస్పూర్. ఆస్ట్రేలియాలో అతడు గ్రాడ్యుయేషన్ చేస్తున్నాడు. ఇటీవలే ఇండియాకు వచ్చి.. ఇంటి వద్దే ఉంటూ వ్యవసాయం చేస్తున్నాడు. ఐతే కొన్ని రోజుల క్రితం ఉత్తరాఖండ్‌లోని బజాపూర్లో ఉన్న బంధువుల ఇంటికి వెళ్తున్నట్లు చెప్పి వెళ్లాడని కుటుంబ సభ్యులు చెప్పారు. కానీ అతడు ఢిల్లీ ఆందోళనల్లో పాల్గొన్న విషయం తమకు తెలియదని వెల్లడించారు.
ఐతే అతడు బంధువుల ఇంటికి వెళ్లకుండా యూపీ నుంచి ఘాజిపూర్ సరిహద్దుకు వెళ్లి.. అక్కడ ఆందోళనల్లో పాల్గొన్నాడు. మంగళవారం జరిగిన ట్రాక్టర్ ర్యాలీలోనూ పాల్గొన్నాడు. కానీ ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తాపడి మరణించాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఆస్ట్రేలియాలో గ్రాడ్యుయేషన్ చేస్తున్న అతడు.. ఇండియాకు తిరిగి ఎందుకు వచ్చాడన్న దానిపై వివరాలు తెలుసుకుంటున్నారు. నవ్రీత్ సింగ్ హుందాల్ మృతితో అతడి స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Agriculture, Delhi, Farmers Protest