మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ శివారులో నెల రోజులుగా రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. ఎముకలు కొరికే చలిని కూడా లెక్కచేయకుండా రైతులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇటు రైతులు పట్టు వీడం లేదు. అటు కేంద్రం మెట్టు దిగడం లేదు. అందుకే కొన్ని రోజులుగా ఈ అంశం ఎటూ తేలడం లేదు. రైతుల సమస్యలపై చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని.. చర్చలకు రావాలని కేంద్రం పదే పదే విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఆహ్వానంపై శనివారం రైతు సంఘాలు స్పందించాయి. ఈ నెల 29న ఉదయం 11 గంటలకు కేంద్రంతో చర్చలు జరుపుతామని సంయుక్త్ కిసాన్ మోర్చా (SKM) నేతలు తెలిపారు. కేంద్రంతో మరోసారి చర్చలు జరపాలని నిర్ణయించినట్లు స్వరాజ్ ఇండియా నేత యోగేంద్ర యాదవ్ పేర్కొన్నారు.
We propose to hold another round of talks with the Centre at 11 am on 29th December: Yogendra Yadav, Swaraj India#FarmLaws pic.twitter.com/BEAG9pkzP3
— ANI (@ANI) December 26, 2020
మరోవైపు పంజాబ్ నుంచి ఢిల్లీకి రైతులు భారీగా తరలి వస్తున్నారు. ఢిల్లీ శివారులోని సింఘు, టిక్రీ వద్ద ఆందోళనలు చేస్తున్న రైతుల కోసం రేషన్, ఇతర నిత్యావసర సరుకులు తీసుకొని శనివారం చాలా మంది రైతులు బయలుదేరారు. సంగ్రూరు, అమృత్‌సర్, తర్ తరన్, గుర్దాస్‌పూర్, బతిందా జిల్లా నుంచి రైతులు ఢిల్లీకి బయలుదేరినట్లు రైతు సంఘాలు నేతలు వెల్లడించారు. విపరితంగా మంచు కురుస్తున్నా.. ఎములు కొరికే చలి వణికిస్తున్నా.. వారంతా ఆందోళనల్లో పాల్గొనేందుకు వస్తున్నారని పేర్కొన్నారు. అటు మహారాష్ట్రకు చెందిన ఆల్ ఇండియా కిసాన్ సభ రైతుల 'వాహనాల జాతా' కార్యక్రమం కొనసాగుతోంది. డిసెంబరు 21న ఢిల్లీకి వాహనాలతో బయలుదేరారు రైతులు. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోకి వాహనాల జాతా ప్రవేశించింది.
ఇక కేంద్రం వైఖరిని నిరసిస్తూ మాజీ ఎంపీ హరిందర్ సింగ్ ఖల్సా బీజేపీకి రాజీనామా చేశారు. కొత్త చట్టాలు వద్దని రైతులు నెల రోజులుగా ఆందోళనలు చేస్తున్నా.. కేంద్రం ఏ మాత్రం కనికరించడం లేదని ఆయన విమర్శించారు. రైతులతో పాటు వారి భార్యాపిల్లలు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
కాగా, రైతుల సంఘాలు, కేంద్రం మధ్య ఇప్పటికే పలు దఫాల చర్చలు జరిగాయి. కానీ ఎలాంటి పరిష్కారం దొరకడం లేదు. కేంద్రం చెప్పిన ఏ ప్రతిపాదనకూ రైతులు అంగీకరించడం లేదు. మూడు చట్టాలను రద్దు చేయాల్సిందేనని పట్టుబట్టుతున్నారు. మరోవైపు కేంద్రం కూడా ఆ మూడు చట్టాలను రద్దుచేసే ప్రకస్తే లేదని తేల్చిచెప్పింది. రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికే చట్టాలను తెచ్చామని.. అపోహలతో ఆందోళనలు చేయడం సరికాదని సూచిస్తోంది. విపక్షాల ఉచ్చులో పడవద్దని రైతులకు సూచించింది. కేవలం రాజకీయ లబ్ధి కోసమే విపక్షాలు రైతులను రెచ్చగొడుతున్నాయని ప్రధాని మోదీతో పాటు కేంద్రమంత్రులు విమర్శిస్తున్నారు. కొత్త చట్టాలపై ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే కేంద్రంతో మరోసారి చర్చలు జరిపేందుకు రైతు సంఘాల నేతలు అంగీకరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Agriculture, Delhi, Farmers Protest, New Agriculture Acts