Home /News /national /

FARM LAWS TIMELINE CENTRE REPEALS LAWS AFTER OVER A YEAR OF PROTESTS TALKS ARRESTS GH SK

Farm Laws Timeline: ఆర్డినెన్స్ నుంచి రద్దు వరకు.. సాగు చట్టాల విషయంలో ఎప్పుడు ఏం జరిగింది?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Farm Laws: వ్యవసాయ చట్టాలను ప్రకటించిన సమయం నుంచి నేటి వరకు ఏం జరిగిందో క్లుప్తంగా తెలుసుకుందాం.

సిక్కు మత స్థాపకుడు గురునానక్‌ జయంతి (Gurunanak Birth Anniversary)  సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) సంచలన ప్రకటన చేశారు. మూడు వివాదాస్పద సాగు చట్టాల (Farn ను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ నెలాఖరులో ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో మూడు చట్టాల రద్దు ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. దేశ రాజధాని సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులందరూ తమ ఇళ్లకు, పొలాలకు తిరిగి వెళ్లిపోవాలని అభ్యర్థించారు.

Farm Laws: సాగుచట్టాలను రద్దు చేసిన కేంద్రం.. అసలా చట్టాల్లో ఏముంది? రైతుల

చిన్న రైతులను ఆదుకునేందుకే సాగు చట్టాలను తీసుకొచ్చామని.. వాటి ద్వారా రైతన్నలు తమ పంట అమ్ముకోవడానికి మరిన్ని ఎంపికలతో సహా మంచి ధరను పొందుతారని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. "కానీ, మేం కొందరు రైతులను ఒప్పించలేకపోయాం. వ్యవసాయ చట్టాల ద్వారా మేమేం చేయాలనుకున్నామో కొందరు రైతులకు అర్థం కాకపోతే ఈ రోజు నేను వారి క్షమాపణలు వేడుకుంటున్నాను, ”అని మోదీ పేర్కొన్నారు.

Repeal of farm laws: సాగు చట్టాల ఉపసంహరణకు కారణమేంటి? రాజకీయ లబ్ధి కోసమేనా..?

వ్యవసాయ చట్టాలను ప్రకటించిన సమయం నుంచి నేటి వరకు ఏం జరిగిందో క్లుప్తంగా తెలుసుకుందాం.

* జూన్ 2020:

1. రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార (ప్రోత్సాహక, సులభతర) బిల్లు -- ది ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ (ప్రమోషన్, ఫెసిలిటేషన్) బిల్ 2020.

2. నిత్యావసర సరకుల(సవరణ) బిల్లు -- ది ఎసెన్షియల్ కమోడిటీస్(అమెండమెంట్) బిల్ 2020.

3. రైతుల (సాధికారత, రక్షణ) ధర హామీ, సేవల ఒప్పంద బిల్లు -- ది ఫార్మర్స్ (ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్) అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అస్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ బిల్ 2020.

పైన పేర్కొన్న మూడు సాగు చట్టాలను ఆర్డినెన్స్‌లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే భారతీయ కిసాన్ యూనియన్ (ఉగ్రహన్) ఆర్డినెన్స్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ వ్యవసాయ సంస్కరణలు కనీస మద్దతు ధర వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి మార్గం సుగమం చేస్తాయని రైతులు ఆందోళనను వ్యక్తం చేశారు. కనీస మద్దతు ధర బడా కంపెనీల దయా దాక్షిణ్యాల చేతిలో పడే ప్రమాదముందని అన్నదాతలు భయపడ్డారు. తరువాత పంజాబ్‌లో దశలవారీగా రైతు నిరసనలు చెలరేగాయి.

CM Stalin : రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత చికిత్స.. సీఎం మరో కీలక నిర్ణయం

* సెప్టెంబర్ 2020:
రైతులు, ప్రతిపక్ష పార్టీల నిరసనల మధ్య భారత పార్లమెంటు గతంలో ఆమోదించిన మూడు బిల్లులకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తన ఆమోదాన్ని తెలిపారు. దాంతో పంజాబ్‌లోని రైతులు మూడు రోజుల ‘రైల్ రోకో’ ఆందోళనలను చేపట్టారు. ఈ ఆందోళనల కారణంగా ఫిరోజ్‌పూర్ రైల్వే డివిజన్ ప్రత్యేక రైళ్ల నిర్వహణను నిలిపివేసింది. కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ 'రైల్ రోకో' ఆందోళనకు పిలుపునిచ్చింది. తరువాత, వివిధ రైతుల సంఘాలు కూడా తమ మద్దతు తెలిపాయి.

* అక్టోబరు 2020:
మూడు సాగు చట్టాల రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కేంద్రం నుంచి స్పందన కోరింది. అప్పటి ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసి నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని కోరింది. ఈ సాగు చట్టాలు సరసమైన ధరలను నిర్ధారించడానికి ఉద్దేశించిన వ్యవసాయోత్పత్తుల మార్కెట్ కమిటీల వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తాయని పిటిషనర్లు ఆరోపించారు. పంజాబ్ రైతులకు జరిగిన అన్యాయానికి తలొగ్గే బదులు రాజీనామా చేయడానికి మొగ్గు చూపుతానని పంజాబ్‌ సీఎం అమరీందర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

* నవంబర్ 2020:
రైతు నాయకులు నిరసనలు తీవ్రమయ్యాయి. దేశమంతటా రహదారుల దిగ్బంధనం (చక్కా జామ్) ప్రకటించి ఉద్రిక్త పరిస్థితులకు రైతులు దారి తీశారు. ఈ చెదురుమదురు నిరసనల తరువాత నవంబర్ 25న పంజాబ్, హర్యానా నుంచి వేలాది మంది రైతులు "దిల్లీ చలో" ప్రచారంలో భాగంగా చట్టాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని వైపు కవాతు నిర్వహించారు. ఆ మరుసటి రోజు పోలీసులు బాష్పవాయువులతో రైతులను చెదరగొట్టడానికి ప్రయత్నించారు. తరువాత వాయువ్య ఢిల్లీలోని నిరంకారి మైదానంలో శాంతియుత నిరసనకు ఢిల్లీలోకి ప్రవేశించడానికి వారిని పోలీసులు అనుమతించారు.

నవంబర్ 28న ఢిల్లీ సరిహద్దులను ఖాళీ చేసి బురారీలోని నిరసన ప్రదేశానికి వెళ్లిన వెంటనే రైతులతో చర్చలు జరపాలని హోం మంత్రి అమిత్ షా ప్రతిపాదించారు. అయితే జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టాలని డిమాండ్ చేస్తూ రైతులు కేంద్రమంత్రి ప్రతిపాదనను తిరస్కరించారు.

* డిసెంబర్ 2020:
డిసెంబర్ 3న ప్రభుత్వం రైతుల ప్రతినిధులతో మొదటి రౌండ్ చర్చలు జరిపింది. కానీ ఆ సమావేశం అసంపూర్తిగా ముగిసింది. రైతులు, కేంద్రం మధ్య డిసెంబర్ 5న జరిగిన రెండో దఫా చర్చలు కూడా అసంపూర్తిగా ముగిశాయి. మూడు వివాదాస్పద చట్టాలను సవరించాలని కేంద్రం ప్రతిపాదించింది. రైతులు మాత్రం ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. చట్టాలను రద్దు చేసే వరకు తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా భారతీయ కిసాన్ యూనియన్ డిసెంబర్ 11న సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

దీంతో సాగు చట్టాలపై ప్రతిష్టంభన(ఎటూ కదలలేని స్థితి)ను ముగించేందుకు ప్రభుత్వం, రైతు సంఘాల ప్రతినిధులతో ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేయవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. డిసెంబర్ 30న జరిగిన ఆరవ రౌండ్ చర్చల్లో గడ్డి తగలబెట్టడంపై జరిమానా తీసేస్తామంటూ ప్రభుత్వం హమీ ఇచ్చింది. ఎలక్ట్రిసిటీ అమెండ్‌మెంట్ బిల్, 2020లో మార్పులను వదిలేయడానికి కేంద్రం అంగీకరించడంతో కొంత పురోగతి కనిపించింది.

* జనవరి 2021:
జనవరి 4న ప్రభుత్వం రైతు నాయకుల మధ్య జరిగిన ఏడవ రౌండ్ చర్చల్లో కూడా వ్యవసాయ చట్టాలను రద్దు చేయడానికి కేంద్రం అంగీకరించలేదు. జనవరి 11న సుప్రీం కోర్టు రైతుల నిరసనపై కేంద్రాన్ని ప్రశ్నించింది. 12న మూడు సాగు చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపివేసింది. చట్టాలలో ఏవైనా మార్పులను సూచించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. జనవరి 15న రైతులకు, ప్రభుత్వానికి మధ్య జరిగిన మరో దఫా చర్చలు విఫలమయ్యాక జనవరి 20న ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను ఏడాదిన్నర పాటు నిలిపివేసి, చట్టంపై చర్చించేందుకు ఉమ్మడి కమిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. రైతులు ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా, చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాల ట్రాక్టర్ కవాతులో వేలాది మంది నిరసనకారులు పాల్గొని పోలీసులతో ఘర్షణ పడ్డారు.

* ఫిబ్రవరి 2021
పాప్ సింగర్ రిహన్న, క్లైమేట్ యాక్టివిస్ట్ గ్రెటా థన్‌బెర్గ్‌తో సహా పశ్చిమ దేశాల్లోని ప్రముఖుల దృష్టిని నిరసనలు ఆకర్షించాయి. ఫిబ్రవరి 5న ఢిల్లీ పోలీసుల సైబర్-క్రైమ్ సెల్.. రైతు నిరసనల టూల్‌కిట్ సృష్టికర్తలపై విద్రోహం, నేరపూరిత కుట్ర, ద్వేషాన్ని ప్రోత్సహించడం వంటి కేసుల కింద ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. ఫిబ్రవరి 6న రైతులు దేశవ్యాప్తంగా “చక్కా జామ్”ను మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు నిర్వహించారు.

* మార్చి 2021:
రైతులు, పంజాబ్ ప్రయోజనాల దృష్ట్యా వ్యవసాయ చట్టాలను బేషరతుగా ఉపసంహరించుకోవాలని కోరుతూ మార్చి 5న పంజాబ్ విధానసభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. మార్చి 6తో రైతుల నిరసన 100 రోజులు పూర్తి చేసుకుంది.

* ఏప్రిల్ 2021:
సింగు సరిహద్దు నుంచి కొన్ని ట్రాక్టర్ ట్రాలీలు పంట కోత సీజన్‌కు ముందు పంజాబ్‌కు తిరిగి వచ్చాయి. రైతులు వెదురు, నెట్లతో షెడ్లు ఏర్పాటు చేసుకున్నారు. ఏప్రిల్ 15న, హర్యానా ఉపముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న రైతులతో చర్చలను పునఃప్రారంభించాలని.. వ్యవసాయ చట్టాలపై సామరస్యపూర్వక ముగింపుకు రావాలని విజ్ఞప్తి చేస్తూ మోదీకి లేఖ రాశారు.

* మే 2021:
మే 21న, 40కి పైగా రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్ మోర్చా మూడు వ్యవసాయ చట్టాలపై చర్చలను పునఃప్రారంభించాలని కోరుతూ మోదీకి లేఖ రాసింది. ఆరు నెలల ఆందోళనకు గుర్తుగా మే 27న రైతులు ‘బ్లాక్ డే’గా పాటిస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు.

* జూన్ 2021
వ్యవసాయ చట్టాలను ప్రకటించి ఒక సంవత్సరాన్ని పురస్కరించుకుని నిరసన తెలుపుతున్న రైతులు సంపూర్ణ క్రాంతికారి దివస్ (మొత్తం విప్లవ దినం)ని పాటించారు.

* జూలై 2021
జూలై 22న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనందున ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కిసాన్ సన్సద్‌ ప్రారంభమైంది. సన్సద్‌లో మూడు సాగు చట్టాలను వెనక్కి తీసుకోవడంపై రైతుల చర్చలు సాగాయి.

* ఆగస్టు 2021:
14 ప్రతిపక్ష పార్టీల నాయకులు పార్లమెంట్ హౌస్‌లో సమావేశమయ్యారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కిసాన్ సంసద్‌ను సందర్శించాలని నిర్ణయించుకున్నారు. రాహుల్ గాంధీతో సహా ఇతర ప్రతిపక్ష నాయకులు చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 28న కర్నాల్ నిరసన ప్రదేశంలో పోలీసులు రైతులపై లాఠీచార్జి చేశారు.

* సెప్టెంబర్ 2021:
సెప్టెంబరు 7న రైతులు పెద్ద సంఖ్యలో కర్నాల్‌కు చేరుకుని మినీ సెక్రటేరియట్‌ను ముట్టడించారు. చట్టాలు ఆమోదం పొంది ఏడాది పూర్తయినందుకు నిరసనగా సెప్టెంబర్ 17న రైతు సంఘాలు భారత్ బంద్ పాటించాయి.

* అక్టోబరు 2021:
కోర్టులో ఉన్న విషయాలపై కూడా నిరసన తెలపడం ప్రజల హక్కుకు విరుద్ధం కాదని కానీ నిరసనకారులు నిరవధికంగా ప్రజా రహదారులను బ్లాక్ చేయకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయినా రైతు సంఘాల నేతలు వెనక్కు తగ్గలేదు. అక్టోబర్ 29న ఢిల్లీ పోలీసులు రైతులు నిరసనలు చేస్తున్న ఘాజీపూర్& టిక్రీ సరిహద్దు నుంచి బారికేడ్లను తొలగించారు.

* నవంబర్ 2021:
సాగు చట్టాలు రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు.

మొత్తానికి ఈ ఏడాది కాలంగా ఎన్నో జరిగాయి. ఎట్టకేలకు ప్రభుత్వం కొత్త సాగు చట్టాలను ఉపసంహరించే ప్రక్రియ చేపడతామని ప్రకటించింది. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. రైతుల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతుండగా.. ఇది తమ విజయమని ప్రతిపక్షాలు చెప్పుకుంటున్నాయి.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Agriculture, Farm Laws, Farmers Protest, New Agriculture Acts

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు