Home /News /national /

FARM BILL ROW 32 FORMER BUREAUCRATS LAUD CENTRES GAME CHANGER SLAM VESTED INTERESTS SK

Agriculture act: రైతుల జీవితాలను మార్చే చట్టం.. కేంద్రంపై మాజీ అధికారుల ప్రశంసలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వ్యవసాయ చట్టంపై అన్ని వైపు నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న క్రమంలో... కేంద్రానికి మాజీ ఐఏఎస్ అధికారులు అండగా నిలిచారు. నిజంగా అది అద్భుతమైన చట్టమని.. రైతుల జీవితాలను మార్చే గొప్ప సంస్కరణ అని ప్రశంసలు కురిపించారు.

  కొత్త వ్యవసాయ చట్టంపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. రైతుల మేలు చేకూర్చేందుకు చట్టం తెచ్చామని కేంద్రం చెబుతుంటే.. వ్యవసాయన్ని కార్పొరేట్ చేతుల్లో పెట్టి రైతుకు మరణశాసనం రాస్తున్నారని.. విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. కొత్త చట్టాన్ని నిరసిస్తూ సెప్టెంబరు 25న పలు రైతు సంఘాలు భారత్ బంద్‌ పాటించాయి. ఉత్తర భారతంతో పాటు కర్నాటక, తమిళనాడులోనూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. కర్నాటకలో ఇవాళ రైతు సంఘాలు బంద్ పాటిస్తున్నాయి. ఇక కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీ టీఎన్ ప్రతాపన్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ మూడు సంస్కరణలు రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలకు కోత విధించడంతో పాటు రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తాయని పేర్కొన్నారు. వ్యవసాయం అనేది రాష్ట్ర పరిధిలోని అంశమని స్పష్టం చేశారు ప్రతాపన్. ఈ మూడు చట్టాలు రాజ్యాంగ విరుద్ధమని.. సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. వీటిని రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఆయన కోరారు.

  ఇలా అన్ని వైపు నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న క్రమంలో... కేంద్రానికి మాజీ ఐఏఎస్ అధికారులు అండగా నిలిచారు. నిజంగా అది అద్భుతమైన చట్టమని.. రైతుల జీవితాలను మార్చే గొప్ప సంస్కరణ అని ప్రశంసలు కురిపించారు. మొత్తం 32 మంది మాజీ అధికారులు వ్యవసాయం చట్టాన్ని సమర్థిస్తూ లేఖ విడుదల చేశారు. వ్యవసాయ చట్టంపై విపక్షాలు, కొన్ని రైతుల సంఘాలు లేనిపోని అపోహలు సృష్టిస్తూ.. రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు. ఈ చట్టాలతో రైతులకు మద్దతు ధర లభించడంతో పాటు పంట అమ్మకంలో అంతర్రాష్ట్ర ఆంక్షలను తొలగిస్తుందని, దళారుల దోపిడీ నుంచి రైతులను కాపాడుతుందని అభిప్రాయపడ్డారు. కాంట్రాక్ట్ ఫార్మింగ్‌ను ప్రోత్సహించడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తుల నిల్వపై ఆంక్షలను సడలించారని.. తద్వారా రైతుకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు.


  మూడు వ్యవసాయ బిల్లులకు ఆదివారం రాత్రి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం.. రైతుల ఉత్పత్తుల వర్తక, వాణిజ్యం (ప్రోత్సాహం, సదుపాయకల్పన) బిల్లు-2020, ధరల హామీ, పంట సేవల అంగీకార బిల్లు-2020, నిత్యవసర ఉత్పత్తుల (సవరణ) బిల్లు-2020లను ఆమోదించింది. పార్లమెంట్ ఆమోదం తర్వాత ఆ మూడు బిల్లులు రాష్ట్రపతి ఆమోదం కోసం వెళ్లాయి. అయితే, వాటికి ఆమోదం తెలుపవద్దంటూ విపక్షాలకు చెందిన నేతలు రాష్ట్రపతి కోవింద్‌ను కలసి విజ్ఞప్తి చేశాయి. వాటిని మళ్లీ పార్లమెంట్ పునఃపరీశీలను పంపాలని కోరాయి. ఐనప్పటికీ ఆ మూడు బిల్లులకు ఆమోదముద్ర వేశారు రాష్ట్రపతి.

  అసలు ఏంటా బిల్లులు..?
  రైతుల (సాధికారత, రక్షణ) ధర హామీ, సేవల ఒప్పంద చట్టం-2020
  ఏ వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన పంట అయినా... పంట వేయడానికి ముందే రైతు, కొనుగోలుదారు ఒప్పందం కుదుర్చుకునేందుకు ఈ చట్టం వీలు కల్పిస్తుంది. కనిష్ఠంగా ఒక పంటకాలం నుంచి అయిదేళ్ల వరకు ఒప్పందం చేసుకోవచ్చు. ఈ ఒప్పందంలో వ్యవసాయ ఉత్పత్తుల ధరను ఖచ్చితంగా పేర్కొనాలి. ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్‌లో తలెత్తే సమస్యల పరిష్కారానికి మూడంచెల వ్యవస్థ సయోధ్య (కన్సిలియేషన్) బోర్డ్, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్, అప్పీలేట్ అథారిటీ ఉంటుంది.

  రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార(ప్రోత్సాహక, సులభతర) చట్టం-2020

  వ్యవసాయ మార్కెట్లను నియంత్రించే మార్కెట్ కమిటీల ప్రాదేశిక సరిహద్దులతో సంబంధం లేకుండా .. దేశంలో వేర్వేరు రాష్ట్రాల మధ్య, రాష్ట్రాల్లో జిల్లాల మధ్య స్వేచ్ఛా వ్యవసాయ వాణిజ్యానికి ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. అంటే రైతు ఎక్కడైనా తమ ఉత్పత్తిని అమ్ముకోవచ్చు. మార్కెట్ కమిటీల సరిహద్దులు దాటి విక్రయించే వ్యవసాయ ఉత్పత్తులపై రాష్ట్రాలు కానీ, స్థానిక ప్రభుత్వాలు కానీ ఎలాంటి పన్నులు వేయడానికి, ఫీజులు వసూలు చేయడానికి వీల్లేదు.

  నిత్యవసర సరకుల(సవరణ) చట్టం 2020
  ప్రస్తుతం అమలులో ఉన్న నిత్యవసర సరకుల చట్టం - 1955కి కొన్ని సవరణలు చేశారు. ఈ కొత్త చట్టం ప్రకారం.. నిత్యవసర సరకుల జాబితాలో ఉన్న వస్తువుల ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, వాణిజ్యాల నియంత్రణాధికారం కేంద్రానికి ఉంటుంది. వినియోగదారుల ప్రయోజనాలు రక్షిస్తూనే నిత్యవసరాలపై నియంత్రణ వ్యవస్థను సరళీకరించడం దీని ఉద్దేశమని కేంద్రం చెబుతోంది. యుద్ధం, దుర్భిక్షం, ధరలు విపరీతంగా పెరిగిపోవడం, ప్రకృతి విపత్తులు వంటి అసాధారణ పరిస్థితులు తలెత్తినప్పుడు మాత్రమే తృణధాన్యాలు, పప్పులు, బంగాళాదుంపలు, ఉల్లి, నూనెగింజలు, నూనెలు వంటి ఆహార వస్తువులపై నియంత్రణ ఉంటుంది.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Agriculture, Farmers, Farmers Protest

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు