హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Fact Check: ఎర్రకోట మీద ఖలిస్తాన్ జెండాలు ఎగురవేశారా? ఏమిటా పతాకాలు?

Fact Check: ఎర్రకోట మీద ఖలిస్తాన్ జెండాలు ఎగురవేశారా? ఏమిటా పతాకాలు?

ఎర్రకోటపై జెండాలు

ఎర్రకోటపై జెండాలు

అవి ఖలిస్తాన్ జెండాలు కానప్పటికీ.. ఒక మతానికి సంబంధించిన జెండాలను ఎర్రకోటపై ఎలా ఎగురవేస్తారని కొందరు ప్రశ్నిస్తున్నారు. చారిత్రకమైన ఎర్రకోటపై ఇలాంటి ఘటనలు జరగడం దారుణమని మండిపడుతున్నారు.

సాధారణంగా ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగురుతుంది. దేశం గర్వపడేలా మువ్వెన్నెల జెండా రెపరెపలాడుతుంది. కానీ ఈ జనవరి 26న మరో రెండు జెండాలు కూడా ఎగిరాయి. ఊహించని ఈ పరిణామంతో యావత్ దేశం షాక్‌కు గురయింది. రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీ అదుపుతప్పింది. నిర్దేశించిన మార్గాల్లో కాకుండా ఎర్రకోట వైపు వేలాది ఆందోళనకారులు దూసుకొచ్చారు. ఎర్రకోటను ముట్టడించి పలు జెండాలను ఎగురవేశారు. ఐతే ఆ జెండాలపై ఇప్పుడు రచ్చ జరుగుతోంది. అల్లరిమూక త్రివర్ణ పతాకాన్ని తొలగించి.. ఖలిస్తాన్ జెండాను ఎగురవేసిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో నిజమెంత?

ఎర్రకోట ముట్టడికి సంబంధించి రెండు అంశాలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఆందోళనకారులు భారతీయ జెండాను దించి.. ఇతర జెండాలు ఎగరవేశారని ప్రచారం జరుగుతోంది. ఐతే ఇందులో నిజం లేదు. భారతీయ జెండాను ఎవరూ తాకలేదు. ఐతే ఖాళీగా ఉన్న పోల్‌పైనే జెండాలు కట్టారు. చాలా వీడియోలు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. ANI వార్తా సంస్థ ట్వీట్ చేసిన వీడియోలో ఎర్రకోట ప్రవేశ ద్వారం వద్ద ఉన్న లాహోర్ గేట్ మీద మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. ఖాళీగా ఉన్న ఫ్లాగ్ పోస్ట్‌‌ను ఓ నిరసనకారుడు ఎక్కాడు. ఎర్రకోటపై మిగతా చోట్ల కూడా ఇతర జెండాలు ఎగిరినప్పటికీ.. త్రివర్ణపతాకాన్ని మాత్రం ఎవరూ దించలేదు.


ఇక రెండో విషయం ఏంటేంట..ఎర్రకోటపై ఖలిస్తాన్ జెండా ఎగురవేశారని ప్రచారం జరుగుతోంది. ఐతే వాస్తవానికి అది ఖలిస్తాన్ జెండా కాదు. నిషాన్ సాహిబ్ లేదా సిక్కు మతానికి సంబంధించిన జెండాలు. రెండు కరవాలాల గుర్తుతో పసుపు, కాషాయ రంగులో, త్రికోణాకారంలో ఉన్న జెండాలను ఎగురవేశారు. అవి ఖలిస్తాన్ జెండాలు కావని 'పంజాబ్: జర్నీస్ థ్రో ఫాల్ట్ లైన్స్' రచయిత అమన్ దీప్ సంధు చెప్పారని ఆల్ట్ న్యూస్ తెలిపింది.


ఐతే అవి ఖలిస్తాన్ జెండాలు కానప్పటికీ.. ఒక మతానికి సంబంధించిన జెండాలను ఎర్రకోటపై ఎలా ఎగురవేస్తారని కొందరు ప్రశ్నిస్తున్నారు. చారిత్రకమైన ఎర్రకోటపై ఇలాంటి ఘటనలు జరగడం దారుణమని మండిపడుతున్నారు. ఐతే దీనికి మతం రంగు పూయవద్దని పంజాబీ నటుడు దీప్ సిద్దు అన్నారు. అన్యాయంపై జరిగే పోరాటానికి నిషాన్ సాహిబ్ ప్రతీక అని.. అందుకే ఆ జెండాలను ఎగురవేసినట్లు స్పష్టం చేశారు.

First published:

Tags: Delhi, Fact Check, Farmers Protest

ఉత్తమ కథలు