దేశ రాజధాని ఢిల్లీ శివారులో 22 రోజులుగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంతటి చలిలోనూ రైతులు ఆందోళనలు చేస్తున్నా.. ప్రధాని మోదీ కనీసం పట్టించుకోవడం కొందరు విమర్శిస్తున్నారు. అదే సమంయలో ప్రధాని మోదీకి సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ ఆస్పత్రిలో రిలయన్స్ అండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీతో ఉన్న ప్రధాని మోదీ ఉన్న ఫొటోను నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. ఆ ఫొటోను వాట్సప్, ట్విటర్, ఫేస్బుక్లో షేర్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. రైతులు ఆందోళనలు చేస్తుంటే పట్టించుకోని నరేంద్ర మోదీ.. అంబానీకి మనవడు పుడితే చూసేందుకు వెళ్లాడని మండిపడుతున్నారు.
ఐతే అంబానీ మనవడిని చూసేందుకు ప్రధాని మోదీ వెళ్లాడని సోషల్ మీడియాల వైరల్‌గా మారిన ఈ వార్త.. ఫేక్ న్యూస్ అని న్యూస్18 ఫ్యాక్ట్ చెక్‌లో తేలింది. ఇందులో నిజం లేదని వెల్లడయింది. ముకేశ్ అంబానీ, నీతా అంబానీతో మోదీ కలిసి ఉన్న ఫొటో.. ఇప్పటిది కాదు. 2014 అక్టోబరు 30న ముంబైలో HN రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. అంతేకాదు ఆ ఫొటోలో అప్పటి మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ కూడా కనిపిస్తున్నారు. అంటే ఆ ఫొటో ఇప్పటిది కాదని.. దానిపై జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారమని స్పష్టమవుతోంది.
ఫేస్బుక్, ట్విటర్లో గంటకో ఇలాంటి పుకారు షికారు చేస్తోంది. వాట్సప్‌కు కుప్పలు తెప్పలుగా సందేశాలు వస్తున్నాయి. మరి సోషల్ మీడియాలో వచ్చే వాటిలో నిజమైనవి? ఏవి తప్పుడు ప్రచారాలో.. తెలియక జనాలు తికమకపడుతున్నారు. కొందరైతే కావాలని పనిగట్టుకొని మరీ తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారు. ఒక పార్టీ వారు వేరొక పార్టీ నేతలపై బురదజల్లడం సాధారణమయిపోయింది. వారి రాజకీయ కుమ్మలాటలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఏది నిజమో? ఏది అబద్ధమో తెలియక.. కన్ఫ్యూజ్కు గురవుతున్నారు. అందుకే తప్పుడు వార్తలను సృష్టించే వారి పట్ల ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Fact Check, Mukesh Ambani, Narendra modi, Pm modi