ఢిల్లీ బీజేపీ నేత కపిల్ మిశ్రా తల నరికిన వారికి లక్ష రూపాయలు బహుమానం ఇస్తానంటూ ఓ ఫేస్ బుక్ యూజర్ ప్రకటించాడు. సాక్షాత్తూ ఆ విషయాన్ని కపిల్ మిశ్రా ఫేస్ బుక్ పేజీలోనే కామెంట్ చేశాడు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను కపిల్ మిశ్రా ట్విటర్లో షేర్ చేశారు. ‘అజారుద్దీన్ అన్సారీ అనే ఈ యువకుడు ఢిల్లీలోనే ఉంటాడు. అతడు నన్ను చంపాలని బహిరంగంగానే చెబుతున్నాడు.’ అంటూ కపిల్ మిశ్రా ట్వీట్ చేశారు. అందులో ఢిల్లీ పోలీసులు, ఢిల్లీ పోలీస్ కమిషనర్, ఢిల్లీ స్పెషల్ సెల్ ట్విటర్ ఖాతాలను ట్యాగ్ చేశారు. అజారుద్దీన్ అన్సారీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కపిల్ మిశ్రా ట్వీట్ చేసిన తర్వాత సోషల్ మీడియాలో చాలా మంది స్పందించారు. నిందితడి ఫొటోలను సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం చేశారు. నిందితుడిని పట్టుకోవాలంటూ పోలీసులను కోరారు.
ये कमेंट मेरे फेसबुक पर किया गया हैं
मेरा सिर काटने पर एक लाख का ईनाम घोषित करने वाला ये आदमी दिल्ली में ही रहता है
మరోవైపు ఢిల్లీ ఆరోగ్య మంత్రి, ఆప్ నేత సత్యేంద్ర జైన్‌కు బీజేపీ నేత కపిల్ మిశ్రా.. బేషరతుగా క్షమాపణలు చెప్పారు. జైన్‌కు పరువు నష్టం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు గాను తప్పును ఒప్పుకుంటూ గత మంగళవారం ఈ విధంగా క్షమాపణలు తెలిపారు. 2017 మే 5న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు జైన్ లంచం ఇచ్చారని కపిల్ మిశ్రా ఆరోపణలు చేశారు. అయితే దీనిపై సత్యేంద్ర కోర్టును ఆశ్రయించారు. నిరాధారమైన వ్యాఖ్యలతో తనపై తప్పుడు, అసత్య ప్రచారం చేస్తున్నారని, తన పరువుకు భంగం కలిగించే విధంగా కపిల్ వ్యాఖ్యానించారని కోర్టుకు దాఖలు చేసిన పిటిషన్లో సత్యేంద్ర పేర్కొన్నారు. సత్యేంద్ర జైన్, కపిల్ మిశ్రాల మధ్య ఒప్పందం కుదిరిన అనంతరం అడిషనల్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ విషాల్ పహుజా స్పందిస్తూ ‘‘భేషరతుగా క్షమాపణ చెబుతూ కోర్టు ముందు ప్రకటించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు నిందితుడు (కపిల్ మిశ్రా) ఒప్పుకున్నారు. ఒక వేళ నిందితుడు క్షమాపణలు చెబితే తన ఫిర్యాదును ఉపసంహరించుకునేందుకు సిద్ధమని జైన్ అంగీకరించారు’’ వీరి మధ్య సఖ్యత కుదరడంతో ఈ కేసు ఇంతటితో ముగిసినట్టేనని మెజిస్ట్రేట్ విశాల్ వ్యాఖ్యానించారు.