హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

భారత్ 'సర్జికల్ స్ట్రైక్స్-2'పై ప్రత్యక్ష సాక్షులు ఏమంటున్నారో తెలుసా..!

భారత్ 'సర్జికల్ స్ట్రైక్స్-2'పై ప్రత్యక్ష సాక్షులు ఏమంటున్నారో తెలుసా..!

భారత్ దాడులు జరిపిన బాలాకోట్‌లోని జాబా గ్రామ చిత్రం(Image: Reuters)

భారత్ దాడులు జరిపిన బాలాకోట్‌లోని జాబా గ్రామ చిత్రం(Image: Reuters)

Eyewitnesses on Indian air strike on Balakot : భారత్ బాంబు దాడి జరిపిన ప్రదేశంలో ప్రత్యక్ష సాక్షుల వాదన కూడా భిన్నంగా ఉంది. అసలు ఆ ప్రదేశంలో జైషే మహమ్మద్ ఉగ్రవాదులే లేరని కొంతమంది చెబుతుంటే.. మరికొంతమంది మాత్రం అక్కడ వారి శిక్షణ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని అంటున్నారు.

ఇంకా చదవండి ...

పుల్వామా దాడికి ప్రతీకారంగా బాలాకోట్‌లో భారత్ జరిపిన వైమానిక దాడులపై పలువురు ప్రత్యక్ష సాక్షులు స్పందించారు. దాడి జరిగిన కొన్ని గంటల తర్వాత సంఘటనా స్థలం నుంచి 35 మృతదేహాలను అంబులెన్స్‌లో తరలించడాన్ని తాము చూశామని వారు వెల్లడించారు. చనిపోయినవాళ్లలో కొంతమంది అక్కడి ఓ చిన్న కుటీరంలో నివసించేవారని, మరికొంతమంది గతంలో పాకిస్తాన్ సైన్యంలో పనిచేసినవారని తెలిపారు. ప్రత్యక్ష సాక్షులను ఎన్‌క్రిప్టెడ్(నిగూఢ) కమ్యూనికేషన్ ద్వారా సంప్రదించి ఈ వివరాలను రాబట్టినట్టు తెలుస్తోంది.

బాంబు దాడి జరిగిన వెంటనే స్థానిక అధికారులు సంఘటనా స్థలానికి వచ్చారని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. సైన్యం ఆ ప్రదేశాన్ని చుట్టుముట్టి.. ఎవరూ లోపలికి వెళ్లకుండా జాగ్రత్తపడిందన్నారు. ఆఖరికి పోలీసులను కూడా అక్కడికి అనుమతించలేదని చెప్పారు. వైద్య సహాయం అందించడానికి వెళ్లిన డాక్టర్ల వద్ద నుంచి సైనికాధికారులు మొబైల్ ఫోన్లు తీసేసుకున్నారని తెలిపారు.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కొలనెల్ సలీమ్ అనే ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్(ISI) అధికారి, జైషే మహమ్మద్ సలహాదారు ముఫ్తీ మొయిన్, ఎక్స్‌ప్లోజివ్స్ నిపుణుడు ఉస్మాన్ ఘని ఈ దాడుల్లో చనిపోయినట్టు సమాచారం. దాడి జరిగిన ప్రదేశంలో మృతుల సంఖ్య భారీగా ఉందని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. జైషే మహమ్మద్ ఆధ్వర్యంలో ఫిదాయిన్ శిక్షణ తీసుకుంటున్న 12 మంది అందులో ఉన్నారని చెప్పారు. కలపతో నిర్మించిన ఓ చిన్న కుటీరంలో వీరంతా నివసిస్తున్నారని.. బాంబు దాడికి అది నేలమట్టమైందని తెలిపారు.

ప్రత్యక్ష సాక్షుల భిన్న వాదనలు..

భారత్ బాంబు దాడి జరిపిన జాబా గ్రామంలో ప్రత్యక్ష సాక్షుల వాదన కూడా భిన్నంగా ఉంది. అసలు ఆ ప్రదేశంలో జైషే మహమ్మద్ ఉగ్రవాదులే లేరని కొంతమంది చెబుతుంటే.. మరికొంతమంది మాత్రం అక్కడ వారి శిక్షణ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని అంటున్నారు. బాంబు దాడిలో చనిపోయిన మృతుల సంఖ్య విషయంలోనూ ప్రత్యక్ష సాక్షుల నుంచి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొంతమంది సాధారుణ పౌరులు మాత్రమే ఈ దాడుల్లో స్వల్ప గాయాలపాలయ్యారని కొందరు స్థానికులు మీడియాతో చెప్పారు.

ఆస్ట్రేలియాకు చెందిన ప్రఖ్యాత స్ట్రాటజిక్ పాలసీ ఇనిస్టిట్యూట్ నాథన్ రూసర్ భారత్ పాక్‌లో జరిపిన దాడులపై ఇండిపెండెంట్ శాటిలైట్ ఇమేజరీ విశ్లేషణ చేపట్టింది. ఇందులో దాడుల ప్రభావం పెద్దగా ఉన్నట్టు ఆధారాలేవి లభించలేదని, ఇండియా చెబుతున్నట్టుగా అక్కడ స్ట్రైక్స్ జరిగిన ఆనవాళ్లేమి లేవని ఆ సంస్థ తేల్చింది. మరోవైపు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారులు మాత్రం జైషే మహమ్మద్‌కి చెందిన నాలుగు భవనాలను తాము కూల్చేశామని చెబుతున్నారు. అయితే వాటికి సంబంధించిన ఫోటోలేవి బయటకు రాకపోవడంతో దీనిపై ఒక నిర్దారణకు రావడం కష్టంగా మారింది.

First published:

Tags: Imran khan, India VS Pakistan, Jammu and Kashmir, Kashmir security, Surgical Strike 2

ఉత్తమ కథలు