Assam-Mizoram Dispute: అసోం-మిజోరాం సరిహద్దు మధ్య అసలు వివాదమేంటి? బ్రిటిష్ వారికి ఏం సంబంధం?

అసోం, మిజోరం సరిహద్దు వివాదం

Assam-Mizoram Dispute: 19వ శతాబ్దం ప్రారంభంలో భారతదేశాన్ని పరిపాలిస్తున్న బ్రిటిష్ పాలకులు ఈశాన్య ప్రాంతంపై తమ ప్రభావాన్ని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాంతంలో గిరిజనుల ఆధ్వర్యంలో ఉండే భూభాగాలను హస్తగతం చేసుకోవడానికి, అక్కడి ప్రాంతాల పరిపాలనకు అస్సాంను కేంద్రంగా ఎంచుకున్నారు.

  • Share this:
అసోం- మిజోరాం రాష్ట్రాల మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం కొనసాగుతోంది. ఇటీవల సరిహద్ధు వివాదం నేపథ్యంలో మిజోరాం పోలీసులు అస్సాం వైపు కాల్పులు జరపడం, ఆ కాల్పుల్లో ఆరుగురు అస్సాం పోలీసులు మరణించడం, ఆ తరువాత ఇరు రాష్ట్రాలు వివాద పరిష్కారానికి కేంద్రం సాయం కోరడం.. వంటివి చకచకా జరిగిపోయాయి. ఈ క్రమంలో అసలు సరిహద్దు సమస్యకు పరిష్కారం ఏంటనే ప్రశ్న తలెత్తుతుంది. దీంతోపాటు అసలు సమస్యకు కారణమైన బ్రిటీషర్ల విధానాలు, సరిహద్దు వివాదం మూలాలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో వలసరాజ్యాల కాలం నాటి సరిహద్దుల విభజన, స్వాతంత్ర్యం తరువాత ఈశాన్య రాష్ట్రాల మధ్య వివాదాలు, ఈ అంశంపై వివిధ రాజకీయ పార్టీల వైఖరి.. వంటి వివరాలు తెలుసుకుందాం.

* రాష్ట్రాల సరిహద్దు వివాదాలు ఎప్పుడు మొదలయ్యాయి?
19వ శతాబ్దం ప్రారంభంలో భారతదేశాన్ని పరిపాలిస్తున్న బ్రిటిష్ పాలకులు ఈశాన్య ప్రాంతంపై తమ ప్రభావాన్ని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాంతంలో గిరిజనుల ఆధ్వర్యంలో ఉండే భూభాగాలను హస్తగతం చేసుకోవడానికి, అక్కడి ప్రాంతాల పరిపాలనకు అస్సాంను కేంద్రంగా ఎంచుకున్నారు. స్వాతంత్ర్యం వచ్చే నాటికి ఈశాన్య ప్రాంతాలు అస్సాంలో భాగంగానే ఉన్నాయి. ఆ తరువాత నాగాలాండ్, మేఘాలయ, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలను అస్సాం నుంచి వేరు చేశారు. అయితే సరిహద్దుల విభజన మాత్రం అప్పట్లో సరిగా జరగలేదనే వాదన ఉంది. దీనిపై ఈ నాలుగు కొత్త రాష్ట్రాలు ముందు నుంచి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

సరిహద్దు వివాదాలు పెద్దవి కావడానికి కారణం ఆయా రాష్ట్రాలు నెరిపే రాజకీయాలేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అస్సాం నుంచి విడిపోయిన నాలుగు రాష్ట్రాల సరిహద్దులను రాజ్యాంగబద్ధంగా నిర్దేశించినప్పటికీ, చారిత్రకంగా తమ సమాజానికి సంబంధించిన భూములను కోల్పోయామనే భావన నాగాలాండ్, మిజోరాం, మేఘాలయ వాసుల్లో ఉంది. దీంతో తమ వనరులు కోల్పోవడానికి సిద్ధంగా లేని రాష్ట్రాలు, సరిహద్ధుల్లోని భూభాగాలపై హక్కులు కోరుతున్నాయి.

అస్సాం-మిజోరాం సరిహద్దుల్లో సమస్యలు గతంలో సైతం హింసకు తావుతీశాయి. నాగాలాండ్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్‌లతో ఉన్న అస్సాం సరిహద్దుల్లో కూడా ఘర్షణలు జరిగాయి. ఇలాంటి వివాదాలను పరిష్కరించడానికి గతంలో ఏర్పాటు చేసిన సరిహద్దు కమీషన్ల వల్ల ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. కమీషన్లు ప్రతిపాదించిన సిఫార్సులను ఈ రాష్ట్రాలు అంగీకరించడానికి ఇష్టపడలేదు.

* బ్రిటీషర్లు ఏం చేశారు?
అస్సాం నుంచి విడదీసిన మిజోరాం భూభాగాన్ని 1972లో కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు. ఆ తరువాత 1987లో ప్రత్యేక రాష్ట్ర హోదా ఇచ్చారు. అప్పట్లో దీన్ని లుషాయ్ హిల్స్ అని పిలిచేవారు. మిజోరాం రాష్ట్రంలోని ఈ కొండలను ఇప్పుడు మిజో హిల్స్ అని పిలుస్తున్నారు. ప్రస్తుత వివాదం.. ఈ కొండలతో ముడిపడి ఉంది. అస్సాంలోని కచార్ జిల్లాలో ఉన్న భూములను బ్రిటీషర్లు టీ తోటల సాగుకు స్థానికులకు ఇచ్చారు. అయితే ఆ భూములు తమ లుషాయ్ హిల్స్‌లో భాగమని కొండ ప్రాంతాల ప్రజలు వాగ్వాదానికి దిగారు. లుషాయ్ కొండలు తమ నివాసమని వారు చెప్పారు. ఈ విషయంపై వివాదం పెద్దదైంది. హింసాత్మక పరిస్థితులు నెలకొనడంతో బ్రిటిష్ పాలకులు కొత్త నిర్ణయం తీసుకున్నారు. బ్రిటీషర్ల ఆధీనంలో ఉన్న భూముల విషయంలో తలదూర్చవద్దని స్థానిక గిరిజనులతో ఒప్పందాలు చేసుకున్నారు. ఇందుకు 'ఇన్నర్ లైన్' అనే వ్యవస్థను కూడా ప్రవేశపెట్టారు. ఈ గిరిజన ప్రాంతాలను బయటి వ్యక్తుల చొరబాట్ల నుంచి రక్షించేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడింది.

అస్సాంతో వివాదాన్ని పరిష్కరించడానికి సరిహద్దు కమిషన్ ఏర్పాటు చేయాలని మిజోరాం అసెంబ్లీ తీర్మానించింది. ఆ తరువాత 1875లో బ్రిటీషర్లు.. అస్సాంలోని కచార్ జిల్లా నుంచి లుషాయ్ కొండలను వేరుచేస్తూ సరిహద్ధును అధికారికంగా గుర్తించారు. అయితే 1933లో ఈశాన్య ప్రాంతంలో రాచరిక ప్రాంతంగా ఉన్న మణిపూర్ బోర్డర్‌ను గుర్తించే క్రమంలో.. అస్సాం- మిజోరాం మధ్య కొత్త సరిహద్ధు రేఖను గుర్తించారు. దీంతో తమ ప్రమేయం లేకుండా ఏకపక్షంగా ఈ బోర్డర్‌ను గుర్తించారని మిజోరాం వాదించింది.

* మిజోరాం 1875 సరిహద్దునే ఎందుకు కోరుతోంది?
1875లో నిర్ణయించిన సరిహద్దును తమ నాయకులు, మిజో సమాజం సమ్మతితో గుర్తించారని అక్కడి నాయకులు చెబుతున్నారు. మిజో తెగలు, బ్రిటిష్ ప్రభుత్వం మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం ఈ సరిహద్దును గుర్తించారు. అందువల్ల ఇదే నిజమైన సరిహద్దు అని మిజో శాసనసభ్యులు నొక్కి చెప్పారు. ఆ తరువాత తమను సంప్రదించకుండానే మరోసారి సరిహద్దులను గుర్తించారని, అందువల్ల దాన్ని ఒప్పుకునేది లేదని వాదిస్తున్నారు.

* వివాదానికి కేంద్ర బిందువు ఏది?
1875 నోటిఫికేషన్ ప్రకారం గుర్తించిన సరిహద్దు అసలైనదని మిజోరాం, 1933 నోటిఫికేషన్‌ను అనుసరించాలని అస్సాం డిమాండ్ చేస్తున్నాయి. ఈ సరిహద్దుల్లోని భూభాగాలే ముందు నుంచి ఘర్షణకు కేంద్రంగా ఉన్నాయి. అయితే 1875 నోటిఫికేషన్‌, 1933 సరిహద్దుల మధ్య 749 చ.కి.మీ. భూభాగం వ్యత్యాసం ఉన్నట్లు మిజోరాం అసెంబ్లీ ప్రకటించింది. ఈ భూభాగాలను కోల్పోవడానికి తాము సిద్ధంగా లేమని అక్కడి నాయకులు చెబుతున్నారు. ప్రస్తుతం అస్సాం- మిజోరాం మధ్య 164 కిలోమీటర్ల కంటే ఎక్కువ సరిహద్దు ఉంది. అస్సాంలోని కచార్, కరీంగంజ్, హైలకండి- మిజోరాంలోని ఐజ్వాల్, కొలసిబ్ మామిత్ జిల్లాల మధ్య ఈ సరిహద్దు ఉంది.

* సమస్యకు పరిష్కారం ఏంటి?
అస్సాం-మిజోరాం సరిహద్దు వివాదానికి సంబంధించి గతంలో 1970ల వరకు హింసాత్మక ఘర్షణలు జరిగాయి. కానీ గత ఏడాది అక్టోబర్‌లో ఒకసారి, మళ్లీ తాజాగా చోటుచేసుకున్న ఘర్షణలు పెద్దవిగా మారాయి. అయితే ఈ వివాదానికి పరిష్కారం చూపించవ్చని చెబుతున్నారు లెఫ్టినెంట్ జనరల్ షోకిన్ చౌహాన్. ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ వార్తా సంస్థకు రాసిన ఒక కాలమ్‌లో ఆయన కొన్ని విషయాలు చెప్పారు. అంతర్గత సరిహద్దు వివాదాలకు పరిష్కారం కోసం కేంద్రం ఒత్తిడి చేయవచ్చన్నారు. ఇరు రాష్ట్రాల సమ్మతితో సరిహద్దు నిర్ణయించడం.. లేదా రెండు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలతో కలిపి సరిహద్దు కమిషన్‌ను రూపొందించడం ద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తుందని వివరించారు.

అయితే 2014లో నాగాలాండ్‌తో సరిహద్దులో ఘర్షణల తరువాత అప్పటి అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ ఈ అంశంపై మాట్లాడారు. నాగాలాండ్, అరుణాచల్, మేఘాలయలతో సరిహద్దు సమస్యలను పరిష్కరించడానికి ఎన్నో సరిహద్దు కమిషన్‌లు ఏర్పాటు చేశారని, కానీ ఇతర రాష్ట్రాలు ఈ ప్యానెల్‌ల సిఫార్సులను ఆమోదించలేదని చెప్పారు. అందువల్ల రెండు రాష్ట్రాల ప్రమేయంతోనే సరిహద్దు కమీషన్‌ను ఏర్పాటు చేస్తే ఫలితం ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Published by:Shiva Kumar Addula
First published: