హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

బెంగళూరు ఆసుపత్రి నుంచి శశికళ డిశ్చార్జ్.. తమిళ పాలిటిక్స్‌లో కీలక మార్పులకు ఛాన్స్..!

బెంగళూరు ఆసుపత్రి నుంచి శశికళ డిశ్చార్జ్.. తమిళ పాలిటిక్స్‌లో కీలక మార్పులకు ఛాన్స్..!

శశికళ (ఫైల్ ఫోటో)

శశికళ (ఫైల్ ఫోటో)

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆప్తురాలు, అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ విక్టోరియా ఆసుపత్రి నుంచి ఆదివారం డిశ్చార్జ్ అయ్యారు. ఆమె కొన్ని రోజుల క్రితం తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఆమె కోవిడ్-19 నుంచి కోలుకోవడంతో...

ఇంకా చదవండి ...

బెంగళూరు: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆప్తురాలు, అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ విక్టోరియా ఆసుపత్రి నుంచి ఆదివారం డిశ్చార్జ్ అయ్యారు. ఆమె కొన్ని రోజుల క్రితం తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఆమె కోవిడ్-19 నుంచి కోలుకోవడంతో, వైద్య పరీక్షలు చేసిన వైద్యులు ఆరోగ్యం నిలకడగానే ఉందని నిర్ధారించి డిశ్చార్జ్ చేశారు. ఆమె ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారన్న విషయం తెలిసి పెద్ద సంఖ్యలో శశికళ అనుచరులు అక్కడికి చేరుకున్నారు. ఆమెకు మద్దతుగా నినాదాలు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించిన శశికళ జనవరి 27న జైలు నుంచి విడుదలయ్యారు. అయితే.. అప్పటికే ఆమె అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడంతో విడుదలకు సంబంధించిన ప్రక్రియను జైలు అధికారులు అక్కడి నుంచే పూర్తి చేశారు.

తమిళనాడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో శశికళ తీసుకోబోయే నిర్ణయంపై అక్కడి రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అన్నాడీఎంకేతో తమ పొత్తు పదిలమని, ఈ ఎన్నికల్లో పొత్తుతోనే ముందుకెళతామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో.. శశికళ అన్నాడీఎంకేతో కలిసి అడుగులేస్తారా లేక బహిష్కృత నేతగానే బరిలోకి దిగుతారా అన్న చర్చ మొదలైంది. శశికళను అన్నాడీఎంకేలో చేర్చుకునే ప్రసక్తే లేదని అధికార అన్నాడీఎంకేకు చెందిన మంత్రి డి.జయకుమార్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ఓ పత్రికలో శశికళ అన్నాడీఎంకేను దుష్టుల పాలిటి నుంచి కాపాడి, ఆ పార్టీపై పట్టు సాధిస్తారంటూ ప్రచురితమైన వ్యాసంపై స్పందించిన సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అన్నాడీఎంకే కంచుకోట అని, దాన్ని ఎవరూ పడగొట్టలేరని మంత్రి ఒకింత ఘాటుగానే వ్యాఖ్యానించారు. శశికళను అన్నాడీఎంకేలో చేర్చుకోవడం గానీ, అమ్మా మక్కల మున్నేట్ర కళగాన్ని విలీనం చేసుకునే ప్రసక్తే లేదని మంత్రి స్పష్టం చేశారు. ఇక.. శశికళకు స్వాగతం పలుకుతూ పోస్టర్లు వేసిన వారి వ్యవహారం అన్నాడీఎంకేలో చర్చనీయాంశంగా మారింది. శశికళకు మద్దతు తెలుపుతూ బ్యానర్లు ఏర్పాటు చేసిన వారిని పార్టీ నుంచి తొలగించే విషయంలో అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని ఆ పార్టీ నేత అన్నాదురై తప్పుబట్టారు. శశికళ జైలు నుంచి విడుదలయ్యాక పన్నీరుసెల్వం కుమారుడు జయప్రదీప్ కూడా ఆమెకు స్వాగతం పలుకుతూ సోషల్ మీడియాలో ఫొటో పెట్టారని, మరో మంత్రి రాజేంద్ర బాలాజీ కూడా దాయాదుల పోరు ముగిసిందని, త్వరలో ఒక్కటవుతామని ప్రకటించారని గుర్తుచేశారు. వారందరినీ వదిలేసి తమపై చర్యలు తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. మొత్తం మీద శశికళ జైలు నుంచి విడుదల కావడం అన్నాడీఎంకేలో కుదుపులకు కారణమవుతోంది.

First published:

Tags: AIADMK, Sasikala, Tamil nadu Politics, Tamilnadu

ఉత్తమ కథలు