ఉద్యోగులకు ఎన్నికల తాయిలం..పెరగనున్న పీఎఫ్‌పై వడ్డీరేటు

ప్రతీకాత్మక చిత్రం

2017-18 ఆర్థిక సంవత్సరంలో గత ఐదేళ్లలో కనిష్ఠ స్థాయిలో 8.55 శాతంగా ఉన్న పీఎఫ్‌ వడ్డీ రేటుని, 2018-19 ఆర్థిక సంవత్సరానికి పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వడ్డీరేటును యధాతథంగా ఉంచినా ద్రవ్యోల్బణం తగ్గిన నేపథ్యంలో ఇది ఈ ఆర్థిక సంవత్సరపు అత్యుత్తమ పొదుపు పథకం అవుతుంది.

 • Share this:
  సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో సంఘటిత రంగంలోని ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఓ శుభవార్తను అందించనుంది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల భవిష్య నిధి(పీఎఫ్)పై వడ్డీరేటును పెంచే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 8.55 శాతంగా ఉన్న వడ్డీ రేటును పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్‌వో) వర్గాలు తెలిపాయి. ద్రవ్యోల్బణం తగ్గడంతో పీఎఫ్‌పై వడ్డీ రేటును యధాతథంగా కొనసాగించినా...అది ఉద్యోగులకు మేలు చేసే నిర్ణయమే అవుతుందని అధికారులు చెబుతున్నారు. పీఎఫ్‌పై వడ్డీ రేటును పెంచితే సంఘటిత రంగంలోని దాదాపు ఆరు కోట్ల మంది ఉద్యోగులకు మేలు జరుగుతుంది. పీఎఫ్‌పై వడ్డీ రేటును పెంచి వేతనజీవులకు 2019 ఎన్నికలకు ముందు ప్రత్యేక తాయిలాన్ని అందివ్వాలని మోదీ సర్కారు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

  ప్రతీకాత్మక చిత్రం


  ప్రస్తుతం అకౌంట్ ఆడిటింగ్ కొనసాగుతుండగా...త్వరలోనే ఈపీఎఫ్‌వో వార్షిక అంతర్గత సమీక్షలో వడ్డీ రేటు పెంపుపై నిర్ణయం తీసుకోనున్నారు. వడ్డీ రేటును పెంచడం లేదా యధాతథంగా కొనసాగించే అంశాన్ని పరిశీలిస్తున్నామని, ప్రస్తుత పరిస్థితుల్లో వడ్డీ రేటును తగ్గించే అవకాశం లేదని ఈపీఎఫ్‌వో కేంద్ర ధర్మకర్తల మండలి సభ్యుడు ప్రభాకర్ బానసూరె అభిప్రాయపడ్డారు. పీఎఫ్‌పై వడ్డీ రేటను తగ్గించకున్నా 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఇది అత్యుత్తమ పొదుపు పథకం అవుతుందని పేర్కొన్నారు.

  పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్‌కు 2018లో సరాసరి వడ్డీరేటు 7.7 శాతంగానే ఉంది. ఈపీఎఫ్‌వో ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో దాదాపు రూ.50 వేల కోట్లను పెట్టుబడి పెట్టింది.

  ప్రతీకాత్మక చిత్రం


  2017-18 ఆర్థిక సంవత్సరంలో గత ఐదేళ్లలో కనిష్ఠ స్థాయిలో పీఎఫ్‌పై 8.55 శాతం వడ్డీని ఈపీఎఫ్‌వో అందించింది. అంతకు ముందు 2016-17 సంవత్సరానికి 8.65 శాతం, 2015-16 సంవత్సరానికి 8.8 శాతం, 2014-15లో 8.75 శాతం, 2013-14లో 8.75 శాతం, 2012-13లో 8.5 శాతం వడ్డీ రేటును అందించారు.

   
  First published: