హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

EPFO: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు మరో శుభవార్త.. వాట్సాప్ లోనూ ఫిర్యాదులు చేసే ఛాన్స్

EPFO: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు మరో శుభవార్త.. వాట్సాప్ లోనూ ఫిర్యాదులు చేసే ఛాన్స్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

EPFO: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) వాట్సాప్‌ ద్వారా ఖాతాదారులకు మెరుగైన సేవలందిస్తోంది. తమ చందాదారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా ఒక వాట్సాప్ హెల్ప్‌లైన్ నంబర్‌ను ఆ సంస్థ ఇటీవల ప్రారంభించింది.

డిజిటల్ సాంకేతికతను అందిపుచ్చుకున్న ప్రభుత్వ సంస్థ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) వాట్సాప్‌ ద్వారా ఖాతాదారులకు మెరుగైన సేవలందిస్తోంది. తమ చందాదారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా ఒక వాట్సాప్ హెల్ప్‌లైన్ నంబర్‌ను ఆ సంస్థ ఇటీవల ప్రారంభించింది. ఇది మంచి ఫలితాలను ఇస్తోందని ఈపీఎఫ్‌వో ప్రకటించింది.

ఆ ఫిర్యాదులు తగ్గిపోయాయి

వాట్సాప్ మెసేజింగ్ యాప్ ద్వారా ఇప్పటి వరకు 1,64,040 కు పైగా ఫిర్యాదులను పరిష్కరించినట్లు ఈపీఎఫ్‌ఓ తెలిపింది. వాట్సాప్ హెల్ప్‌లైన్‌ను ప్రారంభించిన తరువాత ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఈపీఎఫ్‌ఓకు చేసే ఫిర్యాదుల సంఖ్య 30 శాతం తగ్గింది. ఈ కొత్త సేవలు ప్రవేశపెట్టినప్పటి నుంచి EPFO ఆన్‌లైన్ గ్రీవెన్స్ రిజల్యూషన్ పోర్టల్, EPFiGMSలో ప్రశ్నలు అడిగేవారు, ఫిర్యాదులు చేసేవారి సంఖ్య కూడా 16 శాతం తగ్గింది.

అన్ని కార్యాలయాల్లో హెల్ప్‌లైన్

భారత్‌లో ఉన్న మొత్తం 138 ప్రాంతీయ EPFO కార్యాలయాల పరిధిలో వాట్సాప్ హెల్ప్‌లైన్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఖాతాదారులు ఇతరులపై ఆధారపడకుండా సొంతంగా తమ సమస్యలు పరిష్కరించుకోవడానికి ఈ సేవలు ఉపయోగపడుతున్నాయి. ఈ ప్రయత్నం మంచి ఫలితాలు ఇవ్వడంతో ఈపీఎఫ్‌ఓ మరిన్ని డిజిటల్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

వాట్సాప్ సేవలను ఎలా ఉపయోగించాలి?

ముందు స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్‌ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి, మీ మొబైల్ నంబర్‌తో ఒక అకౌంట్ ఓపెన్ చేయాలి. తరువాత ఈపీఎఫ్‌ఓ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. (https://www.epfindia.gov.in/site_en/index.php). వెబ్‌సైట్లో సంబంధిత ప్రాంతీయ కార్యాలయానికి ఒక వాట్సాప్ హెల్ప్‌లైన్ నంబర్ కేటాయిస్తారు. ఆ నంబరును మీ స్మార్ట్‌ఫోన్‌లో సేవ్ చేసుకోండి. ఆ తరువాత వాట్సాప్‌లో ఆ నంబరుపై క్లిక్ చేయండి. ఓపెన్ అయ్యే చాట్ లిస్ట్‌లో మీరు అడగాలనుకున్న ప్రశ్న లేదా ఫిర్యాదులను రాసి పంపండి. సంబంధిత ఫిర్యాదుపై పరిష్కారాలను EPFO మీకు పంపుతుంది.


ఇతర సేవలతో పాటు...

వాట్సాప్ సేవల ద్వారా చందాదారులు EPFO కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లోనే ప్రశ్నలు అడగవచ్చు. సులభంగా తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. COVID-19 వ్యాప్తి ఉన్న నేపథ్యంలో ఖాతాదారులకు ఈ సేవల ద్వారా మరింత లబ్ధి చేకూరనుంది. ఈ హెల్ప్‌లైన్‌ను ప్రారంభించిన తరువాత EPFO కార్యాలయాల్లో రద్దీ కూడా తగ్గడం విశేషం. ఇంతకు ముందే అందుబాటులో ఉన్న EPFiGMS పోర్టల్, CPGRAMS, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు అదనంగా వాట్సాప్ సేవలను సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. EPFOకు 24 గంటలు పనిచేసే కాల్ సెంటర్‌ కూడా ఉంది.

First published:

Tags: EPFO, Whatsapp

ఉత్తమ కథలు