వాయు కాలుష్యంపై పీసీబీతో ప‌ర్యావ‌ర‌ణవేత్త‌ల ఢీ

ప్రతీకాత్మక చిత్రం

వాయు కాలుష్యాన్ని అరిక‌ట్టాల్సిన పీసీబీ నిర్ల‌క్ష్య ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని, కాలుష్యం త‌గ్గుతుందంటూ చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లు ఆంద‌ోళ‌న‌క‌ర‌మ‌ని వ్యాఖ్యానించారు.

 • Share this:
  క‌ర్ణాట‌క రాజ‌ధాని న‌గ‌రం బెంగ‌ళూరులో వాయు కాలుష్యంపై చ‌ర్చ ఎప్పుడూ వివాద‌స్ప‌ద‌మైన‌దే. గ‌త రెండేళ్ల‌లో బెంగ‌ళూరులో వాయు కాలుష్యం తీవ్ర‌త త‌గ్గింద‌ని కర్ణాట‌క రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండ‌లి (కేఎస్‌పీసీబీ) పేర్కొంది. అయితే ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త‌లు, కార్య‌క‌ర్త‌ల వాద‌న మ‌రోలాగా ఉంది.

  గ‌త ఐదేళ్లుగా న‌గ‌రంలో వాయు కాలుష్యం తీవ్ర‌త చాల త‌గ్గింద‌ని కేఎస్‌పీసీబీ ముఖ్య శాస్త్ర సాంకేతిక అధికారి డా. హెచ్ లోకేశ్వ‌రి వెల్ల‌డించారు. 2014-18 మ‌ధ్య వార్షిక స‌గ‌టు వాయు నాణ్య‌త సూచి (ఏక్యూఐ) గ‌ణాంక‌లు హెచ్చు స్థాయి నుంచి సంతృప్తక‌ర స్థాయికి చేరాయ‌ని ఆమె తెలిపారు. 2014 గ‌ణాంకాల‌తో పోలిస్తే 2018లో పీఎం 10 వార్షిక స‌గ‌టు 28 శాతం త‌గ్గింద‌ని పేర్కొన్నారు. అలాగే 2015-17 మ‌ధ్య పీఎం 2.5 విలువ 29 శాతానికి ప‌డిపోయింద‌ని తెలిపారు.

  కేఎస్‌పీసీబీ ప‌ర్య‌వేక్ష‌ణ కేంద్రాల‌ నుంచి సేక‌రించిన వివ‌రాల ప్ర‌కారం బెంగ‌ళూరులో వాయు కాలుష్యం త‌గ్గింద‌ని తెలుస్తోంది. మ‌రోవైపు గాలిలో పీఎం 10, పీఎం 2.5 పెరుగుద‌ల వ‌ల్ల ఆస్త‌మా, ఊపిరితిత్తుల వ్యాధులు సోకుతాయి.

  బెంగళూరులో వాయు కాలుష్యం


  గ‌ణాంకాల విశ్వ‌స‌నీయ‌త‌పై అనుమానం..
  మ‌రోవైపు ఈ కేఎస్‌పీసీబీ డేటాపై ఇండియ‌న్ ఇన్సిట్యూట్ ఆఫ్ సైన్సెస్‌లోని జీవావ‌ర‌ణ‌ శాస్త్ర కేంద్ర ప్రొఫెస‌ర్ డా.టీవీ రామ‌చంద్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. వాయు కాలుష్యానికి సంబంధించి కేఎస్‌పీసీబీ స‌గటు గ‌ణాంకాలను వెలువ‌రించ‌డం స‌రికాద‌ని వ్యాఖ్యానిస్తున్నారు. బెంగ‌ళురులోని మెజెస్టిక్ ప్రాంతంలో కాలుష్యం అధికంగా ఉంటుంద‌ని, జ‌య‌న‌గ‌ర్ లేదా లాల్‌బాఘ్ ప్రాంతాలు స్వ‌చ్ఛ‌మైన గాలితో కూడి ఉంటాయని తెలిపారు. స‌గ‌టు గ‌ణాంకాల వ‌ల్ల స‌మ‌స్యాత్మ‌క ప్రాంతాల‌ను వ‌దిలివేయాల్సి వ‌స్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కాలుష్యం భారిన ప‌డిన స‌గం ప్రాంతాల వివ‌రాలు ల‌భించ‌డం లేద‌ని వివ‌రించారు. ఈక్ర‌మంలో ప్ర‌జ‌ల‌ను కేఎస్‌పీసీబీ మ‌భ్య‌పెడుతోంద‌ని ఆరోపించారు.

  ఖ‌చ్చితత్వం లేక పోవ‌డం వ‌ల్ల తాను ప్ర‌భుత్వ గ‌ణాంకాల‌ను న‌మ్మ‌బోన‌ని భార‌త జీవావ‌ర‌ణ భ‌ద్ర‌తా సంస్థ పాల‌క మండ‌లి స‌భ్యుడు డా. యెల్ల‌ప రెడ్డి తెలిపారు. కేఎస్‌పీసీబీ ప‌ర్య‌వేక్ష‌క కేంద్రాల్లో 75 శాతానికిపైగా స‌రిగా ప‌నిచేయ‌డం లేద‌ని పేర్కొన్నారు. మిగిలిన కేంద్రాలు కూడా చాలా ప‌రిమిత‌మైన రోజుల్లోనే వివ‌రాల‌ను అందిస్తున్నాయ‌ని తెలిపారు. దీంతో అసంపూర్ణ గ‌ణాంకాలు ల‌భిస్తున్నాయ‌ని తెలిపారు.

  చుట్టూ ప‌చ్చ‌ద‌నంతో కూడిన‌‌ ప్రాంతాల్లో ప‌ర్య‌వేక్ష‌క కేంద్రాల‌ను కేఎస్‌పీసీబీ ఏర్పాటు చేసింద‌ని ఆయన పేర్కొన్నారు. పీసీబీ ప్రధాన కార్యాల‌యం ఉన్న‌టువంటి ఎంజీ రోడ్‌లో ప‌ర్య‌వేక్ష‌క కేంద్రాన్ని ఏర్పాటు చేయ‌లేద‌ని గుర్తుచేశారు. అధికా కాలుష్యం ఉన్న చోట ఈ కేంద్రాల‌ను ఏర్పాటు చేయ‌లేద‌ని, వాస్త‌వ‌ కాలుష్యాన్ని అంచ‌నా వేయ‌లేని విధంగా భ‌వ‌న‌ మొద‌టి అంత‌స్థుల్లో ఈ కేంద్రాల‌ను కొన్ని చోట్ల ఏర్పాటు చేశార‌ని తెలిపారు.

  అధిక కాలుష్యం ఉండే మేజెస్టిక్‌, పీణ్య పారిశ్రామిక ప్రాంతాల వివ‌రాలు ల‌భ్యం కావ‌డం లేదని యెల్ల‌ప రెడ్డి తెలిపారు. కాలుష్య స‌మ‌స్య ఎంత తీవ్ర‌మైన‌దో అంద‌రూ అర్థం చేసుకోవాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని పేర్కొన్నారు. స‌రైన గ‌ణాంకాలు లేక‌పోవ‌డం ద్వారా అంద‌రూ ఈ స‌మ‌స్య‌ను నిర్ల‌క్ష్యం చేసే అవ‌కాశ‌ముంద‌ని తెలిపారు. ప్ర‌స్తుతమున్న‌పరికరాలు 20 ఏళ్ల కింద‌టివ‌ని, ఈ నేప‌థ్యంలో కొత్త‌వి, ఖ‌చ్చితత్వంతో కూడిన పరికరాల‌ను పీసీబీ త‌ప్ప‌నిస‌రిగా ఏర్పాటు చేయాల‌ని సూచించారు.

  ప్ర‌తి ఏటా వాహ‌నాల సంఖ్య పెరిగే కొద్ది, కాలుష్యం వ‌ల్ల క‌లిగే ఆరోగ్య స‌మ‌స్య‌లు మ‌రింత‌గా పెరుగుతాయని ఈకో వాచ్ అనే ప్ర‌భుత్వేత‌ర ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ సంస్థ సంచాల‌కుడు అక్ష‌య్ హేబిక‌ర్ తెలిపారు. వాయు కాలుష్యాన్ని అరిక‌ట్టాల్సిన పీసీబీ నిర్ల‌క్ష్య ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని, కాలుష్యం త‌గ్గుతుందంటూ చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లు ఆంద‌ోళ‌న‌క‌ర‌మ‌ని వ్యాఖ్యానించారు. మ‌రోవైపు వాయు కాలుష్యం పెరుగుతున్న‌కొద్దీ, చెట్ల‌ను న‌రికేయ‌డంలాంటి ప‌నులు చేస్తున్నార‌ని తెలిపారు. కార్బ‌న్ డై ఆక్సైడ్ (బొగ్గు పులుసు వాయువు)ను అధికంగా పీల్చుకుని కాలుష్యాన్ని చెట్లు త‌గ్గిస్తాయ‌ని గుర్తు చేశారు. ఈ నేప‌థ్యంలో పచ్చ‌ద‌నాన్ని నిర్మూలించ‌డం వ‌ల్ల కాలుష్యం మ‌రింత‌గా పెరుగుతుంద‌ని, ఇప్ప‌టికైనా స‌రైన జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోతే త్వ‌ర‌లోనే బెంగ‌ళూరు మ‌రో ఢిల్లీ (తీవ్రంగా వాయు కాలుష్యం బారిన ప‌డిన న‌గరం)గా మారుతుంద‌ని హెచ్చ‌రించారు.

  (Author is freelance writer and a member of 101Reporters.com)
  Published by:Shiva Kumar Addula
  First published: