Sonia Gandhi gets ED Notice | కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి (Sonia Gandhi) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) షాక్ ఇచ్చింది. ఈనెల 21వ తేదీన విచారణకు హాజరుకావాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసుకు (National Herald Case) సంబంధించిన జూన్ 8వ తేదీన సోనియాగాంధీకి ఈడీ తొలిసారి నోటీసులు అందించింది. అయితే, ఆమెకు కరోనా వైరస్ సోకడంతో ఆస్పత్రి పాలయ్యారు. కోవిడ్ 19 చికిత్స తీసుకుంటున్నందును విచారణకు హాజరుకాలేనంటూ ఆమె ఈడీని కోరారు. అయితే, జూన్ 23న రావాలంటూ రెండోసారి ఈడీ ఆమెకు నోటీసులు ఇచ్చింది. అప్పటికి ఆమె పూర్తిగా కోలుకోకపోవడంతో మరింత సమయం కావాలని, తాను విచారణకు హాజరుకాలేనని చెప్పారు. దీంతో ఇప్పుడు మరోసారి తమ ఎదుట విచారణకు హాజరుకావాలంటూ సోనియాగాంధీకి నోటీసులు జారీ చేసింది.
నేషనల్ హెరాల్డ్ నిర్వహణలో అక్రమాలు జరిగాయని ఈడీ అనుమానిస్తోంది. మనీలాండరింగ్ జరిగినట్టు భావిస్తోంది. ఈ క్రమంలో నేషనల్ హెరాల్డ్ నిర్వహణ చూస్తున్న యంగ్ ఇండియన్ (ఇది కాంగ్రెస్ ఆధ్వర్యంలో నడుస్తోంది.) కు సంబంధించి రాహుల్ గాంధీకి (Rahul Gandhi ED Notice) నోటీసులు పంపింది. జూన్ 16 నుంచి 22వ తేదీ మధ్య సుమారు 54 గంటల పాటు ఆయన్ను విచారించింది.
నేషనల్ హెరాల్డ్ పత్రిలో అక్రమాలు జరిగాయంటూ బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి (BJP MP Subramanian Swamy) 2013లో ఆరోపించారు. దీనిపై విచారణ జరపాలటూ ఆయన పోరాటం చేశారు. రూ.90 కోట్ల విలువైన దాన్ని రూ.50 లక్షలకే దక్కించుకున్నారనేది ప్రధాన ఆరోపణ. దీనికి సంబంధించిన విచారణలో యంగ్ ఇండియన్ వ్యవహారాలు వెలుగుచూశాయి. అయితే, రాహుల్ గాంధీని విచారించినప్పుడు అసలు ఇందులో షేర్లను ఎలా విభజించారు? ఎవరెవరికి షేర్లు ఉన్నాయి? ప్రమోటర్ల పాత్ర ఎంత? వంటి అంశాల మీద ప్రశ్నించినట్టు ఈడీ అధికారులు వెల్లడించారు.
ఈ కేసుకు సంబంధించి సుబ్రమణ్యస్వామి వేసిన పిటిషన్ మీద విచారణ సందర్భంగా సోనియా, రాహుల్ గాంధీలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే, ఇది కేవలం రాజకీయ కక్షపూరితంగా చేసున్న పని అంటూ వారిద్దరూ దీన్ని తోసిపుచ్చారు. అంతకుముందే 2015లోనే ఈ కేసులో వారిద్దరూ ముందస్తు బెయిల్ పొంది ఉన్నారు.
అయితే, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనను ఐదు రోజుల పాటు ప్రశ్నించడం ఎలాంటి ప్రభావం లేదని రాహుల్ గాంధీ అప్పట్లో చెప్పారు. ఈడీ, అలాంటి ఏజెన్సీలు తనను ప్రభావితం చేయవని.. తనను భయపెట్టలేమనే విషయాన్ని అధికారులు అర్థం చేసుకున్నారని, రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.. ఈడీ విచారణ సమయంలో తనకు మద్దతు ఇచ్చినందుకు పార్టీ కార్యకర్తలకు రాహుల్ గాంధీ ధన్యవాదాలు తెలిపారు. తాను ఒంటరిగా లేనని తనతో ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నవాళ్లు ఉన్నారని అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.