Family Beats Corona: కుటుంబంలో 11 మందికి కరోనా.. అందరూ కోలుకున్నారు.. ఎలా బయటపడ్డారంటే..

ప్రతీకాత్మక చిత్రం

మంగళూరుకు చెందిన రాజగోపాల్ అనే 58 ఏళ్ల పెద్దాయన కుటుంబం కరోనా బారిన పడింది. ఆయన భార్య పూర్ణిమకు కూడా కరోనా సోకింది. తొలుత రాజగోపాల్‌లో లక్షణాలు కనిపించాయి. ఆయనకు తీవ్రంగా జ్వరం రావడంతో డాక్టర్‌ సలహా కోరారు. ఫ్యామిలీ డాక్టర్ సూచన మేరకు కోవిడ్-19 నిర్ధారణ పరీక్ష చేయించుకున్నారు. టెస్ట్ చేయించుకోగా రాజగోపాల్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

  • Share this:
    మంగళూరు: కర్నాటకలో కరోనా కేసులు బెంబేలెత్తిస్తుంటే కోలుకుంటున్న వారి సంఖ్య కూడా కొంత ఊరట కలిగిస్తోంది. దక్షిణ కన్నడ జిల్లాలో శుక్రవారం నాటి కోవిడ్ కేసుల హెల్త్ బులిటెన్ ఒక్కసారి పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. కొత్తగా దక్షిణ కన్నడ జిల్లాలో 1215 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య కూడా ఆశాజనకంగానే ఉంది. శుక్రవారం ఒక్కరోజే ఈ జిల్లాలో 881 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కావడం ఊరట కలిగించే విషయం. దక్షిణ కన్నడ జిల్లా కేంద్రమైన మంగళూరులో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది కరోనా నుంచి కోలుకోవడం విశేషం. అంతేకాదు.. ఈ కుటుంబంలో ఎవరూ ఆసుపత్రికి వెళ్లలేదు. ఇంట్లో ఉండే హోం ఐసోలేషన్ పాటించి వైద్యుల సూచనలను పాటిస్తూ కరోనాను జయించారు. వివరాల్లోకి వెళితే.. మంగళూరుకు చెందిన రాజగోపాల్ అనే 58 ఏళ్ల పెద్దాయన కుటుంబం కరోనా బారిన పడింది. ఆయన భార్య పూర్ణిమకు కూడా కరోనా సోకింది. తొలుత రాజగోపాల్‌లో లక్షణాలు కనిపించాయి. ఆయనకు తీవ్రంగా జ్వరం రావడంతో డాక్టర్‌ సలహా కోరారు. ఫ్యామిలీ డాక్టర్ సూచన మేరకు కోవిడ్-19 నిర్ధారణ పరీక్ష చేయించుకున్నారు. టెస్ట్ చేయించుకోగా రాజగోపాల్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆయన హోం ఐసోలేషన్ పాటించి చికిత్స పొందుతుండగానే కుటుంబ సభ్యులందరిలో వైరస్ లక్షణాలు కనిపించాయి.

    రాజగోపాల్‌కు భార్య పూర్ణిమ, పాతికేళ్ల వయసు, 27 ఏళ్ల వయసున్న ఇద్దరు కొడుకులున్నారు. ముంబై నుంచి కొందరు బంధువులు ఇటీవల రాజగోపాల్ ఇంటికి వచ్చారు. వారిలో ముసలివారితో పాటు నడి వయసు వారు, ఒక పాప కూడా ఉంది. వైరస్ ఎవరి నుంచి ఇతరులకు వ్యాపించిందో తెలియదు గానీ 11 మందికీ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే.. అందరికీ స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపించడంతో హోం ఐసోలేషన్ పాటించి చికిత్స పొందితే సరిపోతుందని, పౌష్టికాహారం తీసుకోవాలని వైద్యులు సూచించారు.

    ఇది కూడా చదవండి: NewBorn: పుట్టిన 15 రోజులకే ఈ చిట్టితల్లికి కరోనా సోకింది.. పదే పది రోజుల్లో..

    రాజగోపాల్ సంపన్నుడే కావడంతో అందరూ భౌతిక దూరం పాటించి హోం ఐసోలేషన్ ఉండేందుకు అనువైన పరిస్థితి ఇంట్లో ఉంది. అందరూ పౌష్టికాహారం తీసుకుంటూ వైద్యులు సూచించిన మందులను వాడుతూ కరోనా వైరస్‌ను జయించారు. చిన్న పాప దగ్గర నుంచి 58 ఏళ్ల రాజగోపాల్ వరకూ అందరూ కరోనా నుంచి కోలుకోవడంతో ఆ కుటుంబం ఊపిరి పీల్చుకుంది.
    Published by:Sambasiva Reddy
    First published: