తమిళనాడులో తీవ్రమైన కాలిన గాయాలతో ఏనుగు మరణించడంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తున్నాయి. కొందరు దండగులు మండుతున్న టైర్‌ను ఏనుగుపైకి విసిరేసి తీవ్రంగా గాయపరిచారు. ఆ వన్యప్రాణికి నిప్పుపెట్టి చిత్రహింసలకు గురిచేశారు. కొన్ని రోజుల పాటు ప్రత్యక్ష నరకం చూసిన ఏనుగు చివరకు కన్నుమూసింది. తమిళనాడు నీలగిరి జిల్లాలోని మదుమలై టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లోన ఉన్న మసినగుడి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. రిసార్ట్‌లోకి వచ్చిన ఏనుగు పట్ల అక్కడ సిబ్బంది పైశాచికత్వంగా ప్రవర్తించారు. అక్కడి నుంచి వెళ్లగొట్టేందుకు కాలుతున్న టైర్‌ను ఏనుగుపైకి విసిరేశారు. ఆ టైర్ చెవికి అంటుకొని.. పూర్తిగా కాలేవరకు అలాగే ఉండిపోయింది. ఆ మంటల ధాటికి ఏనుగు తీవ్రంగా గాయపడి మరణించింది. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ అంగుస్వామి ట్విటర్లో షేర్ చేశారు.
సుధా రమేన్ అనే మరో ఐఎఫ్ఎస్ అధికారి ఇంకో వీడియోను షేర్ చేశారు. అందులో మనుషుల పట్ల ఏనుగులు ఎలా ప్రవర్తిస్తాయో స్పష్టంగా తెలుస్తోంది. నీటి ప్రవాహం ఒడ్డున ఓ ఏనుగుల గుంపు ఉంది. అవి మేత మేస్తుండగా వాటి మావటి నీటి ప్రవాహంలో సరదాగా ఈతకొట్టాడు. నీటి లోపలికి వెళ్లి అవతలి ఒడ్డుకు చేరే ప్రయత్నం చేశాడు. అతడిని చూసిన ఓ ఏనుగు.. నీటిలో కొట్టుకుపోతున్నాడేమోనని భావించింది. హుటాహుటిన అతడి వద్దకు పరుగెత్తి తొండాన్ని అందించింది. ఏనుగు చూపిస్తున్న ఆప్యాయతను చూసి అతడు మురిసిపోయాడు. ఏనుగు తొండాన్ని పట్టుకొని అలాగే ఉండిపోయాడు. ఈ వీడియోను షేర్ చేసిన సుధా రమేన్.. ''మనుషులంటే ఏనుగులకు ఎంత ప్రేమో చూడండి. కానీ మనం మాత్రం వాటిని ఎలా ట్రీట్ చేస్తున్నాం. ఆలోచించండి.'' అని పేర్కొన్నారు. తమిళనాడులోని ఏనుగు మృతిపై స్పందిస్తూ ఈ ట్వీట్ చేశారు.
ఈ రెండు వీడియోలు చూసిన నెటిజన్లు.. తమిళనాడు ఘటనపై తమదైన రీతిలో స్పందిస్తున్నారు. నిజంగా మనుషులు రాక్షసులనని.. జంతువులే దేవుళ్లని అభిప్రాయపడుతున్నారు. మనలో మార్పు రావాలని ట్వీట్స్ చేస్తున్నారు. మనం వాటికి హాని చేయనంత వరకు అవి కూడా మనకు హాని తలపెట్టవని.. ఎంతో ప్రేమ చూపిస్తాయని కామెంట్స్ చేస్తున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:January 23, 2021, 19:40 IST