ELECTION COMMISSION ON INDIA ANNOUNCED SCHEDULE OF PRESIDENTIAL ELECTIONS OF INDIA AK
Presidential Elections 2022: రాష్ట్రపతి ఎన్నికలకు మోగిన నగారా.. ఆ రోజే ఎన్నికలు.. ఈసీ ప్రకటన
రాష్ట్రపతి భవన్
Presidential Elections 2022: దేశ ప్రథమ పౌరుడైన రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించింది కేంద్రం ఎన్నికల సంఘం. ప్రస్తుతం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం త్వరలోనే ముగియనుండటంతో.. ఎన్నికలు జరగనున్నాయి.
రాష్ట్రపతి ఎన్నికలు సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రపతి ఎన్నికలకు(Presidential Elections) సంబంధించి ఈ నెల 15న నోటిఫికేషన్ విడుదల కానుంది. జూన్ 29న నామినేషన్ దాఖలకు తుది గడువు కాగా.. జులై 2న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు అని ఈసీ(Election Commission Of India) వెల్లడించింది. జులై 18 ఎన్నికలు జరుగుతాయని, జులై 21న కౌంటింగ్ జరుగుతుందని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. రహస్య బ్యాలెట్ పద్ధతిలో(Secret Ballot Voting) రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జరుగుతుందని ఈసీ తెలిపింది. ఓటింగ్ ప్రక్రియలో ఎన్నికల అధికారులు ఇచ్చే పెన్నును మాత్రమే ఉపయోగించాలని సూచించింది. ఈ ఎన్నికలకు సంబంధించి రాజకీయ పార్టీలు తమ ఎంపీ, ఎమ్మెల్యేలకు విప్ జారీ చేయకూడదని స్పష్టం చేసింది.
నామినేషన్ వేసే అభ్యర్థిని కనీసం 50 మంది బలపరచాలని పేర్కొంది. ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనే ఓటర్ల మొత్తం ఓట్ల విలువ 10,86,431. పార్లమెంట్, అసెంబ్లీ ప్రాంగణాల్లో పోలింగ్ నిర్వహిస్తారు. మొత్తం 776 మంది ఎంపీలు, 4033 మంది ఎమ్మెల్యేలు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎంపీల ఓటు విలువ 5,43,200 కాగా.. ఎమ్మెల్యేల ఓటు విలువ 5,43,231. తెలంగాణ ఎమ్మెల్యేల ఓటు విలువ 15,708. తెలంగాణ ఎంపీల మొత్తం ఓటు విలువ 16,992. ఏపీ ఎంపీల మొత్తం ఓటు విలువ 25,488 కాగా, ఏపీ ఎమ్మెల్యేల ఓటు విలుల 27,825. పార్లమెంట్లో, వివిధ రాష్ట్రాల్లో బీజేపీ, ఎన్డీయేకు మెజార్టీ ఉన్నప్పటికీ.. సొంతంగా రాష్ట్రపతి అభ్యర్థిని గెలిపించుకోలేని పరిస్థితిలో ఎన్డీయే ఉంది. దీంతో ఇతర మిత్రపక్షాల మద్దతును కూడబట్టే పనిలో బీజేపీ నాయకత్వం ఉంది.
ఇందుకోసం ఇప్పటికే పలు పార్టీలతో బీజేపీ నాయకత్వం చర్చలు జరుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఏపీకి చెందిన అధికార వైసీపీ, ఒడిశాకు చెందిన అధికార బీజేడీ మద్దతును కూడగట్టేందుకు బీజేపీ నాయకత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు ఎన్డీయేకు ధీటైన పోటీ ఇచ్చే యోచనలో ఉన్న విపక్షాలు.. ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపేందుకు చర్చలు జరుపుతున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ రకంగా ఎన్డీయేను ఇరుకునపెట్టాలని భావిస్తున్నాయి. అయితే గతంలో రామ్‌నాథ్ కోవింద్‌ను ఎన్డీయే అభ్యర్థిగా బరిలోకి దింపి పలు ఇతర పార్టీ మద్దతును కూడగట్టడంలో విజయం సాధించిన బీజేపీ.. ఈసారి ఎవరిని బరిలోకి దింపుతుందనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.
అయితే బీజేపీి నాయకత్వం ఎన్డీయే అభ్యర్థిని ప్రకటించిన తరువాత ఇతర రాజకీయ పార్టీలు కూడా ఎన్టీయే అభ్యర్థికి మద్దతు ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికల్లో రాంనాథ్ కోవింద్ మీరా కుమార్ ఎన్డీయే అభ్యర్థిగా, మీరా కుమార్ యూపీఏ అభ్యర్థిగా ఉన్నారు. అందులో కోవింద్ భారీ ఓట్లతో విజయం సాధించారు. రామ్‌నాథ్ కోవింద్‌కు 7,02,044 ఓట్లు రాగా, మీరా కుమార్‌కు 3,67,314 ఓట్లు వచ్చాయి. ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే కోవింద్‌కు 65.65 శాతం ఓట్లు రాగా, ప్రత్యర్థికి 34.35 శాతం ఓట్లు వచ్చాయి.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.