ఐదు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఆరు రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలకు (Rajya Sabha Bypolls)
కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) షెడ్యూల్ రిలీజ్ చేసింది. అసోం, తమిళనాడు (Tamilnadu) ,
మహారాష్ట్ర (Maharashtra) ,
మధ్యప్రదేశ్(Madya Pradesh) ,
పశ్చిమ బెంగాల్ (West Bengal) రాష్ట్రాల్లో వివిధ కారణాలతో ఖాళీ అయిన ఆరు రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేసింది. అక్టోబర్ 4న ఎన్నికలు (Elections on October 4) జరగనున్నాయి. వీటితో పాటు బీహార్‌లో ఒక శాసనమండలి స్థానానికి కూడా ఉప ఎన్నిక అక్టోబర్ 4న జరగనుంది.
పశ్చిమ బెంగాల్లో మానస్ రంజన్ భూటియా, అసోంలో బిస్వజిత్, తమిళనాడులో కేపీ మునుస్వామి, ఆర్. వైద్యలింగం, మధ్యప్రదేశ్ నుంచి ధావర్ చంద్ గెహ్లోత్ రాజీనామా చేశారు. మహారాష్ట్రకు చెందిన రాజ్యసభ సభ్యుడు రాజీవ్ శంకర్రావ్ సతావ్ అకాల మరణం చెందారు. దీంతో ఈ ఆరు స్థానాలకు ఉప ఎన్నిక నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసింది.
ముఖ్యమైన తేదీలు
- నోటిఫికేషన్ జారీ సెప్టెంబర్ 15
- నామినేషన్లకు చివరి తేదీ సెప్టెంబర్ 22
- నామినేషన్ల పరిశీలన సెప్టెంబర్ 23
- నామినేషన్ల విత్ డ్రా చేసుకోవడానికి ఆఖరి తేదీ సెప్టెంబర్ 27
- ఉప ఎన్నికలు జరిగే తేదీ అక్టోబర్ 4
- ఎన్నికల సమయం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు
- ఓట్ల లెక్కింపు తేదీ అక్టోబర్ 4
రాజ్యసభ ఎన్నికలు అంటే రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. రాష్ట్ర అసెంబ్లీలోనే ఓటింగ్ జరుగుతుంది. ప్రజలు ఇందులో ప్రత్యక్షంగా ఓట్లు వేయరు. ఎమ్మెల్యేల సంఖ్య తక్కువగా ఉంటుంది కాబట్టి, కట్టుదిట్టమైన భద్రత, కరోనా నియమాల మధ్య ఉప ఎన్నికలు నిర్వహించడానికి ఈసీ రెడీ అయింది.
ఇటీవల పశ్చిమ బెంగాల్, ఒడిశాలో నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. బెంగాల్ ఎన్నికల్లో ఓడిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి
మమతా బెనర్జీ తాజాగా భవానీపూర్ నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్నారు. ఆమె పోటీ చేసేందుకు వీలుగా అక్కడ గెలిచిన అభ్యర్థి శోభన్ దేవ్ రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచ్చింది. దీంతో పాటు మరో రెండు చోట్ల కూడా అక్కడ ఉప ఎన్నిక జరగనుంది.
ఏపీ, తెలంగాణలో ఉప ఎన్నికలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం రాలేదు. ఏపీలో బద్వేల్ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య కరోనాతో మరణించారు. తెలంగాణలోని హుజూరాబాద్‌లో మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచ్చింది. ఈ రెండింటిపైనా కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
![]()
రాజ్యసభ ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన షెడ్యూల్
రాష్ట్రంలో కరోనా వల్ల తాము ఇప్పుడు ఎలాంటి ఎన్నికలు నిర్వహించలేమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్రంలో అధికారుల నుంచి నివేదిక ఇచ్చినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే ఏపీ, తెలంగాణలో ఉప ఎన్నికలపై ఎలాంటి ప్రకటన రాలేదు. దసరా, దీపావళి తర్వాత ఏపీ, తెలంగాణల్లో ఉప ఎన్నికలకు షెడ్యూల్ రావొచ్చని అంచనా వేస్తున్నారు.