హోమ్ /వార్తలు /జాతీయం /

EC : మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్... ఇవీ వివరాలు

EC : మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్... ఇవీ వివరాలు

మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ (Credit - Twitter - ANI)

మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ (Credit - Twitter - ANI)

2019 లోక్ సభ ఎన్నికలు జరిగిన నాలుగు నెలల తర్వాత... మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ రెడీ అయ్యింది. ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసింది.

మహారాష్ట్ర, హర్యానా... ఈ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీయే అధికారంలో ఉంది. మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో కూడా బీజేపీ, దాని మిత్ర పక్షాలే ఎక్కువ సీట్లు సాధించాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రెండు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ని ప్రకటించారు ఎన్నికల ప్రధాన అధికారు సునీల్ అరోరా. మహారాష్ట్రలో 288, హర్యానాలో 90 సీట్లకు షెడ్యూల్ రిలీజ్ చేశారు. మహారాష్ట్రలో 8.94 కోట్ల మంది, హర్యానాలో 1.28 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. హర్యానా అసెంబ్లీ కాలపరిమితి... నవంబర్ 2తో ముగుస్తుంది. మహారాష్ట్ర అసెంబ్లీ కాలపరిమితి నవంబర్ 9తో ముగుస్తుంది. ప్రచారం సమయంలో ప్లాస్టిక్ వాడొద్దన్న ఈసీ... మహారాష్ట్రలో 1.8 లక్షల ఈవీఎంలు, హర్యానాలో 1.30 లక్షల ఈవీఎంలు వాడనున్నట్లు తెలిపింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఇద్దరు ప్రత్యేక అబ్జర్వర్లను నియమిస్తున్నట్లు వివరించింది. వాళ్లు అభ్యర్థుల ప్రచార ఖర్చులను పరిశీలిస్తారు. అభ్యర్థులు తమ నామినేషన్‌లో క్రిమినల్ వివరాలు సహా అన్ని విషయాలు చెప్పాలి.


సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా పెడతామన్న ఈసీ... సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి భద్రతా చర్యలు తీసుకుంటామని వివరించింది. ఇవాళ్టి నుంచీ మహారాష్ట్ర, హర్యానాలో ఎన్నికల కోడ్ అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించింది.


- సెప్టెంబర్ 27న ఎన్నికలకు నోటిఫికేషన్


- నామినేషన్ దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 4


- అక్టోబర్ 5 - నామినేషన్ల పరిశీలన


- అక్టోబర్ 7 - నామినేషన్ల ఉపసంహరణ


- అక్టోబర్ 21న మహారాష్ట్ర, హర్యానాలో ఎన్నికలు


- అక్టోబర్ 24న మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు విడుదల.


మహారాష్ట్ర, హర్యానాలో ఆల్రెడీ ఎన్నికల సందడి మొదలైపోయింది. ఆ వేడిని మరింత పెంచుతూ... కేంద్ర ఎన్నికల సంఘం... ఆ రెండు రాష్ట్రాల్లో ఎప్పుడు ఎన్నికలు నిర్వహించబోయేదీ ప్రకటించింది. మహారాష్ట్రలో అసెంబ్లీ సీట్ల సంఖ్య 288 ఉండగా... బీజేపీ 122, శివసేన 63, కాంగ్రెస్ 42, ఎన్సీపీ 41 స్థానాలు గెలుచుకున్నాయి. మిగతా పార్టీలు 20 సీట్లు గెలుచుకున్నాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో... 15 ఏళ్ల పొత్తులను వదులుకొని... కాంగ్రెస్, ఎన్సీపీ వేర్వేరుగా పోటీ చేశాయి. కారణం సీట్ల షేరింగ్‌లో రెండు పార్టీలకు సెట్ కాలేదు. అదే సమయంలో... బీజేపీ సింగిల్‌గానే బరిలో దిగి... 122 సీట్లతో అతి పెద్ద పార్టీగా అవతరించింది. అదే సమయంలో... శివసేన ఒంటరిగా పోటీ చేసి... 63 సీట్లు సాధించింది.


ఇప్పుడు కాంగ్రెస్, ఎన్సీపీ ఆల్రెడీ అనధికారికంగా సీట్ల షేరింగ్ చేసుకున్నాయి. కాంగ్రెస్ 123, ఎన్సీపీ 125 సీట్లలో పోటీ చేస్తుందని కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చవాన్ ఇటీవలే ప్రకటించారు. మిగతా 41 స్థానాల్లో ఇతర మిత్రపక్షాలు పోటీ చేస్తాయని వివరించారు. రెండు పార్టీల మధ్యా కుదిరిన ఏకాభిప్రాయంతోనే సీట్ల సర్దుబాటు జరిగిందని ఆయన అన్నారు.


కాంగ్రెస్ ఇప్పటికే 104 మందితో తొలి జాబితా రెడీ చేసుకుంది. ఇందులో మాజీ ముఖ్యమంత్రులు అశోక్ చవాన్, పృథ్వీరాజ్ చవాన్‌తోపాటూ... పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బాలాసాహెబ్ థొరాట్ పేర్లు కూడా ఉన్నాయి. మరోవైపు ఆల్రెడీ కలిసి కొనసాగుతున్న బీజేపీ, శివసేన మధ్య నెక్ట్స్ ఎన్నికల్లో పొత్తుల కోసం చర్చలు సాగుతున్నాయి. ఈసారి శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే కొడుకు ఆదిత్య థాక్రేను బరిలో దింపాలనుకుంటున్నారు.


ఏప్రిల్-మేలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో... కాంగ్రెస్ 1 స్థానం గెలుచుకోగా, ఎన్సీపీ 4 సాధించింది. బీజేపీ 23, దాని మిత్రపక్షం శివసేన 18 స్థానాలు సాధించాయి.


హర్యానా రాజకీయాలు : హర్యానాలో బీజేపీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం ఆల్రెడీ ఎన్నికల బరిలోకి దూకేసింది. మొత్తం 90 అసెంబ్లీ సీట్లూ గెలవడమే లక్ష్యంగా... రాష్ట్రవ్యాప్తంగా జన్ ఆశీర్వాద్ యాత్ర చేపట్టింది. ఆగస్ట్ 18 నుంచీ ఈ యాత్ర సాగిపోతోంది. కాంగ్రెస్ మాత్రం ఇంకా యాక్షన్ మొదలుపెట్టలేదు. లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీ... హర్యానాలో ఒక్క సీటూ గెలవలేకపోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (INLD), జననాయక్ జనతా పార్టీ (JJP)లు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చుకున్నాయి. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), బహుజన్ సమాజ్ పార్టీ (BSP), స్వరాజ్ ఇండియా పార్టీలు... ఇంకా అనుకున్న స్థాయిలో రాజకీయంగా ఎదగలేదు. ఈ పరిస్థితులన్నీ బీజేపీకి అడ్వాంటేజ్‌గా మారుతున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ... మొత్తం 10 సీట్లనూ గెలుచుకుంది. ఫలితంగా ఆ పార్టీ తిరిగి భారీ విజయం సాధిస్తామనే కాన్ఫిడెన్స్‌తో ఉంది.

First published:

Tags: Election Commission of India, Haryana, Maharashtra

ఉత్తమ కథలు