ELECTION COMISSION SAYS IT CAN NOT STOP FREEBIES ITS VOTERS CALL PVN
Freebies : ఓటర్లదే ఆ బాధ్యత..పార్టీల ఉచిత హామీలను అడ్డుకోలేమన్న ఈసీ
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా
Election Commission Of India : రాష్ట్ర ప్రభుత్వాలు, పార్టీలు ప్రకటించే ఉచిత పథకాల్ని,హామీలను తాము అడ్డుకోలేమని స్పష్టం చేసింది ఎలక్షన్ కమిషన్. చట్టంలో సరైన మార్పులు రానంత వరకూ ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రకటించే వాగ్దానాలను నియంత్రించే ఏ చర్య అయినా ఫలితం ఇవ్వదని సుప్రీంకోర్టుకు కేంద్ర ఎన్నికల కమిషన్ తెలియజేసింది.
EC On Freebies : ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చేందుకు రాజకీయ పార్టీలు,అధికారంలోకి వచ్చాక ప్రజలను ఆకర్సించేందుకు ప్రభుత్వాలు అనేక హామీలను,పథకాలను ప్రకటిస్తుంటాయన్న విషయం తెలిసిందే. అయితే చాలా సమయాల్లో అమలు లేదా ఆచరణ పాధ్యం కానీ హామీలను కూడా రాజకీయ పార్టీలు ఇస్తుంటాయి. అయితే రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలపై కేంద్ర ఎన్నికల కమిషన్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఉచిత హామీలు ఇవ్వడం రాజకీయ పార్టీల విధాన నిర్ణయమని ఈసీ పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాలు, పార్టీలు ప్రకటించే ఉచిత పథకాల్ని,హామీలను తాము అడ్డుకోలేమని స్పష్టం చేసింది ఎలక్షన్ కమిషన్. చట్టంలో సరైన మార్పులు రానంత వరకూ ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రకటించే వాగ్దానాలను నియంత్రించే ఏ చర్య అయినా ఫలితం ఇవ్వదని సుప్రీంకోర్టుకు కేంద్ర ఎన్నికల కమిషన్ తెలియజేసింది. ఈ విషయంలో రాజకీయ పార్టీలను నియంత్రించలేమని స్పష్టం చేసింది.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉచిత హామీలు ఇస్తున్న పార్టీలపై చర్యలు తీసుకోవాలని, పార్టీ గుర్తు రద్దు చేయాలని కోరుతూ గత జనవరి 25న సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారణ సందర్భంగా.. ఈ మేరకు ఈసీ తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ అఫిడవిట్ ను దాఖలు చేసింది. తీవ్రమైన అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాల ఖజానాపై భారీ ఆర్థిక భారం మోపేందుకు ఎన్నికలప్పుడు పార్టీలు గుప్పించే బుద్ధిలేని ఉచిత పథకాలను అడ్డుకోవాలని పిటిషనర్, సీనియర్ న్యాయవాది అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ్ తన పిల్‌లో కోరారు. ఎన్నికల్లో లబ్ధి కోసం అసంబద్ధ హామీలిచ్చే పార్టీల గుర్తును సీజ్ చేయడం లేదా గుర్తింపును రద్దు చేసేలా ఆదేశాలు జారీచేయాలని కోరారు.
తాజాగా సుప్రీంకోర్టులో ఈసీ ఫైల్ చేసిన అఫిడవిట్ లో.. "పార్టీలు ఎన్నికలకు ముందు.. లేదా అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు తీసుకునే విధానాలు, నిర్ణయాలను ఎన్నికల కమిషన్ నియంత్రించదు. చట్టంలో నిబంధనలను చేర్చకుండా చర్యలు చేపడితే అధికార పరిధి దాటడమే అవుతుంది. ఉచిత హామీలు రాజకీయ పార్టీలు విధానపరమైన నిర్ణయాలు.. రాజకీయ పార్టీలకు మార్గదర్శకాలను న్యాయస్థానం నిర్దేశించవచ్చు.. కానీ ఎన్నికల సంఘం దానిని అమలు చేయదు.ఇటువంటి విధానాలు ఆర్థికంగా లాభదాయకంగా ఉన్నాయా? లేదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయా? అనేది రాష్ట్ర ఓటర్లు నిర్ణయించుకోవాల్సిన ప్రశ్న" అని ఈసీ తన అఫిడవిట్ లో పేర్కొంది. అయితే, ఈ విషయంలో చట్టంలో మార్పులు తీసుకురావాలని కోరుతూ కేంద్రానికి కొన్ని సూచనలు చేసినట్లు ఈసీ చెప్పింది. 2016లో దాదాపు 47 ప్రతిపాదనలు పంపినట్లు తెలిపింది.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.