మన దేశంలో పులులు, సింహాలు, చిరుత పులుల సంఖ్య బాగానే ఉంది. అడవులతో పాటు జూపార్క్‌ల్లో కూడా కనిపిస్తాయి. కానీ చీతా (Cheetah) మాత్రం ఒక్కటి కూడా లేదు. 1948లో చివరి చీతా చనిపోయింది. ఆ తర్వాత దేశంలో వీటి ఆనవాళ్లు కనుమరుగయ్యాయి. ఈ నేపథ్యంలో 1952లోనే చీతాలను అంతరించిన జాతిగా భారత ప్రభుత్వం ప్రకటించింది. ఐతే మళ్లీ 74 ఏళ్ల తర్వాత మనదేశంలోకి చీతాలు అడుగు పెట్టబోతున్నాయి. వన్యప్రాణుల సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం చోటుచేసుకోవడంతో నమీబియా (Namibia) నుంచి ఎనిమిది చీతాలు ఇండియాకు రాబోతున్నాయి. క్రూరత్వం, వేటాడే నైపుణ్యాలు, భవిష్పుత్తులో వాటి సంతతిని పెంచగల జన్యుసామర్వ్యాలను పరిగణనలోకి తీసుకొని 8 చీతాలను ఎంపిక చేశారు. వాటికి ఇప్పటికే వ్యాక్సినేషన్ చేసి.. ఐసోలేషన్‌లో ఉంచారు.
A special bird touches down in the Land of the Brave to carry goodwill ambassadors to the Land of the Tiger.#AmritMahotsav #IndiaNamibia pic.twitter.com/vmV0ffBncO
— India In Namibia (@IndiainNamibia) September 14, 2022
ఐదు ఆడ, మూడు మగ చీతాలను బీ747 జంబో జెట్ విమానంలో తరలించనున్నారు. విమానంపైనా ప్రత్యేకమైన చీతా ఫొటోను ముద్రించారు. అది నమీబియాలోని విండ్‌హోక్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఈ నెల 17న ఉదయం జైపూర్‌కు చేరుకుంటుంది. అక్కడి నుంచి మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కుకు తీసుకెళ్తారు. నాలుగు నుంచి ఆరేళ్ల వయసున్న ఈ చీతాలను సెప్టెంబరు 17న ప్రధాన నరేంద్ర మంత్రి కునో పార్క్‌లో విడిచిపెడతారు. అదే రోజు ప్రధాని పుట్టిన రోజు కావడం విశేషం. వీటి కోసం కునో నేషనల్ పార్కులో ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. ఆలనా పాలన చూసేందుకు సిబ్బందిని నియమించారు. మొదట 80 రోజులపాటు క్వారంటైన్ ఎన్‌క్లోజర్లలో ఉంచుతారు.
మనదేశంలో ఉన్న ఆఖరి చీతా.. 1948లో అప్పటి ఉమ్మడి మధ్యప్రదేశ్ ప్రస్తుత చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కొరియా జిల్లాలో చనిపోయింది. ఆ తర్వాత ఇప్పటి వరకు ఒక్క చీతా కూడా లేదు. ఆ తర్వాత భారతీయ వన్యప్రాణి సంరక్షకులు తొలిసారిగా 2009లో భారత్‌కు చీతాలను రప్పించే ప్రతిపాదనను.. చీతా కన్జర్వేషన్ ఫండ్ ముందు ఉంచారు. అనంతరం భారత ప్రభుత్వ ఆహ్వానం మేరకు డాక్టర్ మార్కర్ పలు మార్లు ఇండియాలో పర్యటించి.. చీతాలను ప్రవేశపెట్టేందుకు ఉద్దేశించిన ప్రాంతంతో పాటు ముసాయిదాను పరిశీలించారు. ఈ ప్రాజెక్టుకు 2020లో సుప్రీంకోర్టు కూడా ఆమోద ముద్రవేసింది. అనంతరం ఈ ఏడాది జులైలో చీతాల సంరక్షణపై నమీబియా, భారత్ మధ్య ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగానే 8 చీతాలను భారత్‌కు తీసుకొస్తున్నారు. కాగా, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 500 చీతాలు ఉన్నట్లు అంచనా.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.