కేరళలోని ఎలంతూరులో జరిగిన జంట నరబలి(Double Human Sacrifice) కేసులో ఆశ్చర్యపరిచే విషయాలు బయటపడుతున్నాయి. బాధితులను చంపిన తర్వాత వారి శరీరభాగాలను నిందితులు వండినట్లు తెలుస్తోంది. ఎలంతూరు జంట నరబలి కేసులో ప్రధాన నిందితుడు మహ్మద్ షఫీ(Mohammad Shafi) అలియాస్ రషీద్(52) ఆకృత్యాలు ఒక్కొక్కటీ బయటకు వస్తున్నాయి. ఈ జంట నరబలికి ముందే అతనిపై కొన్ని కేసులు ఉన్నాయి. నరబలి ఇస్తే ఆర్థికంగా లాభపడతామని షఫీ చెప్పిన మాయమాటలతో నేరం చేసిన తీరును భగవల్ సింగ్- లైలా దంపతులు పోలీసులకు వివరించారు.
* చదివింది ఆరో తరగతి
కేరళ ఎర్నాకులం జిల్లాలోని పెరుంబవూరుకు చెందిన మహ్మద్ షఫీ 6వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. నబీసాతో అతనికి వివాహం అయింది. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మూడేళ్ల మనవరాలు కూడా ఉంది. అతను డ్రైవర్ నుంచి మెకానిక్ వరకు చాలా ఉద్యోగాలు చేశాడు. ప్రస్తుతం కొచ్చిలో ఒక చిన్న హోటల్ని నడుపుతున్నాడు. ఇక్కడే అతను కుటుంబాలకు దూరంగా ఉంటున్న, బాధల్లో ఉన్న మహిళను గమనించి పరిచయం చేసుకుంటున్నాడు.
* వృద్ధురాలిపై అత్యాచారం కేసులో నిందితుడు
2020లో 75 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం చేసిన కేసులో అతనిపై విచారణ పెండింగ్‌లో ఉంది. కొచ్చిలోని పుతెన్క్రూజ్ పోలీసులు 2020 ఆగస్టు 3న ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు చేసి, అక్టోబర్ 17న ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అతను ట్రక్ డ్రైవర్‌గా ఉన్నప్పుడు అతనిపై ఈ కేసు నమోదైంది. మహిళపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేయడంతో పాటు కత్తితో ఆమె వ్యక్తిగత భాగాల్లో గాయాలు చేశాడు. జంట హత్యల కేసును మంగళవారం మీడియాకు కొచ్చి సిటీ పోలీస్ కమిషనర్ హెచ్.నాగరాజు వివరించారు. నరబలికి గురైన ఇద్దరు మహిళలకు ఒకే చోట గాయాలు గుర్తించినట్లు పేర్కొన్నారు.
* షఫీ సైకోపాత్
కమిషనర్ మాట్లాడుతూ..‘షఫీ సైకోపాత్. అతని లైంగిక వక్రబుద్ధి ఇప్పుడు రుజువైంది. అతను లైంగిక ఆనందాన్ని పొందేవాడు, దాని కోసం చంపడానికి కూడా వెళ్తాడు. అతను ఫేక్ ఫేస్బుక్ అకౌంట్‌ను ఉపయోగిస్తున్నాడు. ఎవరికైనా ఆర్థిక సమస్యలు ఉంటే తనను సంప్రదించాలని ఫేస్బుక్లో సూచించాడు. ఆ విధంగానే భగవల్ సింగ్‌తో అతను స్నేహం చేసాడు. వారి విశ్వాసాన్ని గెలుచుకోవడానికి షఫీకి మూడు సంవత్సరాలు పట్టింది. అతను నేరాలు చేసి ఒకరకమైన పైశాచిక ఆనందం పొందుతాడు. బాధితులను గాయపరిచి రక్తం కారడాన్ని చూసి ఉద్వేగానికి గురవుతాడు.’ అని వివరించారు.
* సింగ్‌ని కూడా తొలగించాలనే ప్లాన్
ఎటువంటి ఆధారాలు లేనప్పటికీ, షఫీ దంపతులు చంపిన ఇద్దరు మహిళల మృతదేహాల మాంసాన్ని వండినట్లు భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. లైలా తన ప్రకటనలో ఈ విషయాన్ని చెప్పింది. రెండో నిందితురాలు లైలాతో ఆమె భర్త భగవల్ సింగ్ ఎదుటే షఫీ లైంగిక సంబంధం పెట్టుకున్నాడని సమాచారం. హత్యల గురించిన సమాచారాన్ని లీక్ చేస్తారనే భయంతో సింగ్‌ని తొలగించడానికి షఫీ, లైలా ప్లాన్ చేశారని తెలిసింది. భగవల్ సింగ్‌తో సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి షఫీ నకిలీ సోషల్ మీడియా ఉపయోగించినట్లు ఇప్పుడు బయటపడింది. శ్రీదేవి పేరిట ఫేక్ ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేశాడు. వైద్యురాలిగా పరిచయం చేసుకున్నాడు.
* మరొకరిని ఇరికించే ప్రయత్నం
అరెస్టుకు కొన్ని రోజుల ముందు షఫీ తన స్నేహితుడు ముహమ్మద్ బిలాల్‌ను ట్రాప్ చేసి పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. కిడ్నాప్ వెనుక బిలాల్ హస్తం ఉందని షఫీ పోలీసులకు చెప్పడంతో 26 ఏళ్ల ఆటో డ్రైవర్ రెండు రోజులు పోలీస్ స్టేషన్లో ఉండాల్సి వచ్చింది. సెప్టెంబరు 26న బిలాల్ తన స్కార్పియోను అద్దెకు వాడుకున్నాడని చెప్పాడు. నేరంలో షఫీ నేరం చేశాడనడానికి తగిన సాక్ష్యాధారాలు లభించడంతో పోలీసులు బిలాల్‌ను విడిచిపెట్టారు.
షఫీ భార్య నబీసా తెలిపిన వివరాల ప్రకారం.. షఫీకి సొంతంగా బ్యాంకు అకౌంట్ లేదని, ఇంటికి డబ్బులు తీసుకురాలేదు కాబట్టి, షఫీ నిర్దోషి అని చెప్పలేమని చెప్పింది. అదే విధంగా అతను నరబలి చేశాడని కూడా భావించడం లేదని తెలిపింది. అతని అన్ని సమస్యలకు మద్యపానం మూల కారణమని పేర్కొంది. మద్యం మత్తులో షఫీ దారి తప్పి ఉంటాడని, నిత్యం మద్యం తాగి ఇంట్లో గొడవలు చేసేవాడని వివరించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Kerala, National News