Home /News /national /

ED QUESTIONS SONIA GANDHI TWO DOZEN QUESTIONS WERE ASKED AFTER WHICH SHE ASKED TO GO HOME FOR HER MEDICATION SK

Sonia Gandhi: మొదటి రోజు 2 గంటల పాటు ఈడీ విచారణ.. మందులు వేసుకోవాలని ఇంటికి వెళ్లిపోయిన సోనియా

సోనియా గాంధీ (పాత ఫొటో)

సోనియా గాంధీ (పాత ఫొటో)

Sonia Gandhi: సోనియా గాంధీని 2 గంటల 20 నిమిషాల పాటు విచారించినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. ఈ కేసులో ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేసినట్లు చెప్పారు. అనంతరం తాను మందులు తీసుకోవాల్సి ఉందని చెప్పడంతో.. ఆమెను ఇంటికి పంపించారు

    నేషనల్ హెరాల్డ్ (National Herald Case) మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ (Sonia Gandhi)తో ఈడీ విచారణ ముగిసింది. రెండు గంటలకు పైగా ఆమెపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) అధికారులు ప్రశ్నలు గుప్పించారు. 20కిపైగా ప్రశ్నలు వేసినట్లు సమాచారం. ఇవాళ మధ్యాహ్నం సెంట్రల్ ఢిల్లీ అబ్దుల్ కలాం రోడ్డులోని ఈడీ ప్రధాన కార్యాలయానికి సోనియా గాంధీ జడ్ ప్లస్ కేటగిరి భద్రతతో వెళ్లారు. 12:30 గంటలకు విచారణ ప్రారంభమైంది. ఆమె వెంట కూతురు ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఉన్నారు. సోనియాకు అనారోగ్య సమస్యలు ఉండడంతో ఆమెకు సహకారిగా ఉండేందుకు ప్రియాంక గాంధీ (Priyanka Gandhi)కి ఈడీ అధికారులు అనుమతి ఇచ్చారు. ఐతే సోనియా విచారణ గదిలోకి వెళ్లగా.. ప్రియాంకను వేరొక గదిలో ఉంచారు. రాహుల్ గాంధీ కూడా ఈడీ కార్యాలయానికి వచ్చినప్పటికీ.. కాసేపటికే ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.



    75 ఏళ్ల సోనియా గాంధీ ఇటీవల కరోనా (Coronavirus) నుంచి కోలుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విచారణలో పాల్గొన్న అధికారుల బృందం కరోనా నిబంధనలు పాటించింది. ఇద్దరు డాక్టర్లతో పాటు ఓ అంబులెన్స్‌ను కూడా స్టాండ్ బై‌గా ఉంచారు.సోనియా గాంధీకి 20కి పైగా ప్రశ్నలు వేసినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. విచారణ మధ్యలో ఆమె రెండుసార్లు ప్రియాంక గాంధీ వద్దకు వెళ్లారని పేర్కొన్నాయి. 2 గంటల 20 నిమిషాల పాటు విచారణ జరిగిందని వెల్లడించారు. ఈ కేసులో ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేసినట్లు చెప్పారు. అనంతరం తాను మందులు తీసుకోవాల్సి ఉందని చెప్పడంతో.. ఆమెను ఇంటికి పంపించారు. సోమవారం తిరిగి విచారిస్తామని ఈడీ అధికారులు చెప్పారు.



    మరోవైపు సోనియా గాంధీపై ఈడీ విచారణను నిరసిస్తూ.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తూ.. సోనియాపై కక్ష సాధింపుకు పాల్పడుతోందని నిరసనలకు కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు.


    ఏంటీ నేషనల్ హెరాల్డ్ కేసు..?
    కాంగ్రెస్‌లోని కొంతమంది నేత‌ల‌తో కలిసి జవహర్ లాల్ నెహ్రూ 1938లో నేషనల్ హెరాల్డ్(National Herald) అనే న్యూస్ పేపర్‌ను  ప్రారంభించారు. దీనిని అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అనే సంస్థ పబ్లిష్ చేసేది. స్వాతంత్ర పోరాటంలో ఎన్నో క‌థ‌నాల‌ను స్ఫూర్తిదాయ‌క క‌థనాల‌ను అందించి స్వాతంత్య్ర కాంక్ష‌ను రేపింది. కాలక్రమేణా ఈ పేపర్ కాంగ్రెస్ పత్రికగా ప్ర‌జల్లో ఓ ముద్ర ప‌డింది. స్వాతంత్య్రం అనంత‌రం అధికార న్యూస్ పేపర్‌గా చలామణి అయింది. తీవ్ర నష్టాల క్రమంలో 2008లో నేషనల్ హెరాల్డ్‌ని మూసివేశారు. పబ్లిక్ సంస్థ అయిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్(ఏజేఎల్)ను యంగ్ ఇండియా లిమిటెడ్ (వైఈఎల్) అనే ప్రైవేట్ సంస్థకు తక్కువ మొత్తానికే కట్టబెట్టారని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి గతంలో ఫిర్యాదు చేశారు. దాదాపు రూ.2వేల కోట్ల విలువైన ఆస్తులను రాహుల్ గాంధీ డైరెక్టర్‌గా ఉన్న వైఈఎల్ సంస్థ అక్రమంగా పొందిందని పేర్కొన్నారు. ఈ కేసు విషయమై 2014లో ఈడీ విచారణ చేపట్టింది. అందులో భాగంగానే ప్రస్తుతం కాంగ్రెస్ అగ్రనేతలను విచారిస్తోంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Congress, Priyanka Gandhi, Rahul Gandhi, Sonia Gandhi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు