దళితుల సెంటిమెంట్ కు ముడిపడిన కీలక అంశం నేపథ్యంలో పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. పోలింగ్ తేదీని వాయిదా వేయాలంటూ అన్ని పార్టీలూ డిమాండ్ చేయడంతో భారత ఎన్నికల సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మొత్తం 117 స్థానాలున్న పంజాబ్ అసెంబ్లీకి ఫిబ్రవరి 14న ఒకే విడతలో పోలింగ్ జరగాల్సి ఉండగా, ఆ తేదీని కనీసం వారం రోజులకు వాయిదా వేయాలంటూ కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ పార్టీలు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్రకు వరుస లేఖలు రాశాయి. దీంతో పంజాబ్ ఎన్నికల వాయిదా అంశంపై ఎన్నికల కమిషన్ సోమవారం నాడు సమావేశమైంది. అధికార, విపక్షాలు సహా అన్ని పార్టీల నుంచి ఒకే రకమైన డిమాండ్ వచ్చిన దరిమిలా పంజాబ్ పోలింగ్ తేదీ ఫిబ్రవరి 14 నుంచి ఫిబ్రవరి 20కి వాయిదా వేసింది ఈసీ.
పంజాబ్లో 32 శాతం మంది దళితులే అన్న సంగతి తెలిసిందే. పంజాబ్ సహా ఉత్తరాదిలోని దళితులు అమితంగా ఆరాధించే గురు రవిదాస్ జయంతి ఫిబ్రవరి 16న జరుపుతారు. రవిదాస్ జయంతి పంజాబ్ లోని దళితులు లక్షల సంఖ్యలో ఉత్తరప్రదేశ్లోని వారణాసికి వెళ్లి అక్కడ సంత్ పుట్టిన ప్రదేశంలో ప్రార్థనలు చేస్తారు. రవిదాస్ జయంతి సందర్భంగా పంజాబ్ దళితులు యూపీకి వెళ్లే ప్రక్రియ ఫిబ్రవరి 10 నుంచి 16వ తేదీ మధ్య ఉంటుంది.
రవిదాస్ జయంతిలో పాల్గొనే క్రమంలో పంజాబ్ దళితులు దాదాపు 20 నుంచి 30 లక్షల మంది యూపీలో పర్యటించే అవకాశం ఉందని, ఫిబ్రవరి 14న పంజాబ్ లో పోలింగ్ ఉన్నందున వీరంతా తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని, కాబట్టి అసెంబ్లీ ఎన్నికల తేదీని ఆరు రోజులపాటు.. అంటే రవిదాస్ జయంతి ఉత్సవాల తర్వాతి వరకు వాయిదా వేయాలంటూ ఈసీకి కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, ఆమ్ ఆద్మీ పార్టీలు అభ్యర్థించాయి. పార్టీల అభ్యర్థనపై సోమవారం భేటీ అయిన ఈసీ.. కీలక నిర్ణయాన్ని వెలువరించింది.
తొలుత జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం ఐదు రాష్ట్రాలు(ఉత్తరప్రదేశ్, పంజాబ్, మణిపూర్, ఉత్తరాఖండ్, గోవా)లో ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. యూపీలో ఏడు దశల్లో (ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు), మణిపూర్ లో రెండు దశల్లో (ఫిబ్రవరి 27, మార్చి3 తేదీల్లో), పంజాబ్, ఉత్తరాఖండ్, గోవాల్లో ఒకే దశలో(ఫిబ్రవరి 14న) పోలింగ్ నిర్వహిస్తామని ఈసీ ప్రకటించింది. అయితే, పంజాబ్ లో ఫిబ్రవరి 16 వరకు రవిదాస్ జయంతి ఉత్సవాలు జరుగనున్నందున పోలింగ్ ను రెండో దశలో కాకుండా మూడో దశలో, అంటే, ఫిబ్రవరి 20న నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Assembly Election 2022, Election Commission of India, Punjab