కర్ణాటకలో 15 అసెంబ్లీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. డిసెంబర్ 5న ఉప ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 9న ఫలితాలు వెలువడనున్నాయి. ఉప ఎన్నికలు జరిగే అన్ని నియోజకవర్గాల్లోనూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఇప్పుడు అందరి కళ్లు సుప్రీంకోర్టు మీదే ఉన్నాయి. తమ అనర్హత వేటు మీద 17 మంది ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై బుధవారం రోజు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు, దేశంలో మరికొన్ని చోట్ల ఉప ఎన్నికలతో పాటే కర్ణాటక అసెంబ్లీలో 15 స్థానాలకు అక్టోబర్ 21న ఉప ఎన్నికలు నిర్వహించడానికి షెడ్యూల్ విడుదల చేసింది. అయితే, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో వాటిని వాయిదా వేసింది. అప్పుడు మొత్తం 29 నామినేషన్లు దాఖలయ్యాయి. అవన్నీ ఇప్పుడు పరిగణనలోకి తీసుకుంటారు.
కర్ణాటకలో కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత యడ్యూరప్ప సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ సమయంలో కొందరు కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు యడ్యూరప్పకు మద్దతు పలికారు. పార్టీ విప్‌ను ఉల్లంఘించిన వారిపై అనర్హత వేటు వేయాలంటూ ఆయా పార్టీలు స్పీకర్ రమేష్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. కొంతకాలం తర్జన భర్జనల తర్వాత రమేష్ కుమార్ వారిపై అనర్హత వేటు వేశారు. 15వ అసెంబ్లీ కాలం ముగిసేవరకు వారు ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా అనర్హులుగా ప్రకటించారు. దీనిపై సదరు ఎమ్మెల్యేలు కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం తీర్పు చెప్పనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.