కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు... అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీని... గుజరాత్‌లో జరిగిన నకిలీ ఎన్‌కౌంటర్ కేసులో CBI విచారిస్తున్న సమయంలో.... మోదీని ఆ కేసులో బలవంతంగా ఇరికించాలని (frame)... CBI తనపై ఒత్తిడి తెచ్చిందని ప్రస్తుత కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం అన్నారు.
నిన్న న్యూఢిల్లీలో జరిగిన 'న్యూస్ 18 రైజింగ్ ఇండియా' కార్యక్రమంలో... కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం... కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ తమపై ప్రయోగిస్తోందన్న... ప్రతిపక్షాల ఆరోపణపై మీరేం చెబుతారు అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా అమిత్ షా ఈ విధంగా చెప్పారు.
"కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బూటకపు ఎన్‌కౌంటర్ కేసులో మోదీ జీని (గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు) ఇరికించాలని సీబీఐ నాపై ఒత్తిడి తీసుకువచ్చింది. ఇంత జరిగినా బీజేపీ ఏనాడూ దీనిపై ఆందోళన చెయ్యలేదు" అని అమిత్ షా అన్నారు. క్రిమినల్ పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీని సూరత్‌లోని కోర్టు దోషిగా నిర్ధారించడంపై స్పందించిన అమిత్ షా... "ఆ కాంగ్రెస్ నాయకుడు... కోర్టు దోషిగా నిర్ధారించిన నేత మాత్రమే కాదు.. లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయిన రాజకీయ నాయకుడు కూడా" అని అన్నారు.
పైకోర్టుకు వెళ్లే బదులు రాహుల్.. హల్ చల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారనీ, తన తలరాతకి బదులుగా... ప్రధాని నరేంద్ర మోదీపై నిందలు వేస్తున్నారని షా అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీపై నిందలు వేసే బదులు రాహుల్ గాంధీ తన కేసుపై పోరాడేందుకు ఉన్నత న్యాయస్థానానికి వెళ్లాలని షా అన్నారు. కాంగ్రెస్ అపోహను ప్రచారం చేస్తోందన్నారు. కోర్టు నిర్ణయిస్తే శిక్షపై స్టే విధించగలదని అమిత్ షా తెలిపారు.
"తన నేరారోపణపై స్టే తీసుకోవడానికి ఆయన అప్పీల్ చేయలేదు. ఇది ఎంత అహంకారం? మీకు ఫేవర్ కావాలి. మీరు ఎంపీగా కొనసాగాలనుకుంటున్నారు. కోర్టుకు కూడా వెళ్లరు" అని షా అన్నారు. ఇలాంటి దురహంకారం ఎందుకు అని షా ప్రశ్నించారు.
యుపిఎ ప్రభుత్వ హయాంలో 2013లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల కారణంగా లాలూ ప్రసాద్, జె జయలలిత, రషీద్ అల్వీ సహా 17 మంది ప్రముఖ నాయకులు తమ సభ్యత్వాన్ని కోల్పోయారనీ,... ఒక ఎన్నికైన ప్రతినిధి దోషిగా తేలిన వెంటనే తమ సభ్యత్వాన్ని కోల్పోతారని షా చెప్పారు. అయినప్పటికీ, ఎవరూ నల్ల బట్టలు ధరించి నిరసన వ్యక్తం చేయలేదని, ఎందుకంటే అది "చట్టం" అని అమిత్ షా అన్నారు.
"రాహుల్ గాంధీ వివాదాస్పదంగా చేసిన పూర్తి ప్రసంగాన్ని వినండి, అతను మోదీ జీని దూషించే పదాలు మాత్రమే మాట్లాడలేదు. అతను మొత్తం మోడీ వర్గాన్ని, OBC సమాజాన్ని దూషించే మాటలు మాట్లాడాడు" అని అమిష్ షా గుర్తుచేశారు. "దేశంలోని చట్టం స్పష్టంగా ఉంది. ప్రతీకార రాజకీయాల ప్రశ్నే లేదు. ఇది వారి ప్రభుత్వ హయాంలో వచ్చిన సుప్రీంకోర్టు తీర్పు" అని షా అన్నారు.
రాహుల్‌ని బంగ్లా ఖాళీ చేయాలన్న నోటీసు గురించి అడిగిన ప్రశ్నకు,... "శిక్ష అమలులోకి వచ్చిన వెంటనే చర్య తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పినప్పుడు "ప్రత్యేక అనుకూలత" ఎందుకు ఉండాలి" అని షా ప్రశ్నించారు.
"ఇది రాహుల్ గాంధీ ఉద్దేశపూర్వక ప్రకటన, రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పకూడదనుకుంటే, అతను బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోకూడదు. క్షమాపణ చెప్పకుండానే ఉండనివ్వండి" అని షా అన్నారు.
"ఈ పెద్దమనిషి మొదటివాడు కాదు. చాలా పెద్ద పదవులు అనుభవించిన రాజకీయ నాయకులు ఈ నిబంధన కారణంగా తమ సభ్యత్వాన్ని కోల్పోయారు" అని హోం మంత్రి అన్నారు. లాలూజీని అనర్హులుగా ప్రకటించినప్పుడు భారత ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లలేదని, గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తి అనర్హత వేటు పడినప్పుడే అది ప్రమాదంలో పడుతుందా" అని అమిత్ షా అన్నారు.
“ఇప్పుడు ఆయన మీదకి వచ్చింది కాబట్టి గాంధీ కుటుంబానికి ప్రత్యేక చట్టం చేయండి అంటున్నారు.. ఒక్క కుటుంబం కోసం ప్రత్యేక చట్టం ఉండాలా అని ఈ దేశ ప్రజలను అడగాలనుకుంటున్నాను.. ఇది ఎలాంటి మనస్తత్వం? వారు మోదీనీ, లోక్‌సభ స్పీకర్‌నూ నిందించటం ప్రారంభించారు” అని షా అన్నారు. "రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీలుగా ఉన్న సీనియర్ న్యాయవాదులు.... అనర్హత వేటులో లోక్‌సభ స్పీకర్ పాత్ర లేదని తమ సహచరులకు చెప్పాలని షా కోరారు.
సుప్రీంకోర్టు ఆదేశాల్లో మార్పులు చేయడం బీజేపీకి ఇష్టం లేదని షా అన్నారు. "అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను మట్టుబెట్టేందుకు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది, అయితే రాహుల్ గాంధీ దానిని "అర్ధంలేనిది" (nonsense) అని పిలిచి.. చించివేశారు" అని షా గుర్తుచేశారు.
"రాహుల్ దానిని చించివేయడంతో యూపీఏ ప్రభుత్వంలో ఎవరూ దానిని చట్టంగా మార్చడానికి సాహసించలేదు. అది వీటో అయ్యింది. ఆ ఆర్డినెన్స్ చట్టంగా మారినట్లయితే ఇప్పుడు రాహుల్‌కి వెంటనే అనర్హత వేటు పడేది కాదు" అని షా అన్నారు.
సావర్కర్‌పై రాహుల్ చేసిన వ్యాఖ్య గురించి ప్రశ్నించగా... "అండమాన్ జైలులో రెండు జీవితకాల శిక్షలు అనుభవించిన ఏకైక స్వాతంత్ర్య సమరయోధుడు వీర్ సావర్కర్" అని హోంమంత్రి చెప్పారు. అలాంటి స్వాతంత్య్ర సమరయోధుడికి ఇలాంటి భాష ప్రయోగించి ఉండాల్సింది కాదని ఆయన అన్నారు.
"వీర్ సావర్కర్‌పై తన అమ్మమ్మ ప్రసంగాన్ని అతను (రాహుల్) చదవాలి. సావర్కర్‌కు వ్యతిరేకంగా మాట్లాడవద్దని సొంత పార్టీ వారే అతనికి సలహా ఇస్తున్నారు" అని షా అన్నారు.
2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మోదీ మళ్లీ భారీ మెజారిటీతో ప్రధాని అవుతారని షా అన్నారు. 2019 ఎన్నికల కంటే 2024 ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని, విపక్షాల మధ్య ఐక్యత లేదని అన్నారు. త్వరలో జరగనున్న కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ సగం మార్కును దాటుతుందనీ, రాష్ట్రంలో స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని షా అన్నారు.
కర్నాటకలో ఎలాంటి పొత్తూ ఉండదని షా తెలిపారు. "బీజేపీ కచ్చితంగా సగం మార్కును దాటుతుంది. కర్ణాటకలో సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. మేము రికార్డు స్థాయిలో విజయం సాధిస్తాము" అన్నారు. మత ప్రాతిపదికన కోటాను రద్దు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తావిస్తూ, మతం ఆధారంగా రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని అన్నారు.
ప్రతిపక్ష నేతలపై దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణలను హోంమంత్రి తోసిపుచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మేము ఎప్పుడూ ప్రతిపక్షాలను నిందించలేదు, అమాయక పోలీసు అధికారులను కటకటాల వెనక్కి నెట్టారని షా అన్నారు.
2014, 2019 ఎన్నికల్లో అవినీతికి వ్యతిరేకంగా బీజేపీ విజయం సాధించిందని షా అన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ 1.10 లక్షల కోట్ల ఆస్తులను జప్తు చేసిందని, ఇందులో రాజకీయ నేతలది 5 శాతం కూడా లేదన్నారు. అవినీతిపై పోరాటాన్ని ఆపేద్దామా.. నిందితుడు రాజకీయనాయకుడైతే చర్యలు తీసుకోకూడదా అని షా ప్రశ్నించారు.
లాలూ ప్రసాద్ యాదవ్‌పై ఎవరు కేసులు పెట్టారు? షేక్ అబ్దుల్లాను అరెస్టు చేసేందుకు ఢిల్లీ నుంచి అధికారులతో కూడిన విమానాన్ని ఎవరు పంపించారు" అని హోంమంత్రి ప్రశ్నించారు. ఏజెన్సీల దుర్వినియోగాన్ని చెబుతూ, 19 నెలల ఎమర్జెన్సీ కోసం వేల మంది అమాయకులను జైలులో పెట్టారు, అది ఎవరు చేసిన పని అని షా ప్రశ్నించారు. అది రాహుల్ అమ్మమ్మ ఇందిరా గాంధీ చేసిన పని అని ఆయన అన్నారు.
మహారాష్ట్ర ప్రశ్నపై, ప్రజలు శివసేన , బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారనీ, ఇప్పుడు నిజమైన శివసేన బీజేపీతో ఉందని షా అన్నారు. 'మహారాష్ట్రలో బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదని నేను కూడా అంగీకరిస్తున్నాను. శివసేన విలీనం ప్రశ్నే లేదు' అని ఆయన అన్నారు.
అవినీతికి పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ ప్రభుత్వాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధిస్తామని షా చెప్పారు.
రాజస్థాన్ ఎన్నికలపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని షా అన్నారు. రాజస్థాన్ సీఎంను మార్చాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా ప్రతి మూడు నెలలకోసారి తాను పంజాబ్ ముఖ్యమంత్రిని కలుస్తాన్న షా..., దేశ భద్రత విషయంలో ఆ ప్రభుత్వానికి అండగా ఉంటామని చెప్పారు.
భారతదేశ స్వాతంత్య్రానికి సిక్కుల సహకారం అపారమైనది అని షా అన్నారు. ప్రతి సిక్కూ... భారత్‌తో ఉండాలని కోరుకుంటారు. న్యాయవ్యవస్థ. ప్రభుత్వానికీ మధ్య ఎలాంటి ఘర్షణలూ లేవు అని హోంమంత్రి అన్నారు. రెండు వ్యవస్థలూ తమ పరిమితుల్లో పనిచేస్తున్నాయని ఆయన అన్నారు. చట్టాలు చేయడమే ప్రభుత్వ కర్తవ్యమనీ, దాని గురించే పార్లమెంటు ఆలోచిస్తుందని అమిత్ షా చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amit Shah, PM Narendra Modi, Rahul Gandhi