పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారనే నివేదికల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్లు, అరటిపండ్లను చేరుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ, ప్రభుత్వ సహాకారంతో నడుస్తున్న పాఠశాలల్లో చదువుకుంటున్న ఒకటి నుంచి 8వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కింద కోడిగుడ్లు, అరటిపండ్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ ఉత్తర్వులను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని భాల్కి హీరేమఠం పీఠాధిపతి బసవలింగ పట్టాడ దేవరుతోపాటు ఇతర మఠాల అధిపతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కోడిగుడ్లు, అరటిపండ్లకు బదులుగా అందరికీ సమానమైన సమతుల్య పౌష్టికాహారాన్ని అందించవచ్చని వారు సూచించారు.
కళ్యాణ కర్ణాటక ప్రాంతంలోని లింగాయత్ మఠాల పీఠాధిపతుల తరఫున మిగతా పీఠాధిపతులు సోమవారం ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మైకి విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు. శ్రీ సిద్దేశ్వర స్వామిజీ ఆధ్యాత్మిక ప్రసంగం కోసం భాల్కి కి వచ్చిన సందర్భంగా వీరు ముఖ్యమంత్రికి మెమోరాండం అందజేశారు. సీఎం సమక్షంలో ఈ వివరణ పత్రికను బసవలింగ పట్టాడ దేవరు చదివారు. బసవాది శరణాలు మాంసాహారాన్ని వ్యతిరేకించారని ఆయన గుర్తు చేశారు. కళ్యాణ కర్ణాటకలోని లింగాయత్‌ల్లో కూడా ఎక్కువమంది ప్రజలు శాకాహారులేనని ఆయన తెలిపారు. పిల్లలందరికీ అరటిపండుతో పాటు గుడ్లు కూడా ఇవ్వకుండా, అరటిపండు వంటి సాధారణ శాకాహార పౌష్టికాహారాన్ని అందజేయడం మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.
గత ప్రభుత్వం కూడా కోడిగుడ్లు, అరటిపండ్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టిందని.. కానీ దానిని పీఠాధిపతులు వ్యతిరేకించడంతో ఆ రెండింటినీ మెనూ నుంచి తొలగించారని మెమోరాండం పేర్కొంది. కోడిగుడ్లు, అరటిపండ్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని కూడా మహారాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని, అయితే వ్యతిరేకత రావడంతో దానిని విరమించిందని ఆయన అన్నారు. ఈ ఉత్తర్వును ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ వందలాది మంది పీఠాధిపతులు మెమోరాండంపై సంతకం చేశారని చెప్పారు. అయితే మెమోరాండం అందుకున్న సీఎం ఇప్పటివరకు దీనిపై స్పందించలేదు. ఒకవేళ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే భారీ ఎత్తున నిరసనలు చేపడతామని వ్యతిరేకులు హెచ్చరిస్తున్నారు. లింగాయత్, జైన్ కమ్యూనిటీ ప్రజలు దీనిని బాగా వ్యతిరేకిస్తున్నారు.
"ప్రోటీన్లు పిల్లలకు అందించడం మంచిదే కానీ ఈ ప్రోటీన్ కేవలం గుడ్లలో మాత్రమే కాదు కూరగాయల్లో కూడా లభిస్తుంది. గుడ్లు మధ్యాహ్న భోజనం మెనూలో యాడ్ చేయడం వల్ల మన మతపరమైన ఆచారాలకు సంబంధించినంతవరకు సమస్యలు తలెత్తుతాయి. పిల్లలు దారితప్పిపోతారు. అంతగా కావాలనుకుంటే మాంసాహారం తినే పిల్లల ఇంటికి గుడ్లు పంపించండి. కానీ పాఠశాలల్లో మాత్రం గుడ్లను అందించకండి" అని అక్కడి పీఠాధిపతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో భాగంగా డిసెంబర్ 1 నుంచి వారానికి మూడుసార్లు గుడ్లు, అరటిపండ్లు అందజేస్తోంది కర్ణాటక ప్రభుత్వం. అయితే పిల్లలు తమకు ఇష్టమైతేనే గుడ్లు తినొచ్చని.. ఇందులో ఎలాంటి బలవంత ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా ఈ ఆహార పదార్థాలకు అయ్యే పూర్తి ఖర్చు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. దక్షిణ భారతదేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో మధ్యాహ్న భోజన పథకంలో గుడ్లను చేర్చాయి కానీ కర్ణాటక మొన్నీమధ్యే గుడ్లను అందించడం ప్రారంభించింది. మరి మత, రాజకీయ సంస్థల ఒత్తిడికి తలొగ్గి కర్ణాటక ప్రభుత్వం ఈ విషయంలో వెనకడుగు చేస్తుందో లేదో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.