Home /News /national /

DRDO DEVELOPING ANTI DRONE TECHNOLOGY TECHNOLOGY TO COUNTER DRONE ATTACK THREAT SAYS HOME MINISTER AMIT SHAH SK

Amit Shah: ఆ డ్రోన్ల పని పట్టేందుకు కొత్త స్వదేశీ టెక్నాలజీ.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు

హోంమంత్రి అమిత్ షా

హోంమంత్రి అమిత్ షా

త్వరలోనే స్వదేశీ యాంటీ డ్రోన్‌ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తామని హోంమంత్రి అమిత్ షా చెప్పారు. ఇందుకోసం భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ ( DRDO)తో పాటు కొన్ని ఏజెన్సీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయని ఆయన అన్నారు.

  ఇటీవల జమ్మూలోని వైమానిక స్థావరంపై జరిగిన వైమానిక దాడితో భద్రతా దళాలు ఉలిక్కిపడ్డాయి. దేశ చరిత్రలోనే తొలిసారి అలాంటి దాడి జరగడంతో వీటిపై కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్‌గా దృష్టి సారించింది. ఉగ్రవాదులు, సంఘ విద్రోహక శక్తులు ఉపయోగించే డ్రోన్లకు చెక్ పెట్టేందకు స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకురాబోతున్నారు. దీనిపై హోంమంత్రి అమిత్ షా తొలిసారి స్పందించారు.  త్వరలోనే స్వదేశీ యాంటీ డ్రోన్‌ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన చెప్పారు. ఇందుకోసం   భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ ( DRDO)తో పాటు కొన్ని ఏజెన్సీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయని అమిత్ షా అన్నారు. దేశ భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.  దేశ సరిహద్దులను మరింత పటిష్ఠం చేసేందుకు ఖాళీగా ఉన్న చోట 2022 నాటికి కంచెలు నిర్మిస్తామని చెప్పారు.

  ''దేశ భద్రత విషయంలో డ్రోన్లు ఆందోళనకర అంశంగా మారాయి. డ్రగ్స్‌, మారణాయుధాలు, ప్రేలుడు పదార్థాలను సొరంగాలుతో పాటు డ్రోన్ల ద్వారా అక్రమంగా రవాణా చేయడం వంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. వీటిని గుర్తించడం పెద్ద సవాల్‌గా మారింది. వీలైనంత త్వరగా ఈ సమస్యను అధిగమించాలి.  ఇప్పటికే డీఆర్డీవో, ఇతర ఏజెన్సీలు అందుకోసం కృషి చేస్తున్నాయి.త్వరలోనే స్వదేశీ యాంటీ డ్రోన్‌ టెక్నాలజీని దేశ సరిహద్దుల్లో ఏర్పాటు చేస్తామన్న విశ్వాసం  ఉంది.'' అని ఢిల్లీలో బీఎస్‌ఎఫ్‌ సిబ్బందితో నిర్వహించిన ఓ కార్యక్రమంలో అమిత్‌ షా పేర్కొన్నారు.

  జమ్మూలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌పై డ్రోన్ దాడి జరిగిన విషయం తెలిసిందే. జూన్ 26న అర్ధరాత్రి 01.40 గంటల సమయంలో ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో బాంబులు పేలాయి. గుర్తు తెలియని డ్రోన్లు తక్కువ ఎత్తులో ఎగరుకుంటూ వచ్చి బాంబులను జారవిడిచాయి. ఓ బాంబును టెక్నికల్ ఏరియాలోని భవనంపై పడగా దాని పైకప్పుకు రంధ్రంపడింది. మరో బాంబు ఓపెన్ ఏరియాలో గ్రౌండ్‌పై నేలపై పడింది. 6 నిమిషాల వ్యవధిలోనే రెండు బాంబులు పడ్డాయి. ఈ ఘటనలో ఇద్దరు సిబ్బందికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఆ బాంబుల్లో ఆర్డీఎక్స్,నైట్రేట్ మిశ్రమాన్ని వాడినట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. ఘటనా స్థలానికి పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు 14 కి.మీ. దూరమే ఉండడంతో.. అక్కడి నుంచే డ్రోన్‌లు వచ్చినట్లు అనుమానిస్తున్నారు. ఈ డ్రోన్‌లను ఎవరు పంపించారన్న దానిపై ఎన్ఐఏ దర్యాప్తు జరుగుతోంది.

  జులై 15న కూడా పలు డ్రోన్లు చక్కర్లు కొట్టాయి. గురువారం రాత్రి 08.15 గంటల సమయంలో సాంబా సెక్టార్‌లో ఓ డ్రోన్ తిరిగింది.  అప్రమత్తమైన భద్రతా బలగాలు ఆ డ్రోన్‌పై  పలు రౌండ్ల కాల్పులు జరిపారు. 08.05 సమయంలో కథువా  జిల్లాలోని పన్సార్‌లో ఇంకో డ్రోన్ కనిపించింది. అంతేకాదు జమ్మూలోని అంపాలా, మిరాన్ సాహిబ్, సత్వారి ప్రాంతాల్లోనూ డ్రోన్లు చక్కర్లు కొట్టాయి.

  తక్కువ ఎత్తులో వచ్చే  డ్రోన్లు దేశభద్రతకు ముప్పుగా మారాయి. వీటిని గుర్తించే రాడార్ వ్యవస్థ మన వద్ద లేదు. అందుకే అంతర్జాతీయ సరిహద్దును దాటి వచ్చే డ్రోన్లను మన భద్రతా దళాలు గుర్తించలేకపోతున్నారు. జమ్మూ  ఘటన తర్వాత హోంశాఖ, రక్షణశాఖ ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించారు. అనంతరం యాంటీ డ్రోన్ టెక్నాలజీని తీసుకురావాలని నిర్ణయించారు. 3,500 కి.మీ. అంతర్జాతీయ సరిహద్దుతో పాటు ఎయిర్‌పోర్టుల వద్ద ఈ టెక్నాలజీని వినియోగించనున్నారు.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Amit Shah, BSF, Drone attack, Drones

  తదుపరి వార్తలు