news18-telugu
Updated: November 30, 2020, 11:10 PM IST
తాతా బాబా అమ్టేతో డాక్టర్ షీతల్ అమ్టే కారజ్గి(Image-Facebook/Dr. Sheetal Amte-Karajgi)
ప్రముఖ సామాజిక కార్యకర్త బాబా అమ్టే(Baba Amte) మనవరాలు డాక్టర్ షీతల్ అమ్టే కారజ్గి సోమవారం అనుహ్యంగా మరణించారు. ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. వృత్తి రీత్యా డాక్టర్ అయిన షీతల్.. తన తాత స్థాపించిన సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ మహారోగి సేవా సమితి(MSS) సీఈవోగా ఉన్నారు. కుటుంబసభ్యులతో కలహాల కారణంగా ఆమె తన ప్రాణాలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక, సోమవారం మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా ఆనంద్వాన్లోని తన నివాసంలో చనిపోయి కనిపించారు. ఆమె మరణానికి గల కారణాలను పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు. అయితే పాయిజన్ ఇంజెక్ట్ చేసుకోవడం ద్వారా ఆమె మరణించినట్టుగా సమాచారం. షీతల్ మృతదేహాన్ని స్వాదీనం చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టమ్ నిమిత్తం వరోరా నుంచి 50 కి.మీ దూరంలో ఉన్న చంద్రపూర్‌కు తరలించారు. మరోవైపు నాగ్‌పూర్ నుంచి ప్రత్యేక ఫోరెన్సిక్ నిపుణల బృందం వరోరాకు చేరుకున్నారు. ఆనంద్వాన్లోని షీతల్ మరణించిన రూమ్‌ను పరిశీలించనున్నారు.
షీతల్ తన మరణానికి కొన్ని వారాల ముందు ట్రస్ట్‌లో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ మేరకు ఓ వీడియోను ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. మహారోగి సేవా సమితిలో నిధులు దుర్వినియోగం జరుగుతున్నాయని ఆరోపించిన ఆమె.. ట్రస్టీలుగా ఉన్న కుటుంబసభ్యులతో పాటు ఎంఎస్ఎస్ సంబంధం ఉన్న ఇతర కార్యకర్తలపై ఆరోపణలు చేశారు. అయితే రెండు గంటల్లోనే ఆ వీడియోను ఫేస్బుక్ నుంచి తొలగించారు. దీంతో ట్రస్టు నిర్వహణపై పలు అనుమానాలు తలెత్తాయి. మరోవైపు షీతల్ చేసిన ఆరోపణలను ఆమె కుటుంబ సభ్యులు ఖండించారు. షీతల్ ఆరోపణలపై స్పందిస్తూ ఆమె తల్లిదండ్రులు, ఇతర కుటుంబసభ్యులు ఒక ప్రకటన విడుదల చేశారు. మానసిక ఒత్తిడి, నిరాశ కారణంగా ఆమె షీతల్ ఈ రకమైన వ్యాఖ్యలు చేసినట్టు వారు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ట్రస్టు నిర్వహణకు బాబా అమ్టే వారసులు కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు.ఇక, తాను మరణించే కొద్ది గంటల క్రితం షీతల్ వార్ అండ్ పీస్ క్యాప్షన్‌తో ఓ పెయింటింగ్‌ను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
ప్రముఖ సామాజిక కార్యకర్త అయిన బాబా అమ్టే మోడ్రన్ గాంధీగా పేరు పొందాడు. రామన్ మెగసెసే, పద్మ విభూషణ్ అవార్డులను స్వీకరించాడు. కుష్టు వ్యాధితో బాధపడుతున్నవారికి ఆయన సాయం అందించడానికి ఆయన తీవ్రంగా శ్రమించాడు. 2008లో బాబా అమ్టే కన్నుమూశారు.
Published by:
Sumanth Kanukula
First published:
November 30, 2020, 11:10 PM IST