మమతా బెనర్జీకి దెబ్బ మీద దెబ్బ... టీఎంసీని వీడిన మరో ఎమ్మెల్యే

సువేందు అధికారి (ఫైల్)

టీఎంసీ, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనుసరిస్తున్న విధానాలు నచ్చక అక్కడ చాలా మంది పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇటీవల కాలంలో టీఎంసీ నుంచి పలువురు పెద్ద నాయకులు సైతం ఆ పార్టీని వీడటం క్యాడర్ లో గుబులు పెంచుతున్నది.

 • News18
 • Last Updated :
 • Share this:
  బెంగాల్ లో రాజకీయం రసవత్తరంగా సాగుతున్నది. అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీకి అక్కడ వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మరోవైపు వచ్చే ఏడాది అక్కడ జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి.. బెంగాల్ లో పాగా వేయాలని చూస్తున్న బీజేపీ.. అందుకు తగ్గట్టుగా కచ్చితమైన ప్రణాళికలను రూపొందించుకుంటున్నది. అయితే టీఎంసీ, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనుసరిస్తున్న విధానాలు నచ్చక అక్కడ చాలా మంది పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇటీవల కాలంలో టీఎంసీ నుంచి పలువురు పెద్ద నాయకులు సైతం ఆ పార్టీని వీడటం క్యాడర్ లో గుబులు పెంచుతున్నది. ఇటీవలే ఆ పార్టీకి చెందిన నందిగ్రామ్ ఎమ్మెల్యే సువేందు అధికారి రాజీనామా చేయగా.. తాజాగా మరో ఎమ్మెల్యే జితేంద్ర తివారి కూడా అదే బాటలో పయనించారు.

  నందిగ్రామ్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న సువేందు అధికారి.. టీఎంసీలో అగ్ర నాయకులలో ఒకరు. బుధవారం ఆయన పార్టీని వీడుతున్నట్టు తెలపగా.. గురువారం అందుకు సంబంధించి.. టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీకి లేఖ రాశారు. 2011 నుంచి ఆయన నందిగ్రామ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అంతకుముందు నందిగ్రామ్ లో టాటా నానో కార్ల ఫ్యాక్టరీకి సంబంధించిన ఆందోళనల్లో ఆయన చురుకుగా పాల్గొన్నారు. సువేందు.. మమతకు నమ్మిన బంటు. అలాంటి వ్యక్తి పార్టీని వీడటం మమత బెనర్జీకి, టీఎంసీకి ఎదురుదెబ్బే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

  కాగా.. సువేందు అధికారి బాటలోనే టీఎంసీ ఎమ్మెల్యే అసన్సోల్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మెన్ గా ఉన్న జితేంద్ర తివారి కూడా పార్టీని వీడారు. టీఎంసీలో ముందు నుంచి ఉన్న నాయకులను పక్కన బెడుతూ.. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని చేర్చుకుంటు.. వారికే అగ్ర తాంబూలం అందిస్తున్నారని ఆరోపిస్తూ జితేంద్ర తివారి ఆరోపణ. అంతేగాక.. తన మున్సిపాలిటీకి రావలసిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం లేదని ఆయన ఆరోపణలు చేశారు. తన మున్సిపాలిటీకి స్మార్ట్ సిటీ కింద నిధులు వచ్చినా.. అవి దారి మళ్లించారని అన్నారు. తివారి.. పశ్చిమ బర్ధమన్ జిల్లా టీఎంసీ అధ్యక్షుడిగా పనిచేశారు. తాజాగా ఆయన పార్టీని వీడటం జిల్లాలోనే గాక రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

  ఇదిలాఉండగా..సువేందు అధికారి రాజీనామాపై బీజేపీ జనరల్ సెక్రెటరీ విజయవర్గియ మాట్లాడుతూ.. ‘ఆయన డైనమిక్ లీడర్. ఆయన బీజేపీలో చేరదామనుకుంటే కచ్చితంగా ఆహ్వానిస్తాం. కానీ అది అతడి ఇష్టం మీదే ఆధారపడింది.. ’ అని అన్నారు. టీఎంసీకి రాజీనామా చేసిన సువేందు... ఈనెల 19, 20 న బెంగాల్ పర్యటనకు వెళ్లనున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీ లో చేరనున్నట్టు సమాచారం. మరోవైపు ఇదే అంశంమీద టీఎంసీ స్పందిస్తూ.. పార్టీలో ఒకరిద్దరు వెళ్లినంత మాత్రానా పోయేదేమీ లేదని.. తమకు ప్రజల అండ ఉన్నదని వ్యాఖ్యానిస్తున్నారు.
  Published by:Srinivas Munigala
  First published: