మన దేశంలో దాదాపు అన్ని ప్రముఖ ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు కార్ లోన్లను (Car Loan) అందిస్తున్నాయి. దరఖాస్తుదారులు చాలా సులభంగా, తక్కువ వడ్డీ రేట్లకే కార్ లోన్ (Car Loan Rate of Interest) పొందవచ్చు. అయితే అందుబాటులో ఉన్న వివిధ రకాల లోన్ ఆప్షన్లతో కస్టమర్లు, కార్ ఫైనాన్సింగ్ రుణగ్రహీతలు గందరగోళానికి గురవుతారు. ఈ క్రమంలో కార్ లోన్ విషయంలో చేయాల్సిన, చేయకూడని (Do's and Dont's in Car Loan) పనులపై దృష్టి పెట్టడం ద్వారా రుణ గ్రహీతలు సరైన కార్ లోన్ పొందవచ్చు.
కార్ లోన్ పొందేందుకు చేయాల్సిన పనులు
లోన్ ప్రొడక్ట్స్‌ను పోల్చాలి
వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు విభిన్న నియమ నిబంధనలు, వడ్డీరేట్లతో కార్ లోన్లు అందిస్తున్నాయి. అందుబాటులో ఉన్న వివిధ కార్ లోన్ ఆప్షన్లను పోల్చడం ద్వారా వీటి నుంచి బెస్ట్ లోన్ ప్రొడక్ట్‌ను ఎంచుకోవచ్చు. అనేక ఆర్థిక సేవల వెబ్‌సైట్లు ఈ లోన్ల వడ్డీరేట్లను పోలుస్తూ అప్‌డేటెడ్ డేటాను అందుబాటులో ఉంచుతున్నాయి. వీటి ద్వారా రుణాల విషయంలో ఒక నిర్ణయానికి రావచ్చు.
వడ్డీరేట్లు (Car Loan Interest rates)
కస్టమర్లు తమకు అవసరమైన లోన్ మొత్తంతో పాటు దానిపై తక్కువ వడ్డీ రేటును అందించే లోన్‌ను ఎంచుకోవడం ద్వారా లబ్ధి పొందవచ్చు. వడ్డీరేట్ల గురించి తెలుసుకోవడానికి ఆయా బ్యాంకుల అధికారిక వెబ్‌సైట్లను సందర్శించడం మంచిది.
కారు మోడల్ (Latest Cars Models)
కార్ లోన్ కోసం దరఖాస్తు చేయడానికి ముందే మీరు ఎలాంటి కారును కొనుగోలు చేయాలనుకుంటున్నారో నిర్ణయించుకోవాలి. కారు మోడల్, దాని ధర మీ బడ్జెట్‌కు తగినట్లే ఉందా లేదా అనేది నిర్ధారించుకోవాలి. దీని ఆధారంగానే లోన్ కోసం దరఖాస్తు చేయాలి.
ఛార్జీలు, రుసుములు (Car Loan charges)
కార్ లోన్లపై ప్రాసెసింగ్ ఫీజులు వర్తిస్తాయి. అయితే కొన్నిసార్లు బయటకు చెప్పని ఫీజులు (Hidden Fees) కూడా ఉండవచ్చు. ఇలాంటి హిడెన్ ఫీజులు, రుసుముల గురించి సైతం రుణ గ్రహీతలు ముందుగానే ఆరా తీయాలి.
స్పెషల్ ఆఫర్‌లు (Latest offers on Car Loans)
కొన్ని బ్యాంకులు ప్రత్యేక సందర్భాల్లో కార్ లోన్లపై స్పెషల్ ఆఫర్లను ప్రకటిస్తాయి. అందువల్ల లోన్ కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు ఏవైనా స్పెషల్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయేమో చూడాలి. వీటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు.
ఇన్సూరెన్స్ (Car Insurance)
ఇది పునరావృత ఖర్చు (recurring cost) అయినందువల్ల.. కారు బీమా ప్రీమియంను ముందుగానే తనిఖీ చేయడం మంచిది.
క్రెడిట్ రిపోర్ట్
కార్ లోన్ కోసం దరఖాస్తు చేయడానికి ముందే క్రెడిట్ రిపోర్ట్ పొందాలి. సాధారణంగా రుణాలపై వడ్డీ రేట్లను ఆదాయ వనరు, లింగం, క్రెడిట్ స్కోర్ వంటి అంశాల ఆధారంగా నిర్ణయిస్తారు. అధిక ఆదాయం ఉన్నప్పటికీ తక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే.. లోన్ రేటు ఎక్కువగా ఉండవచ్చు. కస్టమర్ల క్రెడిట్ యోగ్యతను (credit worthiness) తనిఖీ చేయడానికి కార్ లోన్ దరఖాస్తుదారుల క్రెడిట్ రిపోర్టులను రుణదాతలు తీసుకుంటారు. క్రెడిట్ స్కోర్ 750, అంతకంటే ఎక్కువ ఉన్నవారి లోన్ ఆమోదం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల కారు లోన్‌లను పొందాలనుకునే వారు ఇందుకు దరఖాస్తు సమర్పించడానికి కనీసం ఆరు నెలల ముందు నుంచి క్రమం తప్పకుండా క్రెడిట్ బ్యూరోల నుంచి క్రెడిట్ రిపోర్టులను పొందాలి. దీని ఆధారంగా క్రెడిట్ స్కోర్ పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
డాక్యుమెంట్లు (Documents for Car Loan)
లోన్ దరఖాస్తు ప్రక్రియకు ఆదాయం, చిరునామా, వయసు, ఉద్యోగం వంటి వాటికి సంబంధించిన రుజువులు అవసరం. అందువల్ల రుణదాతలకు ఏయే డాక్యుమెంట్లు అవసరమో ముందుగానే తెలుసుకోవాలి. లోన్ దరఖాస్తుకు ముందే వాటిని సిద్ధం చేసుకోవాలి. జీతం పొందే వ్యక్తులు శాలరీ స్లిప్‌లు, ఆదాయపు పన్ను రిటర్న్స్ స్టేట్‌మెంట్‌లు.. వంటివి సేకరించి పెట్టుకోవాలి.
ప్రీపేమెంట్ లేదా ఫోర్‌క్లోజర్ ఛార్జీలు (Pre Payment and Foreclouser charges)
ఫిక్స్‌డ్ ఇంట్రస్ట్ వడ్డీ రేటుతో కార్ లోన్ తీసుకున్నవారు.. నిర్ణీత గడువుకు ముందే మొత్తం లోన్‌ను పూర్తిగా చెల్లించే అవకాశం ఉంటుంది. అయితే ఇందుకు బ్యాంకు ప్రత్యేకంగా ఛార్జీలు వసూలు చేయవచ్చు. వీటిని ప్రీపేమెంట్ లేదా ఫోర్‌క్లోజర్ ఛార్జీలు అంటారు. బకాయి ఉన్న లోన్‌లో 5-6% వరకు ఛార్జీలను కస్టమర్లు ప్రీపేమెంట్ ఛార్జీలుగా చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కనీస కాలపరిమితి, ఇతర నియమ నిబంధనలు బ్యాంకులను బట్టి మారవచ్చు. దరఖాస్తుదారులు ముందస్తు చెల్లింపులపై తక్కువ ఛార్జీలు విధించే బ్యాంకులను ఎంచుకోవాలి.
కార్ లోన్ దరఖాస్తుదారులు చేయకూడని పనులు..
అర్హతకు మించి లోన్ ఉండకూడదు
మీ లోన్ అర్హతను (Loan Eligibility) మించిన రుణం కోసం దరఖాస్తు చేయవద్దు. దీనివల్ల లోన్ అప్లికేషన్‌ను బ్యాంకులు తిరస్కరించే అవకాశం ఉంది.
ఎక్కువ అప్లికేషన్లు వద్దు
వివిధ బ్యాంకుల్లో ఒకేసారి కార్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోకూడదు. ఇది కస్టమర్ల క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. లోన్ మొత్తం, వడ్డీ రేట్ల ఆధారంగా ఏదైనా బ్యాంకును ఎంచుకున్న తరువాత.. అదే బ్యాంకులో కార్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవడం మంచిది.
లోన్ తిరస్కరణకు గురైతే..
మీ కార్ లోన్ అప్లికేషన్‌ను ఏదైనా బ్యాంకు తిరస్కరిస్తే.. వెంటనే వివిధ బ్యాంకుల్లో లోన్ కోసం దరఖాస్తు చేస్తూ పోవద్దు. దీనివల్ల లోన్ తిరస్కరణకు గురయ్యే అవకాశాలు మరింత పెరుగుతాయి.
డీలర్‌షిప్‌పై ఆధారపడొద్దు
డీలర్ అందించే లోన్‌లపై తక్కువ వడ్డీ రేటు ఉండకపోవచ్చు. అందువల్ల ఇతర లోన్ ఆప్షన్లను తనిఖీ చేయడం మంచిది.
సర్వీస్ కాస్ట్ ఎక్కువగా ఉండకూడదు
ఎక్కువ సర్వీస్ కాస్ట్ విధించే కార్లను ఎంచుకోకపోవడమే మంచిది. ఎందుకంటే దరఖాస్తుదారులు ఇప్పటికే EMI, చెల్లించాల్సిన బీమా ప్రీమియంల రూపంలో ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుందని గమనించాలి.
EMI స్థోమతను ఎక్కువగా అంచనా వేయకూడదు
ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్స్ (EMI) చెల్లించే స్థోమతను రుణ గ్రహీతలు ఎక్కువగా అంచనా వేయకూడదు. ఆదాయ అంతరాయాలు, ఇతర ఆర్థిక అవసరాల కారణంగా పెద్ద మొత్తంలో EMI చెల్లించలేక డిఫాల్ట్‌గా మారే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి రీపేమెంట్ డిఫాల్ట్‌లకు భారీగా ఛార్జీలు, జరిమానాలు ఉంటాయి. దీంతోపాటు క్రెడిట్ స్కోర్‌పై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. అందువల్ల తాము ఎలాంటి ఇబ్బందులు లేకుండా చెల్లించగలిగే ఈఎంఐ మొత్తాన్ని మాత్రమే కస్టమర్లు ఎంచుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.