నానాటికి అడవులు కుచించుకుపోతుండటం, అభివృద్ధి పేరిట అరణ్యాలను నరికివేస్తండటంతో అక్కడ నివసించే జంతువులు ఆవాసాన్ని కోల్పోయి జనారణ్యంలోకి రావడం మొదలుపెట్టాయి. ఫలితంగా మనుషులపై దాడులు చేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో చూస్తున్నాం. తాజాగా, పశ్చిమ బెంగాల్(West Bengal) జల్పాయిగురి జిల్లాలోని టీ గార్డెన్(Tea Garden)లో కూడా ఇటువంటి ఘటనే జరిగింది. టీ గార్డెన్లో పనిచేస్తున్న కార్మికురాలిపై చిరుతపులి(leopard) దాడి చేసింది. అయితే, చాలా సేపు ఆమె చిరుతపులితో ఒంటరిగా పోరాడి తెలివిగా తప్పించుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. లీలా ఒరాన్(Leela Oraon) అనే మహిళ భట్ఖావా టీ గార్డెన్లో పనిచేస్తుండగా చిరుతపులి తనపైకి ఎగిరి దాడి చేసింది. దీంతో తన ప్రాణాలు రక్షించుకునేందుకు చిరుతపులితో 10 నిమిషాల పాటు ఒంటరిగా పోరాడింది. చివరికి చిరుతపులి చెర నుంచి తప్పించుకున్న ఆ మహిళ స్వల్ప గాయాలతో బయటపడింది. అక్కడే ఉన్న ఇతర కార్మికులు వెంటనే ఆమెను స్థానికంగా ఉన్న లీలబరి గ్రామీణ ఆసుపత్రి(Tea Garden Grameen Hospital) కి తీసుకెళ్లారు. దీనిపై ఆమెకు చికిత్స చేస్తున్న డాక్టర్ సందీపన్ సర్కార్(Dr Sandipan Sarkar) మాట్లాడుతూ "చిరుతపులి దాడిలో గాయపడిన మహిళ చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి మెరుగ్గానే ఉంది. చిరుత పులితో ఒంటరిగా పోరాడిన ఆమె ధైర్యానికి నమస్కరిస్తున్నాము." అని అన్నారు.
ఒంటరిగా పోరాడి పులి చెర నుంచి బయటపడ్డ మహిళ..
కాగా, పశ్చిమ బెంగాల్ ఉత్తర భాగంలోని జల్పాయిగురి (Jalpaiguri) జిల్లాలో ఇటువంటి సంఘటనలు సర్వ సాధారణంగా మారిపోయాయి. గతంలో చిరుతపులలు మనుషులపై దాడి చేస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురి చేసిన సంఘటనలెన్నో జరిగాయి. అడవులు నరికివేస్తుండటంతో వన్య ప్రాణులు జనారణ్యంలో సంచరిస్తున్నాయి. దీంతో, చిరుత పులల దాడిలో మనుషులు ప్రాణాలు కోల్పోవడం, గాయాలపాలవుతున్నారు. అంతేకాక, కొంత మంది వ్యక్తుల దాడిలో చిరుతపులులు సైతం గాయాలపాలవుతున్నాయి.
ఇటీవల NH 31C రహదారిపై ఒక కారు రెండు చిరుతపులులను, ఐదుగురు వ్యక్తులను ఢీ కొట్టింది. దీంతో గాయాలపాలైన రెండు చిరుత పులుల్లో ఒక దాన్ని స్థానికులు రక్షించగా, మరొకటి అడవుల్లోకి జారుకుంది. ఈ ఘటన జనవరి 1న బనర్హాట్(Banarhat) ప్రాంతంలోని గేంద్రపారా టీ ఎస్టేట్ (Gendrapara tea estate) సమీపంలో జరిగిందని వైల్డ్‌లైఫ్ చీఫ్ వార్డెన్ వి కె యాదవ్ తెలిపారు. మరో సంఘటనలో, ఉత్తర బెంగాల్‌లోని సిలిగురి (Siliguri) సమీపంలో గ్రామస్తులు తమ గ్రామంలోకి వచ్చిన చిరుతపులిని తీవ్రంగా కొట్టి గాయపర్చడంతో ఆ చిరుతపులి అక్కడికక్కడే చనిపోయింది. ఈ దుర్ఘటన గత డిసెంబర్ నెలలో సిలిగురి శివార్లలోని ఫాన్సిదేవా సమీపంలో జరిగింది.