ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం ఎంతో కీలకం. ఓటు వేయనివారికి ప్రశ్నించే హక్కు లేదని అంటుంటాం. ప్రశ్నించడం తమ హక్కు అనే వాళ్లు.. ఓటు వేయడం తమ బాధ్యత అని తెలుసుకోవాలని చెబుతుంటాం. కానీ కచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందే అనే చట్టం మాత్రం మన దగ్గర లేదు. ఓటు వేయాలని ప్రజలను కోరడం తప్పితే.. ఓటు వేయని వారి విషయంలో కఠినంగా వ్యవహరించే చట్టాలు మన దేశంలో లేవు. కానీ ప్రపంచంలోని కొన్ని దేశాల్లో మాత్రం ఓటు హక్కు వినియోగించుకోకపోతే.. ఆ తరువాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. బెల్జియంలో ఓటు వేయకపోతే కోర్టు మెట్లు ఎక్కాల్సిందే. అంతేకాదు నాలుగేళ్లు ఓటు వేయకపోతే.. ఆ తరువాత పదేళ్ల పాటు ఓటు హక్కు ఉండదు.
అంతేకాదు ఓటు వేయని వాళ్లు ప్రభుత్వం ఉద్యోగానికి అర్హత కోల్పోతారు. గ్రీస్ ఈజిప్ట్ దేశాల్లో ఓటు వేయకపోతే జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. కోర్టులో సరైన కారణం చెబితే వదిలేస్తారు. అయితే ఎలాంటి కారణం లేకుండా ఓటు వేయకపోతే మాత్రం జైలు శిక్ష తప్పదు. బ్రెజిల్లో ఓటు వేయకపోతే జరిమానా విధిస్తారు. ఇక అర్జెంటీనాలో ఓటు వేయనివారికి భిన్నమైన శిక్ష ఉంటుంది. ఓటు వేయనివారికి ఏడాది పాటు ప్రభుత్వ పథకాలు కట్ అయిపోతాయి. ఇక పెరూలో ఓటు వేయనివారికి సరికొత్త శిక్ష ఉంటుంది. వారి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారు. బొలీవియాలో ఓటు వేయని వారికి జీతాలు కూడా ఇవ్వరు. అస్ట్రేలియాలో ఓటు వేయకపోతే.. అందుకు తగ్గ కారణం చూపించాలి.
మన దేశంలో ఓటు వేసే విషయంలో అలాంటి కచ్చితమైన నిబంధనలు లేకపోవడం కూడా ఓటింగ్ శాతం తగ్గడానికి ఓ కారణమనే వాదన ఉంది. కొందరు అత్యవసర పనుల కారణంగా ఓటు వేయలేకపోతే.. మరికొందరు ఓటు వేసే అవకాశం ఉన్నప్పటికీ బద్ధకించి ఓటు వేయడం లేదు. ఇక పల్లె ప్రజలతో పోలిస్తే.. పట్టణవాసులు ఓటు వేసే విషయంలో మరీ నిర్లక్ష్యంగా ఉన్నారనే విషయం అనేక సందర్భరాల్లో స్పష్టమైంది. ప్రస్తుతం జరుగుతున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఓటింగ్ శాతం ఎంత మేరకు నమోదవుతుందనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.