సాధారణంగా ఏవైనా శస్త్రచికిత్సలు చేస్తున్నప్పుడు, రోగికి రక్తం అవసరం అయినప్పుడు ఒకే గ్రూప్‌కు చెందిన బ్లడ్‌నే వినియోగిస్తారు. అయితే భారత్‌లో తొలిసారిగా అరుదైన ఆపరేషన్ జరిగింది. మహారాష్ట్ర వైద్యులు ఈ ఘనతను సాధించారు. వేర్వేరు బ్లడ్ గ్రూపులు కలిగి ఉండి హెచ్‌ఐవీ(HIV) పాజిటివ్ ఉన్న ఇద్దరు దంపతుల మధ్య మూత్రపిండం(కిడ్నీ) మార్పిడి చేశారు. ఔరంగాబాద్‌కు చెందిన నెఫ్రాలజిస్టులు తొలిసారిగా ఈ శస్త్రచికిత్స చేసి రికార్డులకెక్కారు.
* తొలి ఆపరేషన్
ఔరంగాబాద్‌కు చెందిన 48ఏళ్ల వస్త్రాల వ్యాపారికి కిడ్నీ పూర్తిగా దెబ్బతింది. ఆయనకు హెచ్‌ఐవీ పాజిటివ్ ఉండటంతో కిడ్నీ మార్పిడి కోసం కొంత శ్రమించాల్సి వచ్చింది. చివరగా వ్యాపారి భార్య కిడ్నీ దానం చేయడానికి ముందుకొచ్చింది. అయితే, ఈమెకు కూడా హెచ్‌ఐవీ పాజిటివ్ ఉండటం, పైగా భిన్న బ్లడ్ గ్రూప్ కలిగి ఉండటంతో వైద్యులు సాహసం చేశారు. ఈ ఏడాది జనవరి 18న కిడ్నీని విజయవంతంగా మార్పిడి చేసి ఆపరేషన్‌లో సక్సెస్ అయ్యారు. వైద్య చరిత్రలోనే ఈ తరహా ఆపరేషన్ మొట్టమొదటిదిగా భావిస్తున్నట్లు శస్త్రచికిత్స చేసిన ఔరంగాబాద్‌కు చెందిన మెడికవర్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు.
* ఎలా జరిగిందంటే?
ఇదివరకు హెచ్‌ఐవీ పాజిటివ్ వ్యక్తుల మధ్య కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ జరిగిన దాఖలాలు ఉన్నాయి. అయితే, డోనర్, రిసీవర్ల బ్లడ్ గ్రూప్ ఒకటే కావడంతో ఏ సమస్యా ఉండేది కాదు. కానీ, తాజా కేసులో ఇద్దరి బ్లడ్ గ్రూప్‌లు వేర్వేరు కావడంతో వైద్యులు ముందస్తుగా కొన్ని చర్యలు తీసుకున్నారు. బాధితుడి(రిసీవర్) శరీరంలోని రోగనిరోధకాలు ప్రతిస్పందించకుండా ‘ఇమ్యూనోసప్రెసెంట్స్’ ఇచ్చారు. అనంతరం ఓ రకమైన బ్లడ్ ప్లాస్మా చికిత్స చేశారు.
ఫలితంగా ఇతర బ్లడ్ గ్రూప్‌కి చెందిన కిడ్నీని అనుమతించేలా రిసీవర్ శరీరం కండిషన్‌లోకి వచ్చింది. బహుశా వైద్య చరిత్రలోనే ఇది తొలి ఘటన అయి ఉంటుందని మెడికవర్ ఆస్పత్రి వైద్యుడు డా. సచిన్ సోని వెల్లడించారు. ఇదివరకు హెచ్‌ఐవీ నుంచి హెచ్‌ఐవీకి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేసిన ఘటనలున్నప్పటికీ.. విభిన్న బ్లడ్ గ్రూప్ కలిగిన వ్యక్తుల మధ్య కిడ్నీ మార్పిడి చేయడం సవాలుగా నిలిచిందని సచిన్ తెలిపారు. ఇందుకోసం రిసీవర్ శరీరాన్ని శస్త్రచికిత్సకు అనుగుణంగా మలిచినట్లు ఆయన పేర్కొన్నారు.
* ఆరోగ్యంగా తల్లిదండ్రులు
ప్రస్తుతం తమ తండ్రి ఆరోగ్యం కుదుట పడిందని వ్యాపారి కుమారుడు వెల్లడించారు. అదృష్టవశాత్తూ అమ్మానాన్నలు ఇద్దరూ క్రమంగా కోలుకుంటున్నట్లు చెప్పారు. ఆపరేషన్ ముందు తండ్రి రోజుకు ఒక పూటే తినేవాడని, ఇప్పుడు మూడు పూటలు భోజనం చేస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఆపరేషన్‌కు సుమారుగా రూ.6 లక్షలు కూడబెట్టినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి : కర్ణాటకలో కీటకాలకు బాలీవుడ్ సినిమా క్యారెక్టర్ల పేర్లు.. భళ్లాలదేవ పేరు కూడా ఉంది!
రూ.2 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రాగా, మిగతా రూ.4 లక్షలు బంధువులు, స్నేహితులు సమకూర్చారు. అయితే ఇలా కిడ్నీ దానం చేయడం వల్ల భవిష్యత్తులో డోనర్ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ముంబయిలో తొలి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేసిన డా.మదన్ బహదూర్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. 2020లో ముంబయిలో హెచ్ఐవీ టు హెచ్ఐవీ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ జరిగింది. 24 ఏళ్ల కుమార్తెకు తండ్రి కిడ్నీ దానం చేశాడు. ప్రస్తుతం తండ్రీకూతుళ్లు ఆరోగ్యంగా ఉన్నారని డా.భరత్ షా వెల్లడించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kidney, Maharashtra, National News