Yediyurappa son : ఈ దశలో సోషల్ మీడియాలో విమర్శలు, ప్రకటనలు, అనవసర వ్యాఖ్యలు చేస్తే అది తన తండ్రి మనోభావాలకు భంగం కలిగించడమే తప్ప మద్దతివ్వడం కాదని యడియూరప్ప కుమారుడు బీవై విజయేంద్ర అన్నారు.
BJP Denied Ticket Yediyurappa son : కర్ణాటక(Karnataka)ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కుమారుడు బీవై విజయేంద్రకు నిరాశ ఎదురైంది. జూన్ 3న . కర్ణాటక లెజిస్లేటివ్ కౌన్సిల్‌లోని 7 సీట్లకు ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారంనాడు నలుగురు పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. ఈ జాబితాలో బీవై విజయేంద్ర పేరు లేదు. బీజేపీ కోర్ కమిటీ సిఫారుసు చేసిన పేర్లలో విజయేంద్ర పేరు ఉన్నప్పటికీ పార్టీ కేంద్ర అధిష్ఠానం ఆయనకు టిక్కెట్ ఇచ్చేందుకు నిరారించింది. బీజేపీ అధిష్ఠానం విడుదల చేసిన జాబితాలో మాజీ ఉప ముఖ్యమంత్రి, పార్టీ ఉపాధ్యక్షుడు లక్ష్మణ్ సవడి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు హేమలత నాయక్, ఎస్.కేశవప్రసాద్, ఎస్స మోర్చా అధ్యక్షుడు చలవడి నారాయణస్వామి పేర్లు ఉన్నాయి.
విజయేంద్ర పేరు లేకుండా అభ్యర్థుల జాబితాను ప్రకటించడంపై విజయేంద్ర మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ(BJP) హైకమాండ్ మరియు యడియూరప్పకు బద్ధ శత్రువుగా పేరున్న జాతీయ సంస్థాగత కార్యదర్శి బి.ఎల్. సంతోష్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జూన్ 3న జరగనున్న కర్ణాటక ఎమ్మెల్సీ ఉపఎన్నికకు విజయేంద్రకు టిక్కెట్ నిరాకరించినందుకు బీజేపీకి వ్యతిరేకంగా సోషల్ మీడియా ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో తన మద్దతుదారులందరూ సంయమనం పాటించాలని విజయేంద్ర కోరారు. అందరూ సాధారణ పార్టీ కార్యకర్తలే.. సమర్థులను పార్టీ ఎప్పుడూ నిరాశపరచలేదని, ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని, ప్రశాంతంగా, మర్యాదగా ఉండాలని విజయేంద్ర అన్నారు.
"సంఘ్ క్రమశిక్షణ, పార్టీ సంస్థాగతమే నిజమైన సేవ అని మా నాన్న ఎప్పుడూ నమ్మి ఆ బాటలో పయనించేవారు. అదే కారణంతో నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు కర్ణాటక పార్టీ, ప్రజలు సహకరించారు"అని విజయేంద్ర తెలిపారు. పార్టీ తనకు ఉపాధ్యక్ష పదవిని ఇచ్చి,తన నాయకత్వాన్ని నిలబెట్టిందని..ఈ దశలో సోషల్ మీడియాలో విమర్శలు, ప్రకటనలు, అనవసర వ్యాఖ్యలు చేస్తే అది తన తండ్రి మనోభావాలకు భంగం కలిగించడమే తప్ప మద్దతివ్వడం కాదని అన్నారు.
రాష్ట్ర బీజేపీ విభాగం పంపిన జాబితా నుంచి అభ్యర్థులను హైకమాండ్ ఎంపిక చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్ తెలిపారు. విజయేంద్ర పేరును కోర్ కమిటీ ఏకగ్రీవంగా సిఫార్సు చేసింది. పార్టీలో ఆయనకు ఇతరత్రా అవకాశాలు ఉన్నాయని, టిక్కెట్లు ఇచ్చే సమయంలోనే అన్ని లెక్కలు వేస్తారని, విజయేంద్ర పార్టీ ఉపాధ్యక్షుడు, మరిన్ని బాధ్యతలు నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా విజయేంద్రను నిలబెట్టేందుకు పార్టీ ఆసక్తితో ఉందని, ఎన్నికల ముందు ఆయనకు పార్టీలో మరింత పెద్ద బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తన కుమారుడికి ఎమ్మెల్సీ టిక్కెట్‌ను యడియూరప్ప ఆశించారని, తద్వారా బసవరాజ్ బొమ్మై క్యాబినెట్లోకి మంత్రిగా విజయేంద్రను చేయాలని అనుకున్నారని వార్తలు వచ్చాయి.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.