ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (Delhi Municipal Corporation) మేయర్ పీఠం ఎవరిది? ఇప్పుడు దీని గురించే దేశ రాజధానిలో రచ్చ జరుగుతోంది. ఐతే మేయర్ ఎన్నిక వేళ.. ఎంసీడీ కార్యాలయంలో రాసాభాస జరిగింది. ఆమాద్మీ (AAP), బీజేపీ (BJP) సభ్యులు బాహాబాహీకి దిగారు. తాము ఎక్కువ స్థానాలు గెలిచినప్పటికీ.. మేయర్ పీఠం దక్కించకునేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని ఆమాద్మీ పార్టీ కౌన్సిలర్లు మండిపడుతున్నారు. బీజేపీ సభ్యులతో వాగ్వాదానికి దిగారు. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం.. మీది మీదకు వెళ్లడంతో.. సభలో రచ్చ రచ్చ జరిగింది. అసలు ఇవాళ మేయర్ ఎన్నిక ఉంటుందా? ఉండాదా ? సందేహాలు కలుగుతున్నాయి.
Doctors-Pharma Companies: మోదీ సర్కార్ కీలక నిర్ణయం..ఫార్మా కంపెనీలు, డాక్టర్ల బంధంపై నిఘా
గొడవకు కారణమిదే?
మేయర్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రొటెం స్పీకర్‌గా సీనియర్ సభ్యుడైన ముకేశ్ గోయెల్‌ను ఢిల్లీ ప్రభుత్వం ప్రతిపాదించింది. సీనియర్ సభ్యుడినే ప్రొటెం స్పీకర్‌గా నియమించడం ఆనవాయితీగా వస్తోంది. ఐతే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనా మాత్రం ముకేశ్ గోయెల్‌ని కాకుండా.. సత్య శర్మను ప్రొటెం స్పీకర్‌గా నియమించారు. ఆయన సభలోకి చేరుకొని.. కౌన్సిలర్‌ల ప్రమాణస్వీకారాన్ని ప్రారంభించారు. ఇంతలోనే ఆమాద్మీ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి.. ఆందోళన చేశారు. బీజేపీకి అనుకూలంగా వ్యవహరించేందుకే సత్యశర్మను ప్రొటెం స్పీకర్‌గా నియమించారని మండిపడ్డారు. బీజేపీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు.
#WATCH | Delhi: BJP and AAP councillors clash with each other and raise slogans against each other ahead of Delhi Mayor polls at Civic Centre. pic.twitter.com/ETtvXq1vwM
— ANI (@ANI) January 6, 2023
కాగా, డిసెంబరులో జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమాద్మీ ఘన విజయం సాధించింది. మొత్తం 250 స్థానాలకు గాను.. 134 స్థానాల్లో ఆప్ అభ్యర్థులు గెలిచారు. బీజేపీ 104 స్థానాలకే పరిమితమయింది. కాంగ్రెస్ కేవలం 9 సీట్లతో సరిపెట్టుకుంది. ఎక్కువ సీట్లలో గెలిచినందున మేయర్ పీఠం తమకే వస్తుందని ఆమాద్మీ ధీమాగా ఉంది. తమ పార్టీ తరపున షెల్లీ ఒబెరాయ్‌ని మేయర్ అభ్యర్థిగా నిలబెట్టింది. తమకు తగినంత బలం లేనప్పటికీ.. బీజేపీ కూడా మేయర్ ఎన్నికల్లో పోటీకి దిగింది. బీజేపీ తరపున రేఖా గుప్తా పోటీలో ఉన్నారు.
బీజేపీ కుట్రపూరితంగానే మేయర్ ఎన్నికల్లో పోటీచేస్తోందని.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని ఆమాద్మీ విమర్శలు గుప్పిస్తోంది. ఐతే ఎన్నికల్లో పోటీ చేయడం తప్పేమీ కాదని.. ఆమాద్మీ, కాంగ్రెస్ సభ్యులు కూడా తమకే మద్దతు తెలపవచ్చని బీజేపీ చెబుతోంది. అటు కాంగ్రెస్ మాత్రం.. తాము ఎవరికీ మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేసింది. ఈ పరిణామాల మధ్య ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో రసాభాసగా మారాయి. మరి మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.