దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Liquor Scam)లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో విచారణను వేగవంతం చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate).. మరో ఇద్దరిని అరెస్ట్ చేసింది. అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డితో పాటు వినయ్ బాబు అనే మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. వినయ్ బాబు పెర్నాడ్ రికార్డ్ (Pernod Ricard) అనే లిక్కర్ కంపెనీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈడీ అధికారులు మూడు రోజులుగా శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబును విచారిస్తున్నారు. విచారణలో పలు కీలక వివరాలను రాబట్టిన అనంతరం.. ఇవాళ ఉదయం వారిని అరెస్ట్ చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశారు. తెలంగాణకు చెందిన రాబిన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ డైరెక్టర్ బోయినపల్లి అభిషేక్, ముంబైకి చెందిన విజయ్ నాయర్, ఢిల్లీకి చెందిన సమీర్ మహేంద్రును ఇది వరకే ఈడీ అధికారులు అరెస్టు చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఇప్పటికే ఆమాద్మీ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న దినేశ్ అరోరా సీబీఐకి అప్రూవర్‌గా మారారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాకు దినేశ్ అరోరా అత్యంత సన్నిహితుడు. తనపై ఎలాంటి ఒత్తిడి లేదని , తన స్టేట్మెంట్ ఇచ్చేందుకు సిద్దమని తెలిపారు. కొద్దిరోజుల క్రితమే సీబీఐ కోర్టు దినేశ్ అరోరాకు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. నవంబర్ 14వ తేదీన దినేష్ అరోరా స్టేట్మెంట్ను సీబీఐ కోర్టు రికార్డు చేయబోతోంది. ఆయన ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా మరికొన్ని అరెస్ట్‌లు ఉండవచ్చని తెలుస్తోంది.
ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న సమీర్ మహేంద్రు రాధా ఇండస్ట్రీస్ బ్యాంక్ ఖాతాకు కోటి రూపాయలు బదిలీ చేసినట్లు సీబీఐ విచారణలో తేలింది. రాధా ఇండస్ట్రీస్ దినేష్ అరోరాకి సంబంధించినది. ఆయన మనీష్ సిసోడియా అనుచరుడు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, దినేష్ అరోరా సహా నిందితులందరిపై ఐపీసీ సెక్షన్ 120 బి, 477 ఏతో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7 కింద సీబీఐ కేసు నమోదు చేసింది.
ఢిల్లీలో అర్వింద్ కేజ్రీవాల్ (Arvund Kejriwal) నేతృత్వంలోని ఆమాద్మీ (AAP) సర్కార్ 2021-22కు గాను కొత్తగా ఎక్సైజ్ పాలసీ రూపొందించిన విషయం తెలిసిందే. 2021 నవంబర్ 17న అమల్లోకి వచ్చింది. దీని కింద ఢిల్లీని 32 జోన్లుగా విభజించారు. మొత్తం 849 షాపులకు సంబంధించి ప్రైవేట్ బిడ్డర్లకు రిటైల్ లైసెన్సులు ఇచ్చారు. 144 కోట్ల రూపాయల బకాయిలను కూడా మాఫీ చేశారు. ఈ లిక్కర్ పాలసీలో వందల కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ పెద్దలకు భారీ మొత్తంలో ముడుపులు అందాయని బీజేపీ, కాంగ్రెస్ ఆరోపించాయి. ఎల్జీకి కూడా ఫిర్యాదు చేశాయి. ఈక్రమంలోనే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా జూలైలో సీబీఐ విచారణకు ఆదేశాలు జారీచేశారు. మనీలాండరింగ్ జరిగిందన్న ఆరోపణలు రావడంతో ఈడీ కూడా రంగంలోకి దిగి.. దర్యాప్తు చేస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CBI, Delhi liquor Scam, Enforcement Directorate, New Delhi