news18-telugu
Updated: November 17, 2020, 3:06 PM IST
ప్రతీకాత్మక చిత్రం
ఢిల్లీలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులను అదుపు చేయడం ఎలా అనే దానిపై కసరత్తు చేస్తున్న ఆ రాష్ట్ర ప్రభుత్వం... ఇందుకోసం అవసరమైతే మళ్లీ కొన్ని ప్రాంతాల్లో లాక్డౌన్ విధించాలనే యోచన చేస్తోంది. ఇందుకు సంబంధించి కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసింది. కరోనా వైరస్ కేసులను అదుపు చేసేందుకు మార్కెట్ ప్రాంతాల్లో తిరిగి లాక్డౌన్ విధించేందుకు అనుమతించాలంటూ కేజ్రీవాల్ ప్రభుత్వం కేంద్రానికి ఒక ప్రతిపాదన పంపనుంది. ఈ విషయాన్ని కేజ్రీవాల్ స్వయంగా వివరించారు. ఢిల్లీలో కేసులు పెరుగుతున్నందున, కేంద్ర ప్రభుత్వానికి జనరల్ ప్రపోజల్ ఒకటి పంపుతున్నామని తెలిపారు.
నిబంధనలు పాటించని ప్రాంతాలు తిరిగి కోవిడ్-19 హాట్‌స్పాట్‌గా మారే అవకాశాలున్నాయని... పరిస్థితి అనివార్యతను బట్టి అలాంటి మార్కెట్లలో మళ్లీ లాక్డౌన్ విధించాలని ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. రాజధాని నగరంలో కోవిడ్ పరిస్థితిని అదుపు చేసేందుకు ఢిల్లీ, కేంద్ర ప్రభుత్వం రెట్టింపు యత్నాలు చేస్తున్నట్టు వెల్లడించారు. దీంతో పాటు తక్షణం 750 ఐసీయూ పడకలు పెంచడం ద్వారా ఢిల్లీ ప్రజలకు కేంద్రం సాయంగా నిలిచిందని సీఎం కృతజ్ఞతలు చెప్పారు. ఇరు ప్రభుత్వాలు, ఏజెన్సీలు కోవిడ్ నియంత్రణ ప్రయత్నాలు రెట్టింపు చేసినప్పటికీ ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుంటే ఫలితం ఉండదని కేజ్రీవాల్ హెచ్చరించారు.
ప్రజలు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించి, సామాజిక దూరం నిబంధనలను పాటించాలని సీఎం కోరారు. ఇక వివాహాది కార్యక్రమాలకు 200 మందిని అనుమతిస్తూ తీసుకున్న నిర్ణయంలో మార్పులు చేయాలని కేజ్రీవాల్ ప్రభుత్వం లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌ను కోరింది. వివాహ కార్యక్రమాలకు 50 మందిని మాత్రమే అనుమతించాల్సిందిగా సూచించింది. కొద్దిరోజుల నుంచి దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్నా.. ఢిల్లీలో మాత్రం కరోనా కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కరోనా మూడో దశలో ఉందని కేజ్రీవాల్ సైతం ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. ఇక వాయు కాలుష్యం కారణంగా కరోనా మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని భావించిన కేజ్రీవాల్ సర్కార్... దీపావళి సందర్భంగా టపాసులు కాల్చవద్దని కఠిన నిబంధనలు విధించింది.
Published by:
Kishore Akkaladevi
First published:
November 17, 2020, 3:06 PM IST