(K.Veeranna,News18,Medak)
దేశ ప్రధాని నరేంద్ర మోదీని (Prime minister modi)స్వయంగా కలవడం, ఆయన పాల్గొనే పార్లమెంట్ సెంట్రల్ హాలులో కూర్చొవడం, అదే సభలో మాట్లాడే అవకాశం రావడం అంటే అంత ఆషామాషీ విషయం కాదు. చాలా గొప్పగా భావించాలి. అలాంటి అరుదైన అవకాశం దక్కాలంటే ఎంతో అనుభవం, టాలెంట్, విద్యార్హతతో పాటు అదృష్టం కూడా ఉండాలి. అలాంటి అరుదైన అవకాశం దక్కించుకుంది తెలంగాణకు చెందిన ఓ సాధారణ డిగ్రీ విద్యార్దిని. అది కూడా సిద్దిపేట(Siddipet)జిల్లాకు చెందిన యువతి శ్రీవర్షిణి (Srivarshini)కావడంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పార్లమెంట్‌కు సిద్దిపేట డిగ్రీ విద్యార్దిని ..
విద్యార్ధి దశలోనే ఓ సాధారణ నిరుపేద విద్యార్దిని గొప్ప అవకాశాన్ని దక్కించుంది. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో మాట్లాడే అరుదైన ఛాన్సు పొందింది. తెలంగాణలోని సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం చదువుతున్న బి.శ్రీవర్ణిణి ఈనెల 23వ తేది నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుట్టిన రోజును పురస్కరించుకొని ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ప్రధాని మోదీ సమక్షంలో మాట్లడనుంది. దేశ వ్యాప్తంగా అన్నీ రాష్ట్రాల నుంచి మొత్తం 27మంది యువతీ, యువకులను ఎంపిక చేస్తే అందులో ఒకరిగా ఎంపికైంది శ్రీవర్షిణి.
ప్రధాని సమక్షంలో మాట్లాడే ఛాన్స్..
నెహ్రూ యువ కేంద్రం సిద్దిపేట యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి వక్తృత్వ పోటీలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల బీఏ విద్యార్థిని శ్రీ వర్షిణి ప్రథమ స్థానంలో నిలిచింది. వక్తృత్వ పోటీలో జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరచడంతో జాతీయ స్థాయికి ఎంపికైంది.ఈసందర్బంగా జిల్లా యువజన అధికారి మూల రంజిత్ రెడ్డి, కార్యక్రమ అధికారి జి. కింణ్ కుమార్ లు శ్రీవర్షిణి కి జాతీయ స్థాయి ఆహ్వాన పత్రం, విమాన టికెట్స్ అందించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డా. సీహెచ్ ప్రసాద్మాట్లాడుతూ శ్రీవర్షిణి పార్లమెంటు సెంట్రల్ హాల్లో ప్రధాని మోడీ సమక్షంలో మాట్లాడే అవకాశం దక్కడం తమ కళాశాలతో పాటు తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమన్నారు.
శ్రీవర్షిణి టాలెంట్‌పై ప్రముఖుల హర్షం..
స్వాతంత్రోద్యమంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్ర, ఆయన జాతీయభావం, జీవిత చరిత్రతో పాటు ఆయన గురించి నిర్వహించిన వక్తృత్వ పోటీల్లో జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన తాను జాతీయ స్థాయికి ఎంపికైనందుకు చాలా ఆనందంగా ఉందని శ్రీవర్షిణి తెలిపింది. ఇలాంటి అవకాశం అందరికి రాదని వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవడం..దాన్ని సద్వినియోగ చేసుకోవడంలోనే విద్యార్ధుల ప్రతిభ కనిపిస్తుందని ఆమె అంటోంది. పార్లమెంటు సెంట్రల్ హాల్లో ప్రధాని మోడీ సమక్షంలో మాట్లాడే అవకాశం దక్కడం నిజంగా చాలా గొప్ప విషయమని గర్వంగా చెబుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Pm modi, Siddipet, Telangana News