దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ స్వైరవిహారం చేస్తోంది. పార్లమెంట్ సిబ్బంది నుంచి పోలీసుల దాకా వేల సంఖ్యలో సిబ్బంది కరోనా కాటుకు గురవుతున్నారు. కొత్త కేసులు వెల్లువలా వస్తుండటంతో ఢిల్లీ దాదాపు లాక్ డౌన్ దిశగా పయనిస్తోంది. ఈలోపే కేంద్ర ప్రభుత్వ పెద్దలకు సైతం కరోనా సోకిందనే వార్త కలవరపెడుతోంది. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తాజాగా కరోనా బారినపడ్డారు. స్వల్ప లక్షణాలతో టెస్టులు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయినట్లు సోమవారం ఆయన స్వయంగా ప్రకటించారు.
‘తేలికపాటి లక్షణాలతో ఈరోజు నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. నేను హోం క్వారంటైన్లో ఉన్నాను. ఇటీవల నా కాంటాక్ట్‌కి వచ్చిన ప్రతి ఒక్కరూ కచ్చితంగా సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లాలని, అందరూ టెస్టులు చేయించుకోవాలని అభ్యర్థిస్తున్నా’అని రాజ్ నాథ్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో తెలిపారు. కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన తర్వాత రక్షణ మంత్రి కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉండిపోయారు.
కేంద్ర సర్కారులో దాదాపు టాప్-3 నేతగా కొనసాగుతోన్న రక్షణ మంత్రి రాజ్ నాథ్ కొవిడ్ బారినపడటంతో కేంద్ర వర్గాల్లో ఆందోళన నెలకొంది. గడిచిన వారం రోజులుగా ఆయన పలు కార్యక్రమాల్లో బిజీగా ఉండటంతో మంత్రిని కలిసినవారంతా ఇప్పుడు టెస్టులు చేయించుకోవల్సిన పరిస్థితి. కాగా, రాజ్ నాథ్ ఇటీవల ప్రధాని మోదీనిగానీ, ఇతర మంత్రులనుగానీ కలిశారా, లేదా అనేది వెల్లడికాలేదు.
ఢిల్లీలో కరోనా వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది. మొన్ననే పార్లమెంట్ భవనంలో పని చేస్తోన్న సిబ్బందిలో 400 మందికి కొవిడ్ సోకడంతో రాజ్యసభలో 50 శాతం సిబ్బందితోనే పనిచేస్తున్నారు. ఢిల్లీ పోలీస్ విభాగానికి చెందిన 1000 మంది పోలీసులు తాజాగా కొవిడ్ బారిన పడ్డారు. ఢిల్లీలో రోజువారీ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. లాక్ డౌన్ విధింపు ఉండదని సీఎం కేజ్రీవాల్ చెబుతున్నా.. ఆ స్థాయిలోనే ఆంక్షలు పెంచుతూ పోతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Coronavirus, Covid, Delhi, Rajnath Singh