న్యూఢిల్లీ: తమిళనాడు రాష్ట్రంలో జరిగిన ఐఏఎఫ్ హెలికాఫ్టర్ ప్రమాద ఘటనలో భారత తొలి సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ప్రాణాలు కోల్పోవడంపై లోక్‌సభ లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటన చేశారు. లోక్‌సభ సభ్యులంతా బాధాతప్త హృదయాలతో బిపిన్ రావత్‌తో పాటు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి అంజలి ఘటించారు. చనిపోయిన వారి పార్థివ దేహాలను ఇవాళ సాయంత్రం ఢిల్లీకి తీసుకురానున్నట్లు రాజ్‌నాథ్ ప్రకటించారు. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారని, గాయపడిన ఒకరిని వెల్లింగ్‌టన్ ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. గాయపడిన వరుణ్ సింగ్ ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నట్లు రాజ్‌నాథ్ పేర్కొన్నారు. ఈ ఘటనలో అమరులైన వారికి దు:ఖం నిండిన మనసుతో అంజలి ఘటిస్తున్నానని, వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా.. రాజ్యసభ కూడా ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మ శాంతించాలని రెండు నిమిషాల పాటు మౌనం పాటించింది. రాజ్యసభ సభ్యులంతా లేచి నిల్చుని నివాళులర్పించారు.
తమిళనాడులోని జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఆయన భార్య సహా 13 మంది చనిపోయారు. ఈ విషయాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ధృవీకరించింది. ఉదయం తమిళనాడులో హెలికాప్టర్ ప్రమాదం జరగడంతో ఆర్మీ అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కూనూరులో ఆర్మీకి చెందిన హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో సీడీఎస్ బిపిన్ రావత్ (CDS Bipin rawat) తో పాటు పలువురు ఆర్మీ ఉన్నతాధికారులు ఉండటంలో అంతా అప్రమత్తమయ్యారు. ఆర్మీకి చెందిన MI-17 V5 విమానం... నీలగిరి జిల్లా కూనూర్ సమీపంలోని అటవీ ప్రాంతంలో కుప్పకూలింది.
ఢిల్లీ నుంచి ఊటీలోని ఓ డిఫెన్స్ కాలేజీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం హెలికాప్టర్‌లో 9 మంది ఉన్నట్లు తెలిసింది. అయితే అనంతరం అందులో 14 మంది ఉన్నట్టు ధృవీకరించారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు బిపిన్ రావత్ తమిళనాడుకు వచ్చారు. కోయంబత్తూరులోని సూలూరు ఎయిర్ బేస్ వరకు విమానంలో వెళ్లారు. అక్కడ వీరితో పాటు మరో ఐదుగురు కలిసి.. మొత్తం 14 మంది ప్రత్యేక హెలికాప్టర్‌లో కూనూర్‌కు బయలుదేరారు. ఐతే సూలూర్ ఎయిర్ బేస్ నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే కూనూరు సమీపంలో కూలిపోయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bipin Rawat, Helicopter Crash, Lok sabha, Parliament, Rajnath Singh, Rajya Sabha