ఔను. ప్రధాని నరేంద్ర మోదీ మీద ఓ ‘మృతుడు’ పోటీ చేయనున్నాడు. లేదా ఓ ‘మృతురాలు’ పోటీ చేస్తుంది. వినడానికి వింతగా ఉన్నా, సరదాగా ఉన్నా ఇది నిజం. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి నుంచి లేదా మరెక్కడి నుంచైనా నరేంద్ర మోదీ పోటీ చేస్తే ఆయనపై ఓ ‘మృతుడు’ పోటీకి దిగుతాడు. ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా? కానీ, సాధ్యమే అంటున్నారు మృతుల సంఘం అధ్యక్షుడు లాల్ బిహారీ.
ఇంతకీ విషయం ఏంటంటే, దేశంలో ఎన్నికల కమిషన్ అధికారుల నిర్వాకం వల్ల వివిధ రాష్ట్రాల్లో ఓటర్ల లిస్టులో జరిగే విచిత్రాలు అన్నీ ఇన్నీ కావు. చనిపోయిన వారి పేర్లు ఓటర్ల లిస్టులో ఉంటాయి. బతికి ఉన్న వాళ్లు, కొన్ని సంవత్సరాలుగా అదే ఇంట్లో ఉంటున్న వారి పేర్లను కూడా ఓటర్ల లిస్టులో నుంచి తొలగిపోతాయి. ఇలాంటి ఘటనలు తాజాగా తెలంగాణలో కూడా జరిగాయి. కొన్ని వేల మంది పేర్లు గల్లంతయ్యాయి. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రజత్ కుమార్ కూడా అంగీకరించారు. వచ్చే ఎన్నికల్లో ఇలాంటివి లేకుండా చూసుకుంటామని చెప్పారు. అలాగే, కొంతమంది చనిపోయిన వారి పేర్లు కూడా లిస్టులో ఉన్నాయనే విమర్శలు వచ్చాయి. తెలంగాణలోనే కాదు ఉత్తరప్రదేశ్‌లో కూడా ఇలాంటి విచిత్రాలు చాలా చోటుచేసుకున్నాయి. కొందరు బతికి ఉన్న ఓటర్లు కూడా చనిపోయినట్టుగా చిత్రీకరించి ఎన్నికల కమిషన్ అధికారులు ఓటర్ల జాబితా తయారు చేశారు.
ఇలాంటి ఘటనలను నిరసిస్తూ, ఎన్నికల కమిషన్‌లో జరుగుతున్న తప్పులను ఎత్తిచూపించేందుకు ‘మృతుల సంఘం’ ఇలాంటి కార్యక్రమం చేపట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ ఒక్కరి మీదే కాదు. దేశంలోని వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షులు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తే, వారి మీద కూడా ఇలాగే పోటీ చేస్తామని లాల్ బిహారీ ప్రకటించారు.
ఇంత సెటైరికల్‌గా ఆలోచించిన మృతుల సంఘం ఒక్క లాజిక్‌ను మిస్ అయింది. పార్లమెంట్ కానీ, అసెంబ్లీ ఎన్నికలకు గానీ పోటీ చేయాలంటే, అసలు ఆ వ్యక్తి ఓటరు అయి ఉండాలి. ఓటర్ల లిస్టులో వారి పేరు ఉండాలి. ఆ ఓటర్ ఐడీ కార్డు నెంబర్‌ను ఎన్నికల అఫిడవిట్లో పేర్కొనాలి. లేకపోతే ఆ నామినేషన్ తిరస్కరణకు గురవుతుంది. ఓటర్ల లిస్టులో పేరు ఉండి, నామినేషన్ వేస్తే, ఇంక ‘మృతుడు’ ఎలా అవుతాడు?.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Lok Sabha Election 2019, Pm modi, Uttar Pradesh Lok Sabha Elections 2019