హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Terror Attack: ఎన్నికలకు ముందు ఉగ్రదాడి.. కశ్మీర్‌లో ఇద్దరు జవాన్లు మృతి

Terror Attack: ఎన్నికలకు ముందు ఉగ్రదాడి.. కశ్మీర్‌లో ఇద్దరు జవాన్లు మృతి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జిల్లాభివృద్ధి మండలి (DDC) ఎన్నికలకు రెండు రోజుల ముందుకు ఉగ్రదాడి జరగడంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. శ్రీనగర్ వ్యాప్తంగా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.

  జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రమూకలు చెలరేగుతూనే ఉన్నాయి. గురువారం శ్రీనగర్‌లోని షరీఫాబాద్ ప్రాంతంలో భద్రతాబలగాలే లక్ష్యంగా టెర్రరిస్టులు దాడి చేశారు. శ్రీనగర్-బారాముల్లా హైవేపై ఈ ఘటన చోటుచేసుకుంది. ఉగ్రదాడిలో ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు. ముంబై ఉగ్రదాడులు జరిగి నేటితో 12 ఏళ్లు పూర్తవుతోంది. ఈ క్రమంలో ఇవాళే ఇండియన్ ఆర్మీ రోడ్ ఓపెనింగ్ పార్టీపై ఉగ్రవాదులు దాడులు చేశారు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న జవాన్లపై కాల్పులు జరిపి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు జవాన్లను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే కన్నుమూశారు. ఘటన అనంతరం జమ్మూకాశ్మీర్ పోలీస్ ఎస్‌వోజీ, సీఆర్పీఎప్ వ్యాలీ QAT ఘటనా స్థలానికి చేరి సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రాంతాన్ని మొత్తం తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పారిపోయిన ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు.


  జిల్లాభివృద్ధి మండలి (DDC) ఎన్నికలకు రెండు రోజుల ముందుకు ఉగ్రదాడి జరగడంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. శ్రీనగర్ వ్యాప్తంగా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. జైషే మహమ్మద్ ఉగ్రవాదులే ఈ దాడులకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఎన్నికల్లో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు కుట్ర చేసినట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీనగర్‌కు అదనపు బలగాలను తరలిస్తున్నారు.

  కాగా, ఇటీవలే జమ్మూలో భారీ ఉగ్రకుట్రను భద్రతా దళాలు భగ్నం చేసిన విషయం తెలిసిందే. నవంబరు 19న ఆయుధాలతో ట్రక్కులో వెళ్తున్న నలుగురు టెర్రరిస్టులను కాల్చిచంపారు. నగ్రోటా ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. సంబా సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దు గుండా నలుగురు జైషే మహమ్మద్ ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడ్డారు. పోలీసులు, భద్రతా దళాల కళ్లు గప్పి జమ్మూ నుంచి శ్రీనగర్‌కు వెళ్తుండగా.. నిఘా వర్గాల సమాచారం మేరకు పోలీసులు నాఖాబందీ నిర్వహించారు. నగ్రొటాలోని టోల్‌ప్లాజా వద్ద వారి వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించగా.. కాల్పులు జరిపారు. భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపి నలుగురు ఉగ్రవాదులకు మట్టుబెట్టారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Jammu kashmir, Terror attack

  ఉత్తమ కథలు