హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Cyclone NIVAR: తీరం దాటిన నివర్.. అల్లకల్లోలంగా సముద్ర తీర ప్రాంతాలు

Cyclone NIVAR: తీరం దాటిన నివర్.. అల్లకల్లోలంగా సముద్ర తీర ప్రాంతాలు

ఇక ఇప్పటికే విశాఖ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో రెండోనెంబర్‌ ప్రమాద హెచ్చరికలు.. కాకినాడ, గంగవరం పోర్టుల్లో ఒకటో నెంబర్‌ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.  (Image:Windy)

ఇక ఇప్పటికే విశాఖ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో రెండోనెంబర్‌ ప్రమాద హెచ్చరికలు.. కాకినాడ, గంగవరం పోర్టుల్లో ఒకటో నెంబర్‌ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. (Image:Windy)

బుధవారం రాత్రి 11.30 గంటల నుంచి గురువారం తెల్లవారుజామున 2.30 గంటల మధ్య పుదుచ్చేరి తీరానికి సమీపంలో నివర్ తుపాన్ తీరం దాటినట్టుగా భారత వాతావరణ శాఖ పేర్కొంది.

నివర్ తుపార్ బుధవారం మరింత బలపడి అతి తీవ్ర తుపాన్‌గా మారింది. ఇది తమిళనాడు, పుదుచ్చేరిలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మరోవైపు ఏపీలోని పలు జిల్లాల్లో కూడా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక, బుధవారం రాత్రి 11.30 గంటల నుంచి గురువారం తెల్లవారుజామున 2.30 గంటల మధ్య పుదుచ్చేరి తీరానికి సమీపంలో నివర్ తుపాన్ తీరం దాటినట్టుగా భారత వాతావరణ శాఖ పేర్కొంది. నివర్ తుపాన్ అతి తీవ్ర తుపాన్ నుంచి తీవ్ర తుపాన్‌గా బలహీనపడిందని వాతావరణ శాఖ తెలిపింది. తుపాన్ తీరం దాటిన వేళ గంటకు 120 నుంచి 145 కి.మీ వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉందని తెలిపింది. తుపాన్ దాటికి చెన్నై సముద్ర తీర ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. నివర్ తుపాన్ తమిళనాడు, పుదుచ్చేరిలపై తీవ్ర ప్రభావం చూపనుంది. మరోవైపు నివర్ ప్రభావం వల్ల గురువారం రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

నివర్‌ ప్రభావంతో తమిళనాడు తీరంలోని చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, నాగపట్నం, తంజావూరు, తిరువరూరు, కరైకల్, పుదుచ్చేరి, కడలూరు, విల్లుపురం జిల్లాల్లోని హార్బర్లలో 6వ నంబర్‌ వరకు ప్రమాద హెచ్చరికలను జారీచేశారు. సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా తమిళనాడు ప్రభుత్వం ప్రజలను కోరింది. చెన్నై మీనంబాక్కం విమానాశ్రయంలో 26 విమాన సర్వీసులను రద్దు చేశారు. అలాగే చెన్నై నుంచి రాకపోకలు సాగించే పలు రైళ్లను రద్దు చేశారు.


ఏపీ విషయానికి వస్తే.. తుపాన్ ప్రభావంతో కర్నూలు, చిత్తూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలకు సహాయక చర్యల కోసం ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను పంపారు. ఇల్లు సురక్షితం కాకపోతే ప్రజలు పునరావస కేంద్రాలకు తరలివెళ్లాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ కె కన్నబాబు తెలిపారు. తుపాను ప్రభావంతో దక్షిణకోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 40-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అన్నారు. రైతులు అప్రమత్తంగా ఉండి పంటల సంరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక, తుపాన్ ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో కూడా గురు, శుక్రవారాల్లో అనేకచోట్ల ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు వచ్చే రెండు రోజులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.

First published:

Tags: Cyclone Nivar

ఉత్తమ కథలు