దూసుకొస్తున్న నిసర్గ.. పశ్చిమ తీరానికి తుఫాన్ ముప్పు

అరేబియా సముద్రంలో వాయుగుండం

గుజరాత్‌లో 11 , మహారాష్ట్ర తీరంలో 10, డామన్ డయ్యూ, దాద్రా నగర్ హవేలీలో ఒకటి చొప్పున ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మోహరించాయి.

 • Share this:
  నైరుతి రుతుపవానలు కేరళను తాకాయని శుభవార్త చెప్పిన భారత వాతావరణ శాఖ.. అదే సమయంలో మరో చేదు వార్త చెప్పింది. భారత్‌కు మరో తుఫాన్ ముప్పు పొంచి ఉందని తెలిపింది. ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఆదివారం ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి వాయుగుండంగా మారిందని.. అనంతరం తుఫాన్‌గా మారుతుందని అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఈ వాయుగుండం గోవాలోని పాంజిమ్‌కు నైరుతి దిశగా 340 కి.మీ, ముంబయికి దక్షణ నైరుతి దిశగా 630 కి.మీ దూరంలో, గుజరాత్‌లోని సూరత్‌కు దక్షణ నైరుతి దిశలో 850 కి.మీ దూరంలో కేంద్రీకృతమైనట్టు సోమవారం మధ్యాహ్నం విడుదల చేసిన బులెటిన్లో పేర్కొన్నారు.

  మంగళవారం ఉదయం తుఫాన్‌గా మారి.. రాత్రి 11 గంటల సమయానికి తీవ్ర తుఫాన్‌గా మారుతుదని వాతావరణ విభాగం తెలిపింది. ‘నిసర్గ’గా పిలుస్తున్న ఈ తుపాను జూన్‌ 3 మధ్యాహ్నానికి దక్షిణ గుజరాత్‌, ఉత్తర మహారాష్ట్ర తీరాలను దాటుతుందని తెలిపింది. డామన్, హరిహరేశ్వర్ (మహారాష్ట్ర) మధ్య తీరం దాటే అవకాశముందని పేర్కొంది.
  ‘నిసర్గ’ ప్రభావంతో గుజరాత్‌, ఉత్తర మహారాష్ట్రల్లో రేపు అర్ధరాత్రి నుంచి భీకర గాలులు వీస్తాయని అధికారులు వివరించారు. బుధవారం ఉదయం గాలుల తీవ్రత మరింత పెరిగి 125 కి.మీ. వేగానికి కూడా చేరవచ్చని తెలిపారు.

  బుధవారం మధ్యాహ్నం తీవ్ర తుఫాన్ తీరం దాటిన తర్వాత.. క్రమంగా తుఫాన్‌గా బలహీనపడుతుంది. గురువారం ఉదయానికి మరింత బలహీనపడి వాయుగుండంగా మారుతుంది. కాగా, ఇటీవల తూర్పు తీరంలో సూపర్ సైక్లోన్ అంఫాన్ అల్లకల్లోలం సృష్టించిన విషయం తెలిసిందే. ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో విధ్వంసం సృష్టించడంతో... నిసర్గను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. గుజరాత్‌లో 11 , మహారాష్ట్ర తీరంలో 10, డామన్ డయ్యూ, దాద్రా నగర్ హవేలీలో ఒకటి చొప్పున ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మోహరించాయి.
  Published by:Shiva Kumar Addula
  First published: